సినిమా రివ్యూ: ‘ఆది పురుష్’

- June 16, 2023 , by Maagulf
సినిమా రివ్యూ: ‘ఆది పురుష్’

ప్రబాస్ సినిమా అంటే చాలు ప్రపంచం మొత్తం ఎదురు చూస్తుంది. ఎందుకంటే ఆయన ప్యాన్ ఇండియా స్టార్ మరి. అయితే, ప్యాన్ ఇండియా గుర్తింపు తెచ్చి పెట్టిన ‘బాహుబలి’ సినిమా తర్వాత ఆ స్థాయి హిట్ అందుకున్న ప్రబాస్ సినిమా ఇంతవరకూ రాలేదు.
ఇక, రామాయణం బ్యాక్ డ్రాప్‌లో వచ్చిన ‘ఆదిపురుష్’ సినిమా గురించి చెప్పాలంటే, చెప్పేందుకు ఏమీ లేదు. ఈ సినిమాకి మొదటన్నించీ నెగిటివిటీనే. అవును ఈ కాన్సెప్ట్ ప్రబాస్ టచ్ చేయకుండా వుండాల్సింది. ఏదో అలా జరిగిపోయింది. మొత్తానికి నెగిటివిటీలన్నింటినీ దాటుకుని ఈ రోజు(జూన్ 16)న సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. మరి, ‘ఆదిపురుష్’ ఎలా వుంది.?

కథ:
అందరికీ తెలిసిన కథే. కొత్తగా ఏం చెబుతారు.? రామాయణంలోని అరణ్య కాండనీ, యుద్ధ కాండనీ ప్రామాణికంగా తీసుకుని ఈ సినిమాని తెరకెక్కించారు. అరణ్య కాండ.. అంటే సీతను రావణాసురుడు ఎత్తుకుపోవడం, యుద్ద కాండ అంటే సీత కోసం వానర సేనతో కలిసి రావణాసురుడి మీదకి రాముడు దండెత్తడం..ఇదే. అయితే, అల్ర్టా మోడ్రన్ టెక్నాలజీ యూజ్ చేసి ఈ సినిమాని తెరకెక్కించారు.
ఈ ఆధునిక పరిజ్ఞానం అదేనండీ గ్రాఫిక్స్ మాయాజాలాన్ని బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ తెరపై ఎలా ఆవిష్కరించాడు.? అల్ర్టా మోడ్రన్ టెక్నాలజీ ‘ఆదిపురుష్’ని ఆదుకుందా.? నవ్వుల పాలు చేసిందా.? అంటే రెండోదే కరెక్ట్ అన్న అభిప్రాయాలు వెల్లువెత్తుతున్నాయ్. మీ అభిప్రాయం ఎలా వుందనేది తెలియాలంటే స్వయంగా ధియేటర్ ఎక్స్‌పీరియన్స్ చేసి చూడాల్సిందే. అదేనండీ సినిమాని ధియేటర్లో చూడాల్సిందే.

నటీనటుల పని తీరు:
హీరోగా ప్రబాస్‌ని ఇష్టపడని వారుండరు. డార్లింగ్ అంటూ ప్రేమగా పిలుచుకుంటుంటారు. అయితే, ‘ఆదిపురుష్’లో రాముడి పాత్రకు మాత్రం ప్రబాస్ అస్సలు సూట్ కాలేదన్న అభిప్రాయాలొస్తున్నాయ్. సీతగా కృతి సనన్ జస్ట్ ఓకే. ఇక, సినిమాకి కీలక పాత్రధారి అయిన హనుమంతుడి పాత్రపై రిలీజ్‌కి ముందు అనేక అభియోగాలు వినిపించాయ్. ముశ్లిం గెటప్‌ని తలపిస్తోంది హనుమంతుడి పాత్ర.. అంటూ ప్రచారం జరిగింది. అయితే, కొద్దో గొప్పో ‘ఆదిపురుష్’ సినిమాని హనుమంతుడి పాత్ర కోసమే చూడొచ్చంటున్నారు. ఇక, రావణాసురుడి పాత్రలో సైఫ్ అలీఖాన్ బొత్తిగా నవ్వుల పాలయ్యాడు. పది తలల రావణుడ్ని పలు రకాల కామెడీ చేసేశారు అడ్డ దిడ్డమైన గ్రాఫిక్స్ చేసి. ఇంపార్టెంట్ పాత్రలూ, పాత్రధారుల డిజైనింగ్ తీరు తెన్నులే ఇలా వుంటే, ఇక మిగిలిన పాత్రధారుల గురించి ఏం చెప్పాలి.? రామాయణానికి సంబంధించి మరో కీలక పాత్రలు వాలి, సుగ్రీవులు.. ఈ పాత్రల చిత్రణపై వస్తున్న కామెంట్లు అన్నీ ఇన్నీ కావు.

టెక్నీషియన్స్ పని తీరు:
రామాయణాన్ని తెరకెక్కించేశాడు కదా.. అని డైరెక్టర్ ఓం రౌత్ స్టార్ సీనియర్ డైరెక్టర్ అనుకునేరు.. ఆయన ఖాతాలో పెద్దగా చెప్పుకోదగ్గ సినిమాలేం లేవు. లెక్కలేనన్ని సినిమాలు తెరకెక్కించేసిన అనుభవం కూడా లేదు. కార్తీక్ పలాని సినిమాటోగ్రఫీ కొన్ని చోట్ల ఫర్వాలేదనిపిస్తుంది. మ్యూజిక్ పెద్దగా ఆకట్టుకున్నదేమీ లేదు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా అంత ఎఫెక్టివ్‌గా అనిపించదు. ఆర్ట్ వర్క్ కొన్ని చోట్ల జస్ట్ ఓకే. తెలిసిన కథే కాబట్టి, ఎడిటింగ్ విషయంలోనూ మాట్లాడుకోవడానికేమీ లేదు. డైలాగ్స్ కూడా ఆకట్టుకునేలా అనిపించవ్. నిర్మాణ విలువలు పెట్టిన బడ్జెట్‌ రేంజ్‌లో తెరపై కనిపించలేదు. 

ప్లస్ పాయింట్స్:
కొన్ని 3డి షార్ట్స్ అయితే బాగున్నాయని అంటున్నారు.
హనుమంతుడి పాత్ర, పర్‌ఫామెన్స్.

మైనస్ పాయింట్స్:
లెక్కకు మించి.. చాలా చాలా వున్నాయ్. సౌమ్యానికి మారు పేరైన రాముడిని యుద్ధ వీరుడిలా చూపించడం ఓ పెద్ద బ్లండర్ మిస్టేక్. 

చివరిగా
రిలీజ్‌కి ముందు నెగిటివిటీ వున్నా.. కొన్ని సినిమాలు రిలీజ్ తర్వాత ఆకట్టుకుంటుంటాయ్. కానీ, ‘ఆదిపురుష్’ అంతకు ముందు ఆ తర్వాతా ఒక్కటే. ప్రబాస్ కెరీర్‌తో ఆడుకున్నారంతే.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com