తెలుగు ప్రపంచ భాష కావాలి: వెంకయ్య నాయుడు

- July 09, 2023 , by Maagulf
తెలుగు ప్రపంచ భాష కావాలి: వెంకయ్య నాయుడు

అమెరికా: తెలుగు ప్రపంచ భాష కావాలని భారత పూర్వ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు అభిలషించారు. ఇది సాకారం కావాలంటే తెలుగు భాషలో సాంకేతిక విప్లవం ప్రారంభం కావాలని అన్నారు. ప్రపంచంలోని తెలుగు వారంతా సామాజిక మాధ్యమాల్లో తెలుగులోనే ఉత్తర ప్రత్యుత్తరాలు జరుపుకోవాలని పిలుపునిచ్చారు. ఇంకా ఏదైనా సాంకేతిక సాధనాలు కావాలంటే ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సాంకేతిక నిపుణులు కృషి చేయాలని  పిలుపునిచ్చారు. భారత కాలమానం ప్రకారం ఆదివారం ఉదయం వెంకయ్య నాయుడు అమెరికా, ఫిలడెల్ఫియాలోని పెన్సిల్వేనియా కన్వెన్షన్ సెంటర్లో తానా 23వ మహాసభలకు ముఖ్య అతిథిగా హాజరై కీలక ఉపన్యాసం చేశారు. ఈ సందర్భంగా వెంకయ్య నాయుడు మాట్లాడుతూ  ప్రపంచ భాషగా తెలుగుకు గౌరవాన్ని తీసుకొచ్చేందుకు తానా లాంటి సంస్థలు చొరవ తీసుకోవాలని సూచించారు. మాతృభాషలో విద్యాబోధనతో మాతృభాష పరిరక్షణ దిశగా తొలి అడుగు పడితే, జాతీయ అంతర్జాతీయ స్థాయిలో భాషను నిలబెట్టుకునేందుకు సాంకేతికంగా భాషకు ఉపకరణాలు సమకూర్చుకోవలసిన అవసరం ఉందన్నారు. "భాష మనుగడకు వాడుకే జీవగర్ర. వాడుక లేకుంటే భాష మరుగున పడిపోతుంది. జీవన విధానంలో భాషే ఆయువుపట్టు. తెలుగు సాహిత్యం ఎంతో ఉత్కృష్టమైనది. దానిని మరల దశదిశల వ్యాప్తి చేయాలి. మన ఆట, మన పాట, మన భాష, మన యాస, మన గోస, మన కట్టు, మన బొట్టు, చివరకు మన తిట్టు సహా సంప్రదాయాలను పునరుజ్జీవింప చేసుకోవాలి." అని స్పష్టం చేశారు. 

" మన భాషను మనం మరచిపోయేలా చేసేందుకు బ్రిటీష్ పాలనలో ఉద్యోగాల్లో ఆంగ్లానికి పెద్ద పీట వేశారు. ఫలితంగా మనకు ఆంగ్లం మీద వ్యామోహం పెరిగింది. ఈ జాఢ్యాన్ని యువతరం వదిలించుకోవలసిన అవసరం ఉంది. ఉద్యోగాలను మాతృభాషతో అనుసంధానం చేయటం ద్వారా మాతృభాష వాడకం మరింత పెరిగే అవకాశం ఉంది. ఈ దిశగా ప్రభుత్వాలతో పాటు ప్రైవేటు సంస్థలు సైతం చొరవ తీసుకోవాలి.  భాష అంటే కేవలం మాటలు కాదు... మన భవిష్యత్తు కూడా అనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తెరగాలి. హిందీ తర్వాత ఎక్కువ మంది మాట్లాడే భాష తెలుగే అయినప్పటికీ రానురాను చదువు విషయంలో తెలుగుకు ప్రాధాన్యత తగ్గిస్తూ వస్తున్నాం. ఈ పరిస్థితిలో మార్పు రావాలి." అని చెప్పారు.

పిల్లలకు బోధన తెలుగులోనే ఉండాలని వెంకయ్య నాయుడు సూచించారు. ఆంగ్లంలో బోధన ