సీఎం కేసీఆర్‌కు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సవాల్

- February 13, 2023 , by Maagulf
సీఎం కేసీఆర్‌కు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సవాల్

న్యూ ఢిల్లీ: దేశ ఆర్థిక పరిస్థితుల గురించి, దేశ జీడీపీ గురించి అసత్యాలు, అర్థరహితమైన వ్యాఖ్యలు చేస్తున్న కేసీఆర్.. వాస్తవ పరిస్థితులపై చర్చించేందుకు రావాలని కేంద్ర పర్యాటక, సాంస్కృతిక, ఈశాన్య రాష్ట్రాల ముఖ్యమంత్రి జి.కిషన్ రెడ్డి సవాల్ విసిరారు. అయితే కేసీఆర్ తో చర్చించేందుకు తనదో కండిషన్ అన్న కిషన్ రెడ్డి.. గౌరవ ప్రదమైన భాషలో మాట్లాడతానంటేనే చర్చకు వస్తానన్నారు. చర్చలకోసం ప్రెస్ క్లబ్ అయినా, అసెంబ్లీ ముందున్న అమరవీరుల స్తూపమైనా తాను సిద్ధమేనన్నారు.

సోమవారం ఢిల్లీలో విలేకరుల సమావేశంలో కేంద్ర మంత్రి మాట్లాడుతూ.. అసెంబ్లీని రాష్ట్రం కోసం కల్వకుంట్ల కుటుంబం ఏం చేసిందో చెప్పుకోకుండా.. బీజేపీని, మోదీని తిట్టేందుకు వేదికగా.. ఓ పొలిటికల్ సమావేశంగా మార్చుకున్నారని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వంపై బురదజల్లడమే ఏకైక టార్గెట్ గా సమావేశాలు నిర్వహించారన్నారు. తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీకి, కల్వకుంట్ల కుటుంబానికి ప్రజల్లో ఆదరణ తగ్గిపోవడం.. బీజేపీని ప్రజలు ఆదరిస్తుండటాన్ని కేసీఆర్ తట్టుకోలేక పోతున్నారనే విషయం.. ఆయన మాటల్లోని నిరాశ, నిస్పృహ, నిర్వేదం ద్వారా స్సఫ్టంగా కనిపించాయని కిషన్ రెడ్డి అన్నారు.

తెలంగాణ శాసన మండలిలో కాంగ్రెస్ పార్టీ లేకుండా చేసిన కేసీఆర్.. శాసనసభలోనూ ఆ పార్టీ ఎమ్మెల్యేలను రాజీనామా చేయించకుండా తన పార్టీలోకి లాక్కున్నారన్నారు. ఇప్పుడ మళ్లీ కాంగ్రెస్ తో జతకట్టే ఆలోచనలో ఉన్న ముఖ్యమంత్రి.. మన్మోహన్ సింగ్ సర్కారును, ఇందిరాగాంధీ పాలనను పొగుడుతూ వ్యాఖ్యలు చేయడం ఇందుకు నిదర్శనమన్నారు. యూపీఏ హయాంలో దేశం అవినీతి కోరల్లో చిక్కుకుపోతే.. ఆ పాలనను ప్రశంసిస్తూ కేసీఆర్ మాట్లాడటం హాస్యాస్పదమన్నారు. మన్మోహన్ సింగ్ గారి పాలనలో 11వ ఆర్థిక శక్తిగా ఉన్న భారత్.. మోదీ గారు వచ్చాక 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదగడం కేసీఆర్ కు కనిపించడం లేదా? అని కిషన్ రెడ్డి ప్రశ్నించారు. 

కేసీఆర్ ఏ ఎండకు ఆ గొడుగు పట్టే రకమని, అందుకే మొన్నటివరకు కేంద్ర ప్రథకాలను అద్భుతమంటూ కీర్తించిన నోటితోనే.. ఇవాళ కాంగ్రెస్ పాట పాడుతున్నారన్నారు. మొన్నటి వరకు కమ్యూనిస్టులను తిట్టిన తిట్టు తిట్టని కేసీఆర్, ఇప్పుడు వారిని ఆహా.. ఓహో అంటూ పొగుడుతున్నారన్నారు. కేసీఆర్ జతకట్టని పార్టీ ఏదైనా ఉందా అంటూ కిషన్ రెడ్డి ఎద్దేవా చేశారు. 

