సెంట్రల్ ఫిలిప్పీన్స్‌లో 6.1 తీవ్రతతో భూకంపం

- February 16, 2023 , by Maagulf
సెంట్రల్ ఫిలిప్పీన్స్‌లో 6.1 తీవ్రతతో భూకంపం

యూఏఈ: సెంట్రల్ ఫిలిప్పీన్స్‌లో గురువారం 6.1 తీవ్రతతో భూకంపం సంభవించిందని యుఎస్ జియోలాజికల్ సర్వే తెలిపింది. ఈ ఘటనలో  ప్రాణనష్టం లేదా ఆస్తి నష్టం వివరాలు తెలియరాలేదు. మాస్బేట్ ప్రావిన్స్ తీరంలో తెల్లవారుజామున 2 గంటల తర్వాత (1800 GMT) బలమైన భూకంపం సంభవించింది. భూకంప కేంద్రం మస్బేట్ ఉసన్ మునిసిపాలిటీలోని మియాగా తీర గ్రామం నుండి 11 కిలోమీటర్ల (ఏడు మైళ్ళు) దూరంలో ఉందని USGS తెలిపింది. 80కి పైగా ప్రకంపనలు నమోదైనట్లు ఫిలిప్పీన్స్ భూకంప శాస్త్ర సంస్థ తెలిపింది. భూకంపం సంభవించిన ప్రావిన్స్ లో ఉన్న మూడు ద్వీపాలలో దాదాపు పది లక్షల మంది జనాభా ఉన్నారు. మస్బేట్ ప్రావిన్షియల్ డిజాస్టర్ ఆఫీసర్ అడోనిస్ దిలావో స్థానిక మీడియాతో మాట్లాడుతూ.. రాజధాని మాస్బేట్ సిటీలోని కొన్ని భవనాలు ప్రావిన్షియల్ హాస్పిటల్‌తో సహా వాటి గోడలలో పగుళ్లు కన్పించాయని చెప్పారు. రోగులను సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు తెలిపారు. భూకంపం సమయంలో కొంతమంది నివాసితులు తమ ఇళ్లను వదిలి భయంతో పరుగులు తీశారని ఉసన్ పోలీసు చీఫ్ కెప్టెన్ రెడెన్ టోలెడో తెలిపారు. ఫిలిప్పీన్స్‌లో తరచుగా భూకంపాలు సంభవిస్తాయి. ఎందుకంటే ఇది పసిఫిక్ "రింగ్ ఆఫ్ ఫైర్" పరిధిలో ఉంది.  ఇది జపాన్ నుండి ఆగ్నేయాసియా మరియు పసిఫిక్ బేసిన్ అంతటా విస్తరించి ఉన్న తీవ్రమైన భూకంప, అగ్నిపర్వత కార్యకలాపాల ప్రాంతం.  ఉత్తర ఫిలిప్పీన్స్‌లో గతేడాది అక్టోబర్‌లో చివరిసారిగా భారీ భూకంపం సంభవించింది. అబ్రా ప్రావిన్స్‌లోని పర్వత పట్టణం డోలోర్స్‌ లో 6.4 తీవ్రతతో సంభవించిన భూకంపంలో అనేక మంది గాయపడగా.. చాలా భవనాలు దెబ్బతిన్నా. గతేడాది జూలైలో పర్వత ప్రాంతాలైన అబ్రాలో 7.0 తీవ్రతతో సంభవించిన భూకంపం దాటికి కొండచరియలు విరిగిపడ్డాయి.  11 మంది మరణించగా..  వందల మంది గాయపడ్డారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com