టీ20 సిరీస్ కూడా భారత్ దే

- February 01, 2023 , by Maagulf
టీ20 సిరీస్ కూడా భారత్ దే

అహ్మదాబాద్: సొంత గడ్డ పై భారత జట్టు చెలరేగిపోతోంది. ఫార్మాట్ ఏదైనా.. విజయాల పరంపర మాత్రం కొనసాగిస్తోంది. తాజాగా టీమిండియా ఖాతాలో మరో సిరీస్ చేరింది. న్యూజిలాండ్ తో టీ20 సిరీస్ సైతం భారత్ కైవసం చేసుకుంది. మూడో టీ20 మ్యాచ్ లో భారత జట్టు న్యూజిలాండ్ పై తిరుగులేని విజయం సాధించింది. భారీ పరుగుల తేడాతో ఘన విజయం నమోదు చేసింది.

235 పరుగుల భారీ టార్గెట్ తో బరిలోకి దిగిన న్యూజిలాండ్.. భారత బౌలర్ల ధాటికి 66 పరుగులకే కుప్పకూలింది. దీంతో 168 పరుగుల తేడాతో టీమిండియా ఘన విజయం సాధించింది. ఈ గెలుపుతో 3 టీ20ల సిరీస్ ను 2-1 తేడాతో కైవసం చేసుకుంది. భారత బౌలర్లలో కెప్టెన్ హార్ధిక్ పాండ్యా 4 వికెట్లతో చెలరేగాడు. ఉమ్రాన్ మాలిక్, అర్ష్ దీప్ సింగ్, శివమ్ మావి తలో రెండు వికెట్లు తీశారు. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. ఓపెనర్ గిల్ మెరుపు సెంచరీతో భారీ స్కోర్ చేసింది. 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 234 పరుగులు చేసింది. ఓపెనర్ శుభ్ మన్ గిల్ సెంచరీతో చెలరేగాడు.

మరోవైపు భారత ఓపెనర్ శుభ్ మన్ గిల్ చిన్న వయసులోనే రికార్డులను బద్దలు కొడుతున్నాడు. మూడో టీ20లో న్యూజిలాండ్ పై సెంచరీ చేసిన 23ఏళ్ల ఈ యువ సంచలనం.. అన్ని ఫార్మాట్లలో సెంచరీ బాదేశాడు. అతి తక్కువ వయసులో ఈ ఫీట్ అందుకున్న ఆటగాడిగా నిలిచాడు. అలాగే టీ20ల్లో సెంచరీ చేసిన యంగెస్ట్ ఇండియన్ ఇతడే. అంతేకాదు టీ20ల్లో భారత్ తరపున ఇదే అత్యధిక వ్యక్తిగత స్కోర్. అన్ని ఫార్మాట్లలో నిలకడగా రాణిస్తూ భవిష్యత్ ఆశాకిరణంగా మారాడు శుభ్ మన్ గిల్.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com