సినిమా రివ్యూ: ‘స్పై’

- June 29, 2023 , by Maagulf
సినిమా రివ్యూ: ‘స్పై’

నటీనటులు: నిఖిల్ సిద్దార్ధ్, ఐశ్వర్యా మీనన్, సానియా ఠాకూర్, దగ్గుబాటి రానా, నితిన్ మెహతా, ఆర్యన్ రాజేష్, అభినవ్ గోమఠం, మకరంద్ దేశ్ పాండే తదితరులు.

సంగీతం: చరణ్ శ్రీ పాకాల
సినిమాటోగ్రఫీ: వంశీ పచ్చి పులుసు
నిర్మాత, కథ: రాజశేఖర్ రెడ్డి
దర్శకత్వం: గ్యారీ బీహెచ్

ప్రస్తుతం నిఖిల్ కూడా ప్యాన్ ఇండియా హీరోనే. ‘కార్తికేయ 2’ సినిమాతో ఆ గుర్తింపు దక్కించుకున్నాడు నిఖిల్. అలాంటి నిఖిల్ హీరోగా స్పై థ్రిల్లర్ కాన్సెప్ట్‌తో వచ్చిన సినిమానే ‘స్పై’. ప్రచార చిత్రాలతో బాగా క్యూరియాసిటీ క్రియేట్ చేశారు. సుభాష్ చంద్రబోస్ డెత్ మిస్టరీ అంటూ ఇంకాస్త ఎక్కువే ఆధ్యం పోశారు. అయితే, 1945 నాటి సుభాష్ చంద్రబోస్ డెత్ మిస్టరీని, ఇప్పటి స్సై కథతో ఎలా లింక్ చేశారు.? ఆ లింకప్‌లో ‘స్పై’ టీమ్ సక్సెస్ అయ్యిందా.? లేదా.? తెలియాలంటే కథలోకి వెళ్లాల్సిందే.

కథ:
జై (నిఖిల్ సిద్ధార్ధ్) ‘రా’లో సీక్రెట్ ఏజెంట్. ఖాదిర్ (నితిన్ మెహతా) అనే టెర్రరిస్టును పట్టుకునే క్రమంలో జై అన్నయ్య అయిన సుభాష్ (ఆర్యన్ రాజేష్) చనిపోతాడు. అన్నయ్య చేతిలో చచ్చపోయాడనుకున్న ఖాదిర్ ఆ తర్వాత తిరిగి వస్తాడు. ఇండియాపై అతి పెద్ద ఎటాక్‌కి ప్లాన్ చేస్తాడు. ఈ విషయం తెలిసిన ‘రా’ ఛీఫ్, ఖాదిర్‌ను పట్టుకునే మిషన్‌ని జైకి అప్పగిస్తుంది. ఈ క్రమంలోనే సుభాష్ చంద్రబోస్‌కి సంబంధించిన సీక్రెట్ ఫైల్ ఒకటి రా సంస్థ నుంచి మిస్ అవుతుంది.? ఆ ఫైల్‌కీ ఖాదిర్‌కీ లింకేంటీ.? అసలు చనిపోయాడనుకున్న ఖాదిర్ ఎలా బతికొచ్చాడు.? అసలింతకీ సుభాస్ చంద్రబోస్ డెత్ మిస్టరీని ఈ సినిమాలో డీటెయిల్డ్‌గా చూపించగలిగారా.? తనకు అప్పగించిన మిషన్‌ని సక్సెస్‌ఫుల్‌గా హీరో పూర్తి చేశాడా.? తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

