ఫ్లూ తో పాటుభారత్ లో పెరుగుతున్న కరోనా కేసులతో కొత్త భయం; రాష్ట్రాలకు కేంద్రం కీలక ఆదేశాలు!!

- March 13, 2023 , by Maagulf
ఫ్లూ తో పాటుభారత్ లో పెరుగుతున్న కరోనా కేసులతో కొత్త భయం; రాష్ట్రాలకు కేంద్రం కీలక ఆదేశాలు!!

దేశవ్యాప్తంగా ఇన్‌ఫ్లూయెంజా కేసులు వణికిస్తున్న వేళ మళ్లీ కరోనా కేసులు పెరుగుతున్న తీరు ఆందోళన కలిగిస్తుంది. దేశంలో మరో మారు కరోనా కేసులలో పెరుగుదల కనిపిస్తున్నట్టు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ డేటా వెల్లడిస్తుంది.

భారతదేశంలో గత 24 గంటలలో 524 కొత్త కరోనా కేసులు నమోదు అయ్యాయని పేర్కొంది. 113 రోజుల తర్వాత ఒక్క రోజులో 500 కేసుల మార్కును దాటడం ఇదే తొలిసారి. ప్రస్తుతం దీంతో కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 3,168 కి పెరిగినట్లుగా తెలుస్తుంది.


రాష్ట్రాల్లో పెరుగుతున్న కరోనా కేసులు .. కేంద్రం అలెర్ట్ 
కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ మళ్ళీ కరోనా కేసులు పెరుగుదలపై ఆందోళన వ్యక్తం చేస్తుంది. కొన్ని రాష్ట్రాలలో కోవిడ్ 19 పాజిటివిటీ రేటు క్రమంగా పెరుగుతుండడం గుర్తించిన కేంద్రం, వెంటనే కరోనా కట్టడికి చర్యలు చేపట్టాలని ఆయా రాష్ట్రాలకు సూచించింది. మహారాష్ట్ర, కేరళ మరియు కర్ణాటక రాష్ట్రాలలో ఏడు రోజుల సగటు తాజా కేసులు 500 కంటే ఎక్కువగా ఉండటం గమనించి చర్యలకు ఆయా రాష్ట్రాలకు కీలక సూచనలు చేసింది. ఇక గుజరాత్ రాష్ట్రంలోనూ కరోనా వేగంగా వ్యాప్తి చెందటాన్ని గుర్తించిన కేంద్రం కరోనా నిబంధనలను అమలు చేయాలని, కట్టడికి చర్యలు చేపట్టాలని సూచించింది. గుజరాత్ తర్వాత కరోనా వ్యాప్తిలో మహారాష్ట్ర, ఆ తర్వాత తమిళనాడు ఉన్నాయి.

ఆస్పత్రులను సిద్ధం చెయ్యాలంటూ రాష్ట్రాలకు కేంద్రం సూచన..
ఇదిలా ఉంటే ఒకపక్క ఇన్‌ఫ్లూయెంజా కేసులు విపరీతంగా పెరుగుతున్న వేళ దేశవ్యాప్తంగా ఇన్‌ఫ్లూయెంజా కేసులపై ఆందోళన వ్యక్తం అవుతుంది. H3N2 గా చెప్పబడే ఇన్‌ఫ్లూయెంజా వైరస్ విజృంభణ నేపథ్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కట్టడికి చర్యలు చేపడుతున్నాయి. ఇక ఇదే సమయంలో కరోనా కేసులు కూడా పెరుగుతుండడం ప్రస్తుతం భయాందోళనకు కారణంగా మారుతుంది. దీంతో వీటిని కట్టడి చేయడానికి ఆసుపత్రులను సిద్ధం చేయాలని, ఆసుపత్రులలో బెడ్ల విషయంలో, ఆక్సిజన్, మందులు, ఇతరత్రా వనరుల విషయంలో కేంద్ర ఆరోగ్య కార్యదర్శి రాజేష్ భూషణ్ వివిధ రాష్ట్రాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకు కీలక సూచనలు చేశారు.

భయపెడుతున్న ఇన్‌ఫ్లూయెంజా తో పాటు కరోనా..
ఒకపక్క కర్ణాటక మరియు హర్యానా రాష్ట్రాలలో ఒక్కొక్క మరణం చొప్పున ఇన్‌ఫ్లూయెంజా మరణాల చోటు చేసుకోవడంతో మరింత అప్రమత్తంగా ఉండాలని కేంద్రం రాష్ట్రాలను హెచ్చరిస్తుంది. ఇదిలా ఉంటే ప్రస్తుతం కరోనా కేసులు పెరుగుతున్నప్పటికీ దేశవ్యాప్తంగా మరణాల సంఖ్య పెరిగిన దాఖలాలు లేవు. కరోనా మహమ్మారి కారణంగా శనివారం రోజు ఒక మరణం, ఆదివారం నాడు ఒక మరణం చోటుచేసుకున్నాయి. ఇదిలా ఉంటే కరోనా మహమ్మారికి సంబంధించి జాతీయ రికవరీ రేటు ప్రస్తుతం దాదాపు 98.8% గా ఉన్నట్టు అధికారిక డేటా వెల్లడించింది.

ప్రజలు జాగ్రత్తలు తీసుకుంటే మంచిది..
అయినప్పటికీ కరోనా విషయంలో H3N2 గా చెప్పబడే ఇన్‌ఫ్లూయెంజా విషయంలో జాగ్రత్తగా ఉండాలని అటు ప్రజలకు సైతం విజ్ఞప్తి చేస్తున్నాయి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు. ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, అందరూ మాస్కులు ధరిస్తే మంచిదని, కరోనా జాగ్రత్తలు కూడా తీసుకుంటే అటు కరోనా, ఇటు ఇన్‌ఫ్లూయెంజా వైరస్ సోకకుండా ఉంటుందని అంటున్నారు. వ్యాక్సినేషన్ విషయంలో నిర్లక్ష్యం వద్దని, అందరూ బూస్టర్ డోసులు తీసుకోవాలని సూచిస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com