టర్కీ, సిరియాలో మృత్యుఘోష: 1149 మంది మృతి, 5639 వేల మందికి గాయాలు

- February 06, 2023 , by Maagulf
టర్కీ, సిరియాలో మృత్యుఘోష: 1149 మంది మృతి, 5639 వేల మందికి గాయాలు

యూఏఈ: సెంట్రల్ టర్కీలో 7.8 తీవ్రతతో సంభవించిన భూకంపం కారణంగా కనీసం 912 మంది మరణించారని, 5 వేల మందికి పైగా గాయపడ్డారని టర్కీ అధ్యక్షుడు తయ్యిప్ ఎర్డోగాన్ వెల్లడించారు. 1939 తర్వాత దేశంలో ఇదే అతిపెద్ద విపత్తు అని, 2,818 భవనాలు నేలమట్టమయ్యాయని ఎర్డోగాన్ తెలిపారు. మరోవైపు సిరియా ప్రభుత్వ ఆధీనంలో ఉన్న ప్రాంతాల్లో కనీసం 237 మంది మరణించగా.. 639 మందికిపైగా గాయపడ్డారని సిరియా ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికారి తెలిపినట్లు సిరియా ప్రభుత్వ వార్తా సంస్థ సనా వెల్లడించింది.  సిరియన్ స్టేట్ మీడియా ప్రకారం.. తిరుగుబాటుదారుల ఆధీనంలో ఉన్న ప్రాంతాల్లో కనీసం 47 మంది మరణించినట్లు సమాచారం. భూకంప కేంద్రం ప్రధానంగా టర్కీ ప్రావిన్షియల్ రాజధాని గాజియాంటెప్ నగరం వెలుపల సిరియా సరిహద్దు నుండి 90 కిలోమీటర్ల (60 మైళ్ళు) వద్ద కేంద్రీకృతమై ఉంది. భూకంపం అనంతరం కనీసం 20 సార్లు స్వల్ప ప్రకంపనలు సంభవించడంతో భారీగా ఆస్తి, ప్రాణ నష్టాలు సంభవించాయని అధికారులు తెలిపారు.  సిరియాలోని అలెప్పో, హమా నగరాల నుండి ఈశాన్య దిశగా 330 కిలోమీటర్ల (200 మైళ్ళు) కంటే ఎక్కువ దూరంలో ఉన్న టర్కీలోని దియార్‌బాకిర్ వరకు విస్తరించి ఉన్న సరిహద్దు ప్రాంతంలో భవనాలు ఎక్కువగా కూలిపోయినట్లు అధికారులు వెల్లడించారు. భూకంపం ధాటికి గజియాంటెప్ లో ప్రసిద్ధ చారిత్రాత్మక కోట నేలమట్టం అయింది.  గజియాంటెప్‌కు 33 కిలోమీటర్ల (20 మైళ్లు) దూరంలో భూకంపం కేంద్రీకృతమైందని యుఎస్ జియోలాజికల్ సర్వే తెలిపింది. ఇది 18 కిలోమీటర్ల (11 మైళ్ళు) లోతులో కేంద్రీకృతమై ఉందని పేర్కొంది. 1999లో వాయువ్య టర్కీలో సంభవించిన శక్తివంతమైన భూకంపంలో దాదాపు 18,000 మంది చనిపోయారు.  అటు టర్కీ, సిరియాలతోపాటూ లెబనాన్, ఇరాక్, ఇజ్రాయెల్, పాలస్తీనా, సైప్రస్ లోనూ భూమి కంపించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com