మరింత పెరగనున్న ఎండల తీవ్రత..

- March 31, 2023 , by Maagulf
మరింత పెరగనున్న ఎండల తీవ్రత..

న్యూ ఢిల్లీ: సూర్యుడు నిప్పులు కురిపిస్తున్నాడు. చెమటలు కక్కిస్తున్నాడు. మాడు పగిలిపోయే ఎండలతో జనం విలవిలలాడిపోతున్నారు. అయితే, ముందు ముందు ఎండ మరింత ప్రతాపం చూపనుంది. ఈ ఏడాది చాలా హాట్ గురూ అని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఏప్రిల్, మే నెలలో జాగ్రత్తగా ఉండకపోతే సన్ స్ట్రోక్ ఖాయమంటోంది.

గత ఏడాది మార్చిలోనే భగభగమన్న ఎండలు మనల్ని మాడ్చేశాయి. ఈ ఏడాది హాటెస్ట్ ఫిబ్రవరి నరకం చూపింది. ఇక రానున్న రెండు నెలలు అంతకుమించి ఎండలు ఉంటాయంటున్నారు. బయటకు వెళితే జరభద్రం అని హెచ్చరిస్తున్నారు వాతావరణ నిపుణులు.

ఇప్పటికే రికార్డు స్థాయిలో పగటి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. వచ్చే రెండు నెలలు ఇది మరింత ఎక్కువయ్యే ప్రమాదం ఉందని వాతావరణ శాఖ నిపుణులు హెచ్చరిస్తున్నారు. అత్యధిక ఉష్ణోగ్రతలు మానవాళి మనుగడకే ముప్పుగా మారనున్నాయనే ఆందోళన వ్యక్తమవుతోంది.

వేసవిలో సాధారణ ఉష్ణోగ్రతలు 35 డిగ్రీల సెల్సియస్ ఉండాలి. అయితే, ఈ స్థాయిని మనం ఎప్పుడో దాటేశాం. ఇప్పటికే 40, 42 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ పరిస్థితి మార్చి నెలలో రావడం హెచ్చరికగా భావిస్తున్నారు వాతావరణ నిపుణులు. మన దేశంలో 50 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు. గరిష్ట ఉష్ణోగ్రతలు ఎక్కువగా పెరుగుతున్న దేశాల్లో మన దేశం తొలి స్థానంలో ఉందని వరల్డ్ బ్యాంక్ విడుదల చేసిన ఓ నివేదిక చెబుతోంది.

మానవ మనుగడకు పొంచి ఉన్న ముప్పు:
భారత్ లో ఉష్ణోగ్రతలు డేంజర్ బెల్స్ మోగిస్తున్నాయి. హీట్ వేవ్ ముప్పు ఎదుర్కొంటున్న ప్రపంచ దేశాల్లో భారత్ తొలి స్థానంలో ఉందని ఓ నివేదిక వెల్లడించింది. ఒక్క వేసవిలోనే కాదు ఇతర కాలాల్లోనూ మన దేశంలో వేడి వాతావరణం సర్వ సాధారణంగా మారిపోయింది.

ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యే సహారా ఎడారికన్నా మన దేశంలో ఉష్ణోగ్రతలు బాగా ఎక్కువగా పెరుగుతున్నాయని, తేమ కూడా పెరిగిందని అంటున్నారు నిపుణులు. ఉష్ణోగ్రతలు ఇలానే పెరిగి 50 డిగ్రీలకు చేరువ అయితే మానవ మనుగడకే పెను ప్రమాదం అని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వేడి వాతావరణంతో మరణాల సంఖ్య పెరిగే అవకాశం ఉందని, రుతుచక్రం దెబ్బతిని పంటలు పండవని హెచ్చరిస్తున్నారు నిపుణులు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com