భాషను కాపాడుకోవటంతో పాటు నలుగురికీ సాయం చేయండి: వెంకయ్య నాయుడు

- January 03, 2023 , by Maagulf
భాషను కాపాడుకోవటంతో పాటు నలుగురికీ సాయం చేయండి: వెంకయ్య నాయుడు

దుబాయ్: భాష సంస్కృతులకు సారధులుగా, వాణిజ్యానికి వారధులుగా ప్రవాస భారతీయులు దేశ ప్రతిష్టను నిలబెట్టాలని భారత పూర్వ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు  ఆకాంక్షించారు. ప్రస్తుతం దుబాయ్ పర్యటనలో ఉన్న ఆయన, అక్కడి తెలుగు అసోసియేషన్ ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా ప్రసంగించారు. మన భాష, సంస్కృతులను విశ్వవ్యాపితం చేస్తున్న ప్రవాసులను సాంస్కృతిక వారధులుగా అభివర్ణించిన ఆయన, దుబాయ్ లో ఉన్న తెలుగు వారి కోసం సేవా కార్యక్రమాలతో పాటు, సామాజిక, సాంస్కృతిక పరిరక్షణ కార్యక్రమాలను నిర్వహిస్తున్న తెలుగు అసోసియేషన్ ను అభినందించారు. తెలుగు వారి కష్టపడే తత్వమే వారి గుర్తింపు అన్న ఆయన, శాంతి, సౌభ్రాతృత్వాన్ని వారసత్వంగా అందించిన మన సంస్కృతిలో కట్టుబాట్లే భారతీయుల బలమని తెలిపారు.

వేపపుల్ల మొదలుకుని, అణుశాస్త్రం వరకూ ఎన్నో మెలకువలు ప్రపంచానికి నేర్పింది భారతీయులేనన్న ముప్పవరపు వెంకయ్యనాయుుడు, పురోభివృద్ధిని కోరేవారు పూర్వ వృత్తాన్ని మరువకూడదు అనేది పెద్దల సూక్తిని ఉటంకించారు.మన భౌతిక సంపదను ఎంతో పోగొట్టుకున్నామన్న ఆయన, మన స్మధర్మం సంస్కృతికి దూరం కాకూడదని సూచించారు. మన మన కట్టు, బొట్టు, మన భాష, ప్రాస, యాస, మన గోసలను కాపాడుకోవాలన్న ఆయన, మన పండుగలు, ఉత్సవాలను గౌరవించుకోవాలని తెలిపారు.ప్రపంచ పురోగతిలో భాగస్వామ్యం వహిస్తున్న భారతీయుల్ని చూస్తుంటే గర్వంగా ఉందన్న ఆయన, వారంతా కలిసి వసుధైన కుటుంబకం అనే భారతీయ వారసత్వపు తత్వానికి సార్థకత తీసుకొస్తున్నారని పేర్కొన్నారు.
ప్రతి వ్యక్తి ఎంత స్థాయికి ఎదిగినా మాతృమూర్తి, మాతృభాష, జన్మభూమి, మాతృదేశం, చదువు చెప్పిన గురువును మరువ కూడదన్న ముప్పవరపు వెంకయ్యనాయుడు, మన భాషలో మన సంస్కృతి ఉందని తెలిపారు. ప్రాచీన భాష అని, విశిష్టమైన భాష అని, శ్రేష్టమైన భాష అని, సుందర తెలుగు అని చెప్పుకుంటే సరిపోదన్న ఆయన, ఆత్మవిశ్వాసాన్ని పెంచే ఆలంబనగా భాషకు పట్టం కట్టాలని సూచించారు. భాషను కాపాడుకోవటంతో పాటు నలుగురికీ సాయం చేసే తత్వాన్ని పెంచుకోవాలని సూచించిన ఆయన, ప్రతి ఒక్కరూ జన్మనిచ్చిన గడ్డ రుణాన్ని తీర్చుకునే ప్రయత్నం చేయాలని సూచించారు. 

కోవిడ్ మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తున్న తరుణంలో ప్రవాస భారతీయులు అందించిన సేవలను ప్రశంసించిన ముప్పవరపు వెంకయ్యనాయుడు, ఈ స్ఫూర్తి ప్రతి ఒక్కరిలో ప్రేరణ నింపాలని ఆకాంక్షించారు. ఆజాదీకా అమృత మహోత్సవాలు జరుపుకుంటున్న ప్రస్తుతం తరుణంలో ప్రతి ఒక్కరూ ఈ స్ఫూర్తిని అందింపుచ్చుకోవాలన్న ఆయన, ఈ ఉత్సవాల వెనుక ప్రధాన ఉద్దేశం, స్వరాజ్య స్ఫూర్తిని భవిష్యత్ తరాలకు అందించటమే అని తెలిపారు. భారతదేశం పురోగమన మార్గంలో ఉందన్న ఆయన, ఈ స్ఫూర్తి మున్ముందు కొనసాగాలని ఆకాంక్షించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com