స్పీడ్ పెంచిన సిద్ధరామయ్య..

- May 15, 2023 , by Maagulf
స్పీడ్ పెంచిన సిద్ధరామయ్య..

న్యూఢిల్లీ: కర్ణాటక తదుపరి సీఎం ఎవరనేదానిపై ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. పార్టీ సీనియర్ సిద్ధరామయ్య, ట్రబుల్ షూటర్ డీకే శివకుమార్ ఇద్దరూ సీఎం పీఠంపై ఆశలు పెట్టుకున్నారు. ముఖ్యమంత్రి అభ్యర్థి ఎంపిక నిర్ణయాన్ని పార్టీ అధిష్ఠానానికే వదిలేసినప్పటికీ ఇరువురూ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలో మాజీ సీఎం, కాంగ్రెస్ కురువృద్ధుడు సిద్ధరామయ్య పార్టీ అధిష్ఠానం వద్ద కీలక ప్రతిపాదన చేసినట్టు తెలుస్తోంది. ఎక్కువమంది ఎమ్మెల్యేలు తననే సీఎంగా కోరుకుంటున్నారని, తొలి రెండేళ్లు తననే ముఖ్యమంత్రిగా కొనసాగించాలని, మిగతా మూడేళ్లు డీకే శివకుమార్‌ను ముఖ్యమంత్రిగా కొనసాగించాలని ఆయన సూచించినట్టు జాతీయ మీడియా కథనాలు పేర్కొంటున్నాయి. వయసైపోతున్నందున తొలి రెండేళ్ల పాలనకు తానే సారధ్యం వహించాలని భావిస్తున్నట్టు, కనీసం వచ్చే పార్లమెంట్ ఎన్నికల వరకైనా సీఎంగా కొనసాగాలని సిద్ధూ భావిస్తున్నట్టు వెల్లడించాయి. ఇది తన ప్రతిపాదన మాత్రమేనని, తుది నిర్ణయాన్ని అధిష్ఠానం అభీష్టానికే వదిలేస్తున్నట్టు సిద్ధరామయ్య పేర్కొన్నారని తెలిపాయి.

అయితే ఈ ప్రతిపాదనను డీకే శివకుమార్ వ్యతిరేకిస్తున్నట్టు వార్తలు వెలువడుతున్నాయి. రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్‌లో పరిస్థితులే కర్ణాటకలో కూడా ఉత్పన్నమవుతాయని డీకే అభ్యంతరం వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తోంది. కాగా ఆదివారం జరిగిన సీఎల్‌పీ మీటింగ్‌లోనూ ఇదే నిర్ణయం జరిగింది. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేకి సీఎల్‌పీ లీడర్ ఎంపిక నిర్ణయాధికారాన్ని అప్పగిస్తూ ఏకవాక్య తీర్మానం చేసిన విషయం తెలిసిందే. మరోవైపు సిద్ధరామయ్యకు సీఎం పదవి ఇవ్వాలనే ఆలోచనలను కూడా డీకే తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్టు స్పష్టమవుతోంది. ఈ విషయంలో సూర్జేవాలా ఆదివారం బుజ్జగించే ప్రయత్నం చేశారని తెలుస్తోంది. అయితే ఇస్తే సీఎం పదవి ఇవ్వాలని, లేకుంటే కేబినెట్‌లో స్థానం కూడా అక్కర్లేదని డీకే తెగేసి చెప్పినట్టు రిపోర్టులు వెలువడుతున్నాయి. మరోవైపు డీకే శివకుమార్ మీద పలు కేసులు ఉండడాన్ని కాంగ్రెస్ అధిష్ఠానం ప్రతికూలంగా భావిస్తోందని జాతీయ మీడియా కథనాలు పేర్కొంటున్నాయి. ఒక సీబీఐ కేసు కూడా ఉండడంతో విచారణ పేరుతో ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుందని, అందునా కర్ణాటకకే చెందిన ప్రవీణ్ సూద్‌‌ను సీబీఐ చీఫ్‌గా నియమించడంతో ఈ అవకాశాలు మరింత ఎక్కువగా ఉంటాయని కాంగ్రెస్ వర్గాలు భావిస్తున్నాయట. ఈ పరిస్థితుల్లో కర్ణాటక తదుపరి సీఎంను నిర్ణయించడం కాంగ్రెస్ అధిష్ఠానానికి కత్తిమీద సాములా మారింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com