సుప్రీం కోర్టులో ఏపీ సీఎం జగన్‌కు చుక్కెదురు

- March 02, 2023 , by Maagulf
సుప్రీం కోర్టులో ఏపీ సీఎం జగన్‌కు చుక్కెదురు

న్యూఢిల్లీ: అమరావతిపై సుప్రీంకోర్టులో ఏపీ సీఎం జగన్‌కు చుక్కెదురైంది. 28వ తేదీనే అమరావతి కేసు విచారిస్తామని న్యాయమూర్తి కె.ఎం జోసెఫ్ ధర్మాసనం తేల్చి చెప్పింది. 28వ తేదీ కన్నా ముందే కేసు విచారణ జరపాలని ఏపీ ప్రభుత్వం తరపు న్యాయవాదుల విజ్ణప్తిని ధర్మాసనం తోసిపుచ్చింది. రాజ్యాంగ పరమైన అంశాలు ఇందులో చాలా ఇమిడి ఉన్నాయని న్యాయమూర్తి కె.ఎం జోసెఫ్ పేర్కొన్నారు. 28వ తేదీ ఒక్క రోజే విచారణ సరిపోదని… బుధ, గురువారాల్లో కూడా విచారించాలని ఏపీ ప్రభుత్వం తరపు న్యాయవాదులు కోరారు. బుధ, గురువారాల్లో నోటీసులు ఇచ్చిన కేసుల్లో విచారణ జరపరాదని సీజేఐ సర్క్కులర్ ఉందని ధర్మాసనం గుర్తు చేసింది. అయితే సీజేఐ ధర్మాసనం ముందు ప్రత్యేకంగా ప్రస్తావించడానికి అనుమతి ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం తరపు న్యాయవాదులు కోరారు. అనుమతి ఇచ్చేందుకు ధర్మాసనం నిరాకరించింది.

కాగా, ఏపీలో ఇప్పుడు రాజధాని వ్యవహారం హాట్ టాపిక్‌గా మారింది. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా సుప్రీంకోర్టులో రాజధాని అంశంపై తీర్పు వచ్చేస్తే అంత త్వరగా విశాఖను రాజధాని చేయవచ్చని సీఎం జగన్ భావిస్తున్నారు. త్వరలోనే ఎన్నికలు రాబోతున్నాయి. ఆ సమయానికి నూతన రాజధానిని సిద్ధం చేయాలని ప్రభుత్వం ఉవ్విళ్లూరుతోంది. ఏపీ హైకోర్టు అమరావతికి అనుకూలంగా ఇచ్చిన తీర్పుపై ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో అప్పీల్‌కు వెళ్లింది. దీనిపై విచారణ నిర్వహిస్తున్న సుప్రీంకోర్టు గతంలో మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. అలాగే కొన్ని అంశాలపై స్టే ఇచ్చింది. తదుపరి విచారణను 28వ తేదీకి వాయిదా వేసింది. అయితే ఆ తేదీ కంటే ముందే విచారణ జరపాలంటూ ఏపీ ప్రభుత్వం కోరుతోంది. కానీ సుప్రీం ధర్మాసనం దీనికి కుదరదంటూ తేల్చి చెప్పింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com