తెలుగు చక్కని భాష, చిక్కని భాష: వెంకయ్య నాయుడు

- May 25, 2023 , by Maagulf
తెలుగు చక్కని భాష, చిక్కని భాష: వెంకయ్య నాయుడు

హైదరాబాద్: తెలుగుభాషకు దివంగత నందమూరి తారక రామారావు విశేష సేవ చేశారని భారత పూర్వ ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు చెప్పారు. తెలుగు వారికి వేల సంవత్సరాల చరిత్ర ఉందని సాధికారికంగా ప్రకటించి, వారి ఆత్మగౌరవాన్ని ప్రపంచం నలు దిశలా చటి చెప్పారన్నారు. గురువారం వెంకయ్య నాయుడు హైదరాబాద్ లోని శ్రీ పొట్టి శ్రీరాములు తెలుగు విశవవిద్యాలయం లో కిన్నెర ఆర్ట్ థియేటర్స్ నిర్వహించిన ఎన్టీఆర్ శత జయంతి ముగింపు ఉత్సవాల్లో ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ తెలుగు భాషా సేవా పురస్కారాన్ని ఆంధ్ర ప్రదేశ్ పూర్వ మంత్రి  మండలి బుద్ధ ప్రసాద్ కి అందచేసి సత్కరించారు. తెలుగు భాష పరిరక్షణకు బుద్ధప్రసాద్ అమూల్య సేవ చేస్తున్నారని అభినందించారు.  

తెలుగులో చక్కదనం, చిక్కదనం ఉన్నాయని, అవధానం, పాదభ్రమకాల వంటి ప్రక్రియలు మన భాష ప్రత్యేకతలని వెంకయ్య నాయుడు చెప్పారు. తెలుగులో ఛందస్సు ఒక పెద్ద మేధస్సు అని, తెలుగు లో మాట్లాడడం రోత అని కొంతమంది భావిస్తున్నారని, కానీ మన తెలుగు భాష మెదడుకు మేత అని స్పష్టం చేశారు. ఇలాంటి అమ్మ భాషంటే నామోషీ ఎందుకని ప్రశ్నించారు. అందుకే సీఎం పేషీ నుంచి ఊరిలో పంచాయతీ వరకు పాలన వ్యవహారాలు తెలుగులోనే జరపాలన్నది తన అభిలాష అని చెప్పారు. ఇటీవల కాలంలో కొందరు చట్ట సభలలోనే బూతులు మాట్లాడుతున్నారు అని, వారికి పోలింగ్ బూత్ లలో సమాధానం చెప్పాలని పిలుపునిచ్చారు.

తెలుగువారిని మదరాసీలు అని తమిళసోదరులతో కలిపి గుర్తించే రోజుల్లో తెలుగువారికి ఒక ప్రత్యేక సంస్కృతి ఉంది అని ప్రపంచానికి చాటి చెప్పి ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చిన ఘనత  ఎన్టీఆర్ ది అని వెంకయ్య నాయుడు చెప్పారు. ఆయన తెలుగు వారు గర్వపడే సంతకం అన్నారు.

తెలుగు భాషను సుసంపన్నం చేసిన మహనీయులంటే వారికి ఎనలేని గౌరవం,మక్కువ అని,తరతరాల పాటు ఆ మహనీయుల స్ఫూర్తి గుర్తుండిపోయేలా ట్యాంక్ బండ్ పై వారి విగ్రహాలను ఏర్పాటు చేశారని గుర్తు చేశారు.తెలుగు నేలపై పుట్టినందుకు తెలుగు వాడిగా గర్విస్తూ,  తెలుగు వాడికి ఆత్మగౌరవం ఉందని చాటి చెబుతూ, సాటివారందరినీ చిన్నా పెద్దా బేధం లేకుండా గౌరవవాచకంతో సంబోధిస్తూ ఆత్మగౌరవం అందరికీ ఉంటుందని ఆచరణలో పాటించి తెలుగు వారి గుండె చప్పుడయ్యారు ఎన్టీఆర్ అని కొనియాడారు. 

