వరల్డ్ కప్ కోసం బలమైన జట్టును తయారు చేయడమే లక్ష్యం: కెప్టెన్ రోహిత్ శర్మ

- January 17, 2023 , by Maagulf
వరల్డ్ కప్ కోసం బలమైన జట్టును తయారు చేయడమే లక్ష్యం: కెప్టెన్ రోహిత్ శర్మ

హైదరాబాద్: రాబోయే వరల్డ్ కప్ కోసం బలమైన జట్టును తయారు చేయడమే తమ లక్ష్యమని భారత క్రికెట్ కెప్టెన్ రోహిత్ శర్మ అన్నారు.బుధవారం ఇండియా-న్యూజిలాండ్ జట్ల మధ్య వన్డే మ్యాచ్ జరగబోతున్న సంగతి తెలిసిందే.హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో మధ్యాహ్నం ఈ మ్యాచ్ జరుగుతుంది.

ఈ సందర్భంగా మంగళవారం భారత్, న్యూజిలాండ్ జట్ల కెప్టెన్లు రోహిత్ శర్మ, టామ్ లాథమ్ మీడియా సమావేశం నిర్వహించారు. తమ జట్ల వ్యూహాల గురించి తెలిపారు. రోహిత్ శర్మ మాట్లాడుతూ ‘‘న్యూజిలాండ్ వంటి బలమైన జట్టుతో తాజా సిరీస్ ఆడుతున్నాం. మా శక్తి సామర్ధ్యాలను పూర్తి స్థాయిలో పరీక్షించుకోవడానికి ఇదో మంచి అవకాశం. శ్రీలంకతో జరిగిన గత సిరీస్‌లో తుది జట్టులో చోటు దక్కించుకోలేకపోయిన ఇషాన్ కిషన్‌కు ఈ సారి జట్టులో చోటు కల్పించాలని నిర్ణయించాం. మిడిల్ ఆర్డర్‌లో అతడికి అవకాశమిస్తాం. బౌలర్ మొహమ్మద్ సిరాజ్ బాగా ఆడుతున్నాడు. అన్ని ఫార్మాట్లలోనూ అతడు జట్టుకు కీలక ఆటగాడిగా ఉన్నాడు. అతడు కొత్త బంతితో వికెట్లు తీయగలడు. జట్టుకు మంచి బూస్టప్ ఇస్తున్నాడు. వరల్డ్ కప్ దగ్గర పడుతుండటంతో అతడిపై ఎక్కువ ఒత్తిడి పెంచాల్సి వస్తోంది.

బుమ్రా లేకపోవడంతో జట్టుకు సిరాజ్ ప్రధాన బౌలర్‌గా ఉంటున్నాడు. రాబోయే వరల్డ్ కప్‌లో అతడు కీలక బౌలర్‌గా నిలుస్తాడు. సిరాజ్‌కు ఉప్పల్ స్టేడియం హోం గ్రౌండ్. తొలిసారి సిరాజ్ ఇక్కడ ఆడుతున్నాడు.అతడికి ఆల్ ది బెస్ట్. బుధవారం నాటి మ్యాచ్‌లో ఎలా ఆడాలి అనేదానిపై మా జట్టు దృష్టి సారించింది. ప్రత్యర్థి జట్టు ఎంత బలంగా ఉందన్నదాని గురించి మేం ఆలోచించడం లేదు.మా శక్తి సామర్ధ్యాలపైనే విజయం ఆధారపడి ఉంటుంది. రాబోయే వరల్డ్ కప్ కోసం మంచి జట్టును అందించడమే మా లక్ష్యం. స్పిన్నర్లు చాహల్, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, హెబాజ్ అందుబాటులో ఉన్నారు. జట్టు కూర్పు విషయంలో పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయం తీసుకుంటాం’’ అని రోహిత్ శర్మ వ్యాఖ్యానించారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com