రాజకుటుంబ ఉద్యోగి అంటూ.. 23 లక్షల ఢిల్లీ లగ్జరీ హోటల్ బిల్ ఎగ్గొట్టిన వ్యక్తి

- January 17, 2023 , by Maagulf
రాజకుటుంబ ఉద్యోగి అంటూ.. 23 లక్షల ఢిల్లీ లగ్జరీ హోటల్ బిల్ ఎగ్గొట్టిన వ్యక్తి

యూఏఈ: అబుధాబి రాజకుటుంబానికి చెందిన ఉద్యోగిగా నటించిన ఓ వ్యక్తి రూ.23,46,413 (సుమారు AED103,254) బిల్లును ఎగ్గొట్టి న్యూఢిల్లీలోని లీలా ప్యాలెస్ నుండి చెప్పా పెట్టకుండా పారిపోయాడు. ఢిల్లీ పోలీసుల కథనం ప్రకారం.. పారిపోయిన వ్యక్తిని MD షరీఫ్‌గా గుర్తించారు. షరీఫ్ ఫైవ్ స్టార్ లగ్జరీ హోటల్‌లో నాలుగు నెలల పాటు బస చేసి, అనంతరం హోటల్ సిబ్బందికి చెప్పకుండా భిల్లు ఎగ్గొట్టి వెళ్లిపోయాడు. దాంతో శనివారం హోటల్ మేనేజ్‌మెంట్ ఫిర్యాదుతో షరీఫ్‌పై కేసు నమోదు చేశారు.  హోటల్ సిబ్బంది దాఖలు చేసిన ఫిర్యాదు ప్రకారం.. యూఏఈలో అబుధాబి రాజకుటుంబానికి చెందిన షేక్ ఫలాహ్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ కార్యాలయంలో పనిచేశానని షరీఫ్ హోటల్ అధికారులకు చెప్పినట్లు సమాచారం. అతను హోటల్ సిబ్బందికి ఇచ్చిన వ్యాపార కార్డు, యూఏఈ రెసిడెంట్ కార్డ్, ఇతర పత్రాలు నకిలీవిగా తేలాయి. ప్రస్తుతం వీటిపై విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. షరీఫ్ 2022 ఆగస్ట్ 1న చెక్ ఇన్ చేసి నవంబర్ 20 వరకు హోటల్ లో ఉన్నాడు. గది, ఇతర సౌకర్యాల మొత్తం బిల్లు రూ. 35 లక్షలకు చేరిందని,  అందులో షరీఫ్ దాదాపు రూ. 11.5 లక్షలు చెల్లించాడని హోటల్ సిబ్బంది తెలిపారు. కాగా, షరీఫ్ ఇచ్చిన రూ.20 లక్షల చెక్కును నవంబర్ లో బ్యాంకులో వేయడంతో ఫండ్స్ లేని కారణంగా అది బౌన్స్ అయిందని ఫిర్యాదులో హోటల్ మేనేజ్ మెంట్ పేర్కొంది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com