చలన చిత్ర రంగంలో ఎన్టీఆర్ ది ఒక ప్రత్యేక అధ్యాయం అని,  ఆయనే ఒక చరిత్ర అని వెంకయ్య నాయుడు చెప్పారు. పాత్ర ఏదైనా పరకాయ ప్రవేశం చేసి ప్రేక్షలను పాత్రతో లీనం చేయడం ఆయనకే చెల్లు అన్నారు.కథానాయకుడికి ఉండాల్సిన రూపం, అభినయం, వాచకం వంటి ఆంగికాలు అన్నీ సరిగ్గా పోత పోసిన వ్యక్తి ఎన్టీఆర్ అని, అందగాడిగా పేరుగాంచిన ఎన్టీఆర్ డీగ్లామర్ పాత్రలూ పోషించి మెప్పించడం విశేషం అన్నారు. నర్తనశాలలో  బృహన్నల పాత్ర, కలసి ఉంటే కలదు సుఖం సినిమాలో చేయి పడిపోయిన కథానాయకుడి పాత్ర ,చిరంజీవులు సినిమాలో అంధుడి పాత్ర  వంటి పాత్రలు చేయడం సాహసమని అన్నారు. ఇటువంటి పాత్రలతో కెరియర్ దెబ్బతింటుందని ఎందరు వారించినా సాహసోపేతంగా వాటిల్లో నటించి తనలోని నటుడుకి ఎల్లలు లేవని చాటి చెప్పారన్నారు.రామారావు ప్రతిభాపాటవాలు నభూతో నభవిష్యతి అని,  నటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా ఆయనే ఒక వ్యవస్థ అని చెప్పారు.

ఎక్కడో నిమ్మకూరు అనే పల్లెలో సాధారణ రైతు కుటుంబంలో పుట్టి విశ్వవిఖ్యాత నటసార్వభౌముడిగా, దేశ రాజకీయాల్లో చరిత్ర సృష్టించిన మేటి నేతగా ఎదగడం సామాన్యం కాదని,ఎంతో అకుంఠిత దీక్ష, ఉత్తమ జీవనశైలి, దేశం, సమాజం, ప్రజల పట్ల ఎంతో నిబద్ధత ఉంటే తప్ప సాధ్యం కాదని అన్నారు.  "వారి క్రమశిక్షణ అసమాన్యం. తెల్లవారు జామునే మేకప్ తో సిద్ధంగా ఉండి ఠంచనుగా సెట్ కు వెళ్లిపోయి, మూడు షిఫ్టులు ఏకబిగిన షూటింగ్ లో పాల్గొనేవారు. ఇది ఆయన కోసం మాత్రమే  కాదు. ఆయన మూడు షిఫ్టుల్లో పని చేస్తే చలనచిత్ర రంగంలో కార్మికులకు చేతి నిండా పని." అని చెప్పారు. 

దానవీరశూరకర్ణ చలనచిత్రం భారత చలనచిత్రరంగంలోనే, ఆ మాటకొస్తే ప్రపంచ చలనచిత్ర రంగంలోనే అనితర సాధ్యమయిన రికార్డులను సొంతం చేసుకుందని,దానికి కర్త, కర్మ, క్రియ అన్నీ రామారావుగారే అని,  ఆయన తప్ప మరెవరూ ఆ సాహసం చేయలేరని స్పష్టం చేశారు.  దుర్యోధనుడిగా, కర్ణుడిగా, శ్రీ కృష్ణుడిగా మూడు విభిన్న పాత్రలు పోషిస్తూ, దర్శకత్వం, నిర్మాణబాధ్యతలు చేపట్టి కేవలం 43 రోజుల్లోనే చిత్రాన్ని పూర్తి చేసి విడుదల చేయడం ఆయనకు తప్ప మరెవరికి సాధ్యం అని అన్నారు.  
పౌరాణిక పాత్రల రూపు రేఖలు ఎలా ఉంటాయో మనెవరికీ తెలియదని, . పురాణాలు, ఇతిహాసాలపై మంచి పట్టు ఉన్న రామారావుగారు అందులో పాత్రలను వర్ణించిన తీరును బాగా పరిశోధించి వాటి ఆధారంగా పురాణ పురుషులకు రూపం ఇవ్వడంలో విశేష కృషి చేశారని తెలిపారు.

