యూఏఈ నుంచి భారత్ కు కొత్త సర్వీసు ప్రారంభించిన ఎయిర్ అరేబియా

- February 12, 2023 , by Maagulf
యూఏఈ నుంచి భారత్ కు కొత్త సర్వీసు ప్రారంభించిన ఎయిర్ అరేబియా

అబుధాబి: అబుధాబి నుంచి భారత్‌లోని కోల్‌కతా నగరానికి ఎయిర్ అరేబియా ఎయిర్‌లైన్స్ కొత్త సర్వీస్‌ను ప్రకటించింది.అబుధాబి అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి కోల్‌కతా ఇంటర్నెషనల్ ఎయిర్‌పోర్టుకు వారానికి మూడుసార్లు ఈ సర్వీస్ ఉంటుంది. మార్చి 15వ తేదీ నుంచి సర్వీస్‌ను ప్రారంభిస్తున్నట్లు ఎయిర్ అరేబియా తాజాగా వెల్లడించింది. సోమ, బుధ, శనివారం సర్వీస్ నడిపించనుంది.ఈ మూడు రోజులు అబుధాబి విమానాశ్రయం నుంచి మధ్యాహ్నం 2.25 గంటలకు విమానం బయల్దేరుతుంది. కోల్‌కతా ఎయిర్‌పోర్టులో రాత్రి 8.20 గంటలకు ల్యాండ్ అవుతుంది. తిరిగి కోల్‌కతా నుంచి రాత్రి 9.05 గంటలకు బయల్దేరి, తెల్లవారుజామున 1.05 గంటలకు అబుధాబి విమానాశ్రయంకు చేరుకుంటుంది.దీని 0కోసం ఎయిర్ బస్ ఏ320‌ను వినియోగించనున్నట్లు ఎయిర్ అరేబియా సీఈఓ అదేల్ అల్ అలీ వెల్లడించారు.

కాగా, భారత ప్రయాణికుల నుంచి భారీ డిమాండ్ ఉన్న నేపథ్యంలోనే కోల్‌కతా నుంచి ఈ కొత్త సర్వీస్‌ను ప్రారంభిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.అంతేగాక ఈ కొత్త సర్వీస్ రెండు దేశాల మధ్య వ్యాపారం, సాంస్కృతిక మార్పిడితో పాటు కస్టమర్ బేస్‌ను పెంచుకోవడానికి కూడా సహాయపడుతుందని తెలిపారు.ఇక ఎయిర్ అరేబియా అబుధాబి అనేది లోకాస్ట్ క్యారియర్ అనే విషయం తెలిసిందే.అబుధాబి అంతర్జాతీయ విమానాశ్రయం నుండి నేరుగా మొత్తం 28 గమ్యస్థానాలకు విమాన సర్వీసులు నడిపిస్తుంది. ఇప్పటికే భారత్‌లోని  కొచ్చి, కోజికోడ్, తిరువనంతపురం, చెన్నై, ముంబై, అహ్మదాబాద్‌కు విమానాలు నడుపుతోంది.ఇప్పుడు ఇండియాలో ఏడవ గమ్యస్థానంగా కోల్‌కతాను ఎంచుకుంది. అబుదాబి నుంచి కోల్‌కతా వెళ్లాలనుకునే ప్రయాణికులు ఎయిర్ అరేబియా అధికారిక వెబ్‌సైట్ https://www.airarabia.com/ ద్వారా ఆన్‌లైన్‌లో టికెట్లు బుక్ చేసుకోవచ్చు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com