రాజకీయాలకు దూరం కావడానికి కారణాలు తెలిపిన రజనీకాంత్

- March 12, 2023 , by Maagulf
రాజకీయాలకు దూరం కావడానికి కారణాలు తెలిపిన రజనీకాంత్

చెన్నై: సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తారని అభిమానులు ఎంతో ఆశగా ఎదురుచూసారు..కానీ చివరి నిమిషంలో ఆయన రాజకీయాల్లోకి రావడం లేదని తెలిపి షాక్ ఇచ్చారు. దీనికి కారణాలు ఏంటి అనేది ఇప్పటివరకు చాలామందికి తెలియదు. ఈ క్రమంలో తాను రాజకీయాలకు దూరం కావడానికి కారణాలు ఏంటి అనేది తెలిపారు. చెన్నైలోని మ్యూజిక్ అకాడమీలో గతరాత్రి జరిగిన సేఫియన్స్ హెల్త్ ఫౌండేషన్ రజతోత్సవాలకు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడితో కలిసి రజనీకాంత్ అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా రజనీకాంత్ మాట్లాడుతూ.. తాను మూత్రపిండాల సమస్యతో బాధపడుతుండడం వల్లే రాజకీయాలకు దూరమైనట్టు చెప్పారు. తాను ఆ సమస్యకు చికిత్స పొందుతున్న సమయంలో రాజకీయాల్లోకి రావాలని అనుకున్నానని చెప్పారు. అయితే, రాజకీయాల్లోకి వస్తే ఎక్కువ కార్యక్రమాల్లో పాల్గొనాల్సి వస్తుందన్నారు. ఎక్కువ కార్యక్రమాలతో బిజీగా ఉండడం ఆరోగ్యానికి మంచిది కాదని అప్పట్లో డాక్టర్ రాజన్ రవిచంద్రన్ తనకు సలహా ఇచ్చారని రజనీకాంత్ గుర్తు చేసుకున్నారు.

తాను కరోనా సమయంలో చికిత్స పొందుతున్నప్పుడు కూడా చాలామంది ఇలాంటి సలహానే ఇచ్చినట్టు చెప్పారు. అప్పట్లో తాను బహిరంగ సభల్లో పాల్గొనలేని పరిస్థితి ఏర్పడిందని, అందుకనే రాజకీయాల నుంచి తప్పుకున్నట్టు తెలిపారు. తాను ఈ విషయాలు చెబితే తాను భయపడుతున్నానని అనుకుంటారని, అందుకనే ఈ విషయాన్ని ఎక్కడా బయటపెట్టలేదని రజనీకాంత్ చెప్పుకొచ్చారు.

మాజీ ఉపరాష్ట్ర పతి వెంకయ్యనాయుడిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వెంకయ్యనాయుడికి ఉపరాష్ట్ర పదవి ఇవ్వడం తనకు నచ్చలేదన్నారు. ఆయన మరి కొన్ని రోజులు కేంద్రమంత్రిగా కొనసాగితే బాగుండేదన్నారు. గొప్ప నాయకుడిని రాజకీయాల నుంచి దూరం చేశారని అన్నారు రజనీకాంత్ . ఉపరాష్ట్రపతి హోదాలో ఎలాంటి అధికారాలు ఉండవని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

అలాగే వెంకయ్య నాయుడు మాట్లాడుతూ..రజనీకాంత్ రాజకీయాల్లోకి రావొద్దనే చెప్పానన్నారు. ఆరోగ్యం బాగుండాలంటే రాజకీయాల్లోకి రావొద్దని సలహా ఇచ్చానన్నారు. ప్రజలకు సేవ చేయాలంటే రాజకీయాలు ఒకటే మార్గం కాదని.. దానికి చాలా మార్గాలున్నాయని సూచించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com