భారత్ బయోటెక్ నాసికా టీకా ఆవిష్కరణ

- January 26, 2023 , by Maagulf
భారత్ బయోటెక్ నాసికా టీకా ఆవిష్కరణ

న్యూ ఢిల్లీ: భారత్ బయోటెక్ రూపొందించిన ఇన్​కొవాక్ నాసికా టీకాను కేంద్రం ఆవిష్కరించింది. ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు మన్​సుఖ్ మాండవీయ, జితేంద్ర సింగ్ ఈ టీకాను ఆవిష్కరించారు.

భారత్ బయోటెక్ సంస్థ తయారు చేసిన కరోనా నాసికా టీకాను కేంద్రం ఆవిష్కరించింది. కేంద్ర వైద్య శాఖ మంత్రి మన్​సుఖ్ మాండవీయ, కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి జితేంద్ర సింగ్ కలిసి ఈ టీకాను గురువారం ఢిల్లీలో అందుబాటులోకి తెచ్చారు. ఇన్​కొవాక్ పేరుతో భారత్ బయోటెక్ సంస్థ ఈ టీకాను అభివృద్ధి చేసింది. గతేడాది నవంబర్​లోనే ఈ టీకా వినియోగానికి డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా(డీసీజీఐ) అనుమతులు ఇచ్చింది. నాసికా టీకాను 18 ఏళ్లు పైబడినవారికి బూస్టర్‌ డోసుగా అందించేందుకు పచ్చజెండా ఊపింది. కొవిన్ ప్లాట్​ఫామ్​లోనూ ఈ టీకాను చేర్చారు. ఇకపై ప్రజలందరికీ ఈ టీకా అందుబాటులో ఉండనుంది.

ఇప్పటికే కొవాగ్జిన్‌ లేదా కొవిషీల్డ్‌ వ్యాక్సిన్‌ రెండు డోసులు తీసుకున్నవారు ఇంకొవాక్‌ నాసికా టీకాను బూస్టర్‌గా పొందొచ్చు. 'బీబీవీ154'గా పిలిచే ఈ నాసికా టీకా 'ఇంకొవాక్‌' బ్రాండ్‌ పేరుతో మార్కెట్లో లభ్యమవుతుంది. కరోనాపై పోరులో ఇది చాలా సమర్థంగా పనిచేస్తున్నట్లు ప్రయోగ పరీక్షలో తేలింది. ప్రపంచంలో రెండు డోసుల్లో ముక్కు ద్వారా తీసుకునే మొట్టమొదటి ప్రాథమిక టీకా కూడా ఇదేనని భారత్‌ బయోటెక్‌ వెల్లడించింది.

ఇతర వ్యాక్సిన్లతో పోలిస్తే తేడా ఏంటి?
ఈ టీకా వైరస్‌ శరీరంలోకి ప్రవేశించే మార్గంలోనే (ముక్కులోనే) రోగనిరోధక ప్రతిస్పందనలు కలిగిస్తుంది. తద్వారా వైరస్‌ బారినపడకుండా కాపాడుకోవడమే కాకుండా ఇన్‌ఫెక్షన్‌, సంక్రమణ నుంచి పూర్తి రక్షణ పొందవచ్చు.

ఎలా తీసుకోవాలి?
ఈ నాజల్​ వ్యాక్సిన్​ను ముక్కు ద్వారా తీసుకోవాలి. ప్రస్తుతం దేశంలో ఉన్న సూదితో వేసే వ్యాక్సిన్​లకు బదులుగా చుక్కల ద్వారా ముక్కులో వేసే కొత్త రకం వ్యాక్సిన్​ను అందుబాటులోకి తెచ్చారు​.

టీకా ధర ఎంత?
సింగిల్‌ డోసు టీకా ధరను రూ.800 (పన్నులు అదనం)గా నిర్ణయించినట్లు భారత్ బయోటెక్ గతంలో ప్రకటించింది. భారీ స్థాయిలో సేకరించే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు మాత్రం రూ.320కే ఇవ్వనున్నట్లు పేర్కొంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com