రామారావు అసలు సిసలు ప్రజా మనిషి అని, సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్లు అని ప్రజాస్వామ్యానికి తిరుగులేని నిర్వచనం చెప్పిన ఆయన రాజకీయాల్లోకి రాకముందు నుంచే ప్రజల మనిషిగా మసిలారని వెంకయ్య నాయుడు చెప్పారు.  ఆ రోజుల్లో టూర్ ఆపరేటర్లు తిరుమల దర్శనం తర్వాత, మద్రాసులో ఎన్టీఆర్ ఇంటి వద్దకు యాత్రికులను తీసుకెళ్లేవారని,  వారిని ఏనాడూ రామారావు గారు నిరాశపర్చలేదని, వచ్చిన వారిని పలకరించి పంపించేవారని చెప్పారు.. నూటికి నూరుపాళ్లు సామాన్యుల కోసం, అట్టడుగు వర్గాల కోసం తపించిన మహా మనీషి అని కొనియాడారు. 
రామారావు నియంతృత్వాన్ని ఎదిరించిన ధీరోదాత్తుడని, ప్రజాస్వామ్యమంటే భూస్వాములకు, కొందరు స్వామిభక్తి పరాయణులకు పరిమితమయినది కాదు.. పేదల పెదవులపై సంతోషం నింపేది అని నమ్మి ఆచరించిన ప్రజామనిషి అన్నారు.  1984లో ఆయనను పదవీ చ్యుతుడిని చేసి ఏకంగా ప్రజాస్వామ్యాన్నే వెన్నుపోటు పొడవడాన్ని అందుకే తాను సహించలేకపోయానన్నారు.  నాటి ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమంలో  అందుకే క్రియాశీలకంగా పాల్గొన్నానని చెప్పారు.  కొందరు విపక్ష నేతలతో పాటు తనను ఆయన మంత్రి వర్గంలో చేరాలని ఆహ్వానించినా సున్నితంగా తిరస్కరంచినట్లు వెల్లడించారు. 

సినిమాలను ప్రజల్లో మార్పు తెచ్చే శక్తిమంతమైన మాధ్యమంగా గుర్తించి, దాన్ని సద్వినియోగం చేసి, బలమైన పాత్రల ద్వారా ఎన్నో సామాజిక సమస్యలపై ప్రజల్లో అవగాహన కల్పించిన రామారావు గారు, రాజకీయాల్లోనూ ఉన్నత విలువలతో విధులు నిర్వర్తించి మండలాల ఏర్పాటు, వెనకబడిన వర్గాలకు, స్ర్తీలకు రిజర్వేషన్లు, ఆడబిడ్డలకు ఆస్తిహక్కు వంటి ఎన్నో విప్లవాత్మక మార్పులు పాలనలో తెచ్చారని తెలిపారు. తాను సూచించిన కొన్ని పథకాలను అమలు చేయడం తనకు ఎంతో ఆత్మ సంతృప్తిని కలిగించిందన్నారు. ఎన్టీఆర్ స్ఫూర్తిని నేటి తరం అందిపుచ్చుకోవాలి అని పిలుపునిచ్చారు.

‘కృషి ఉంటే మనుషులు ఋషులౌతారు మహాపురుషులౌతారు తరతరాలకి తరగని వెలుగౌతారు ఇలవేలుపులౌతారు’ అన్నఆయన సినిమాలోని గేయాన్ని తన జీవితానికే అన్వయించుకుని యుగపురుషుడిగా ప్రజల జేజేలు అందుకున్న రామారావు జీవితం నేటి తరానికి స్ఫూర్తిదాయకం అని, అలాంటి గొప్ప వ్యక్తిని స్మరించుకునేలా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన కిన్నెర ఆర్ట్ థియేటర్స్ వారికి అభినందనలు తెలియ చేశారు.

కార్యక్రమంలో ఇంకా విశ్రాంత k v రమణా చారి, ఆంధ్రప్రదేశ్ పూర్వ ప్రధాన కార్యదర్శి LV సుబ్రమణ్యం,  వోలేటి పార్వతీశం, విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ భవాని ప్రసాద్ తదితరులు పాల్గొని ప్రసంగించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram
   
Copyrights 2015 | MaaGulf.com