ఏపీ సీఎం జగన్ నివాసంలో ఉగాది వేడుకలు

- March 22, 2023 , by Maagulf
ఏపీ సీఎం జగన్ నివాసంలో ఉగాది వేడుకలు

అమరావతి: శ్రీ శోభకృత్ నామ సంవత్సర ఉగాది పండుగ ను తెలుగు రాష్ట్రాల్లో ప్రజలు ఘనంగా జరుపుకుంటున్నారు. ఉగాది పచ్చడి సేవించి తెలుగువారి నూతన సంవత్సరానికి ఘనంగా స్వాగతం పలికారు. ప్రధాన ఆలయాల్లో పండితులు పంచాగ శ్రవణా లు వినిపిస్తున్నారు. తాడేపల్లిలోని సీఎం జగన్‌మోహన్ రెడ్డి నివాసంలోని గోశాలలో ఉగాది వేడుకలను బుధవారం ఘనంగా నిర్వహించారు. సీఎం జగన్‌మోహన్ రెడ్డి, ఆయన సతీమణి భారతిలు సంప్రదాయ దుస్తుల్లో వేడుకల్లో పాల్గొన్నారు. వేడుకలకు ముందు శ్రీ వేంకటేశ్వర ఆలయంలో సీఎం జగన్ దంపతులు పూజలు నిర్వహించి ఉగాది పచ్చడిని స్వీకరించారు.

ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ సీఎం జగన్ ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. శ్రీ శోభకృత్ నామ సంవత్సరం అందరి జీవితాల్లో శుభాలు కలిగించాలని జగన్ ఆకాంక్షించారు. రైతులకు, అక్కచెల్లెమ్మలు, సకల వృత్తుల వారికి ఈ శోభకృత్ నామ సంవత్సరంలో మంచి జరగాలని, తద్వారా రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని కోరుకుంటున్నానని జగన్ తెలిపారు. అనంతరం  సోమయాజి పంచాంగ పఠనం చేశారు. ఈ సందర్భంగా జగన్ సోమయాజిని సన్మానించారు.

తిరుమల ఆలయం, విజయవాడ కనకదుర్గ ఆలయం నుంచి వచ్చిన పండితులు సీఎం జగన్‌మోహన్ రెడ్డి దంపతులను ఆశీర్వదించారు. అనంతరం జరిగిన సాంస్కృతిక కార్యక్రమాలను సీఎం జగన్ దంపతులు వీక్షించారు. ఈ వేడుకల్లో మంత్రి రోజా, వైసీపీ నేతలు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com