ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో వారినీ విచారించండి: పీసీసీ అధ్యక్షుడు రేవంత్

- February 09, 2023 , by Maagulf
ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో వారినీ విచారించండి: పీసీసీ అధ్యక్షుడు రేవంత్

హైదరాబాద్: ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ నుంచి టీఆర్ఎస్‌లో చేరిన 12 మంది ఎమ్మెల్యేల పై కూడా విచారణ జరపాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కోరారు. ఈ మేరకు రాష్ట్ర డీజీపీని కలిసి ఫిర్యాదు చేశారు. కాంగ్రెస్ పార్టీని వీడిన 12 మందిని టీఆర్ఎస్ ప్రలోభాలకు గురి చేసిందని, వారిని అక్రమంగా, చట్టవ్యతిరేకంగా టీఆర్ఎస్ పార్టీలో చేర్చుకుందని, దీనిపై గతంలోనే ఫిర్యాదు చేశామని రేవంత్ గుర్తు చేశారు.

జనవరి 6వ తేదీన మొయినాబాద్‌ పోలీస్ స్టేషన్‌లో ఈ విషయంపై ఫిర్యాదు చేశామని రేవంత్ తెలిపారు. ‘‘కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు ఆర్థిక, రాజకీయ ప్రలోభాల ఆశ చూపి, టీఆర్ఎస్‌లో చేర్చుకున్నారు. హైకోర్టులోనూ దీనిపై ఫిర్యాదు చేశాం. అందువల్ల తాజా ఎమ్మెల్యేల కొనుగోలుకు సంబంధించి మొయినాబాద్ పోలీస్ స్టేషన్‌లో ఎఫ్ఐఆర్ కేసు నెంబర్ 455లో మా ఫిర్యాదును కూడా జత చేయాలని కోరాం. ఈ అంశంలో ముఖ్యమంత్రి కేసీఆర్, 12 మంది ఫిరాయింపు ఎమ్మెల్యేలపై ఫిర్యాదు చేశాం’’ అని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత 2014-2018 వరకు నలుగురు ఎంపీలు, 25 మంది ఎమ్మెల్యేలు, 18 మంది ఎమ్మెల్సీలను వివిధ పార్టీల నుంచి టీఆర్ఎస్‌లో చేర్చుకున్నట్లు రేవంత్ వివరించారు.

‘2018 ఎన్నికల తర్వాత మరో 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను టీఆర్ఎస్‌లో చేర్చుకున్నారు. ఆ 12 మంది ఎమ్మెల్యేలకు టీఆర్ఎస్ ప్రభుత్వం వివిధ రకాలుగా లబ్ధి చేకూర్చింది. ఆ ఎమ్మెల్యేలు అనేక నేరాలకు పాల్పడ్డవాళ్లుగా గుర్తింపు పొందారు. వీరిలో ముగ్గురు గతంలో పార్టీ మారి, ఇప్పుడు బీజేపీలో చేరేందుకు జరిగిన వ్యవహారంలో కూడా ఉన్నారు. ఈ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో కేసు సీబీఐకి ఇస్తున్న నేపథ్యంలో 12 మంది వ్యవహారాన్ని సీబీఐకి అప్పగించాలి’’ అని రేవంత్ డిమాండ్ చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com