ఎన్నికలకు 7-8 నెలల ముందే కల్వకుంట్ల కుటుంబం రాజీనామా చేసేందుకు తొందరపడాల్సిన పనిలేదని, ఆ తర్వాత ఎలాగూ గవర్నర్ కు రాజీనామా ఇవ్వక తప్పదని కిషన్ రెడ్డి సూచించారు. ఆర్థిక వృద్ధిరేటు, తలసరి ఆదాయంపై కేసీఆర్ పచ్చి అబద్ధాలు మాట్లాడారన్న కేంద్ర మంత్రి.. కరోనానంతర పరిస్థితుల్లో ప్రపంచమంతా ఆర్థిక మాంద్యంలో కొట్టుమిట్టాడుతుంటే.. నరేంద్రమోదీ నేతృత్వంలోని భారతదేశం ఆర్థిక సాధికారత సాధించే దిశగా దూసుకెళ్తుండటాన్ని యావత్ ప్రపంచం హర్షిస్తోందన్నారు. 

భారత ఆర్థిక వ్యవస్థను, తలసరి ఆదాయాన్ని బంగ్లాదేశ్, శ్రీలంక, నేపాల్, మయన్మార్, సింగపూర్ దేశాలతో పోల్చడం కేసీఆర్ అవగాహనా రాహిత్యమని, ఏ ఆర్థికవేత్తకు కూడా అర్థం కాని రీతిలో ఎటువంటి ఆధారాలు లేకుండా పచ్చి అపద్దాలు మాట్లాడారని కిషన్ రెడ్డి మండిపడ్డారు. దేశాన్ని బద్నామ్ చేసేందుకు కేసీఆర్ చేస్తున్న ప్రయత్నం ప్రజలకు అర్థమవుతోందన్నారు. జనాభా తక్కువగా ఉన్న దేశాల తలసరి ఆదాయం ఎక్కువగా ఉండటం సహజమేనని.. ఈ విషయం కూడా కేసీఆర్ కు తెలియకోవడం హాస్యాస్పదమన్నారు. 

‘సింగపూర్ గురించి మాట్లాడిన కేసీఆర్ కి ఆ దేశ జీడీపీలో 471% అప్పులు ఉన్న విషయం తెలియదా? అమెరికా జీడీపీలో 120% అప్పు చేసింది, యూకే (బ్రిటన్) 273% అప్పు చేసింది, అలాంటిది భారత్ లో.. జీడీపీలో 19.9% కు మించి అప్పు చేయటానికి వీల్లేదు, ఇది గొప్ప నిర్ణయం కాదంటారా?’ అని కిషన్ రెడ్డి ప్రశ్నించారు.

ఇంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడే కేసీఆర్.. హైదరాబాద్, రంగారెడ్డిలో పర్ క్యాపిటా ఇన్ కమ్ ఎంత? ఆసిఫాబాద్ కొమురంభీమ్ జిల్లాలో పర్ క్యాపిటా ఇన్ కమ్ ఎంత అనే విషయాన్ని కూడా చెబితే ప్రజలు స్వాగతిస్తారని కిషన్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో ఉన్నట్లుగా.. అప్పులు చేసి కమిషన్లు కొట్టేసే ప్రభుత్వం కేంద్రంలో లేదన్నారు. వేలకోట్ల దోపిడీ జరుగుతుందని కిషన్ రెడ్డి ఆరోపించారు. ఇతర దేశాలతో పోలుస్తూ భారతదేశాన్ని విమర్శించడం కల్వకుంట్ల కుటుంబానికి పరిపాటిగా మారిందని ఆయన మండిపడ్డారు.

జమ్మూకశ్మీర్ లో రాజ్యాంగాన్ని అమలుచేస్తున్నాం

జమ్మూకశ్మీర్ లో ఇన్నాళ్లూ ఆర్టికల్ 370ని అడ్డంపెట్టుకుని జిన్నా రాజ్యాంగాన్ని అమలుచేశారన్న కిషన్ రెడ్డి.. కేంద్ర ప్రభుత్వం ఆర్టికల్ 370ని తొలగించి అంబేడ్కర్ రాసిన రాజ్యాంగాన్ని అమలుచేస్తోందన్నారు. దేశమంతా నియోజకవర్గాల పునర్విభజన జరిగినపుడు, జమ్మూకశ్మీర్ లో జరగలేదని.. అందుకే ప్రస్తుతం అక్కడ నియోజకవర్గాల పునర్విభజన జరుగుతోందని కిషన్ రెడ్డి వెల్లడించారు. దేశంలో రాజ్యాంగం, ప్రజాస్వామ్యం అమలయ్యేలా చూడటం, అందరికీ న్యాయం జరిగేలా పనిచేయడమే కేంద్ర ప్రభుత్వ లక్ష్యమన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com