నటీనటుల పని తీరు:
స్పై పాత్రలో నిఖిల్ బాగా సూటయ్యాడు. తన అప్పియరెన్స్, ఆటిట్యూడ్ ఈ పాత్రకు చక్కగా సెట్టయ్యాయ్. హీరోయిన్ ఐశ్వర్యా మీనన్ పాత్ర తేలిపోయింది. స్పై క్యారెక్టర్ ఆమెకు అంతగా సూటవ్వలేదన్న అభిప్రాయాలున్నాయ్. హీరో పక్కనే వుండి, మిషన్‌లో తోడుగా వుండే క్యారెక్టర్‌లో అభినవ్ గోమఠం బాగానే చేశాడు. వీలు చిక్కినప్పుడల్లా నవ్వించే ప్రయత్నం చేశాడు. విలన్ పాత్రలో నితిన్ మెహతా జోకర్ అయిపోయాడు. మెయిన్ విలన్ రోల్ కూడా బలంగా తీర్చిదిద్దడంలో డైరెక్టర్ విఫలమయ్యాడు. గెస్ట్ రోల్‌లో రానా దగ్గుబాటి సర్‌ప్రైజ్ బాగుంది. మిగిలిన ప్రాతధారులు తమ పరిధి మేర జస్ట్ ఓకే అనిపిస్తారు. 

ఇక సినిమా నిండా యాక్షన్ సీన్లతో నింపేశారు. స్సై థ్రిల్లర్స్ అంటే, కేవలం యాక్షన్ వుంటే సరిపోదు కదా. కథలో బలం, కథనంలో పట్టు ఖచ్చితంగా వుండాలి. రాజశేఖర్ రెడ్డి ఇచ్చిన కథ బాగున్నప్పటికీ, కథనం పరిగెత్తించలేకపోయాడు దర్శకుడు. కథలో శ్రీలంక, మయన్మార్, ఖాట్మండూ, పాకిస్థాన్, చైనా.. ఇలా చాలా పేర్లు వినిపించాయ్ కథకు అంతర్జాతీయ అప్పీల్ ఇచ్చేందుకు. అలాగే విలన్ పాత్రలోనూ చాలా ట్విస్టులుంటాయ్. విలన్ పైకి కనిపించే ముఖం వేరు, లోపల ఇంకోటి. ఈ ట్విస్ట్‌ని ఆడియన్స్‌కి కనెక్ట్ చేసే క్రమంలో వుండాల్సిన థ్రిల్ మిస్ అయ్యింది. విలన్ ఎంత ప్రమాదకరమైనవాడో మాటల్లో చెప్పారు కానీ, ఆ పాత్రను తెరపై ఆశిష్కరించడంలో ఆ ప్రతిభ చూపించలేకపోయారు. కథలో చాలా ట్విస్టులకు అవకాశమున్నప్పటికీ సర్‌ప్రైజింగ్ వేలో వాటిని ఆవిష్కరించలేకపోయారు.

సాంకేతిక వర్గం పనితీరు:
సినిమా కోసం చాలా ఖర్చు చేశారు. నిర్మాణ విలువలు బాగున్నాయ్. చరణ్ పాకాల నేపథ్య సంగీతం ఆకట్టుకుంది. పాటలు సో సోగా వున్నప్పటికీ, థ్రిల్లింగ్ అంశాలకు ఆయన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ప్రాణం పోసింది. సినిమాటోగ్రఫీ ఓకే. ఇక, ఎడిటింగ్ ఫీల్డ్ నుంచి దర్శకుడిగా పరిచయమైన గ్యారీ బీహెచ్ ఈ సినిమాకి స్ర్కీన్‌ప్లే ఇంకాస్త బలంగా రాసుకుని వుండి వుంటే బాగుండేదన్న అభిప్రాయాలు వస్తున్నాయ్. కేవలం యాక్షన్ మాత్రమే నమ్ముకుని ‘స్పై’లో అవకాశమున్నా థ్రిల్లింగ్ అంశాల్ని ఎఫెక్టివ్‌గా ప్రజెంట్ చేయడంలో గ్యారీ విఫలమయ్యాడు. 

ప్లస్ పాయింట్స్:
కథ, స్పైగా నిఖిల్ అప్పియరెన్స్, కఠినమైన సాహసాలు, అక్కడక్కడా కొన్ని ట్విస్టులు..

మైనస్ పాయింట్స్:
సీనియర్ నటీనటులున్నప్పటికీ వారిని ప్రభావవంతంగా వాడుకోలేకపోవడం. 
వేగంగా సాగే కథనం లేకపోవడం, స్కీన్‌ప్లే.. 

చివరిగా: ‘స్పై’ ఓన్లీ యాక్షన్, నో థ్రిల్లింగ్.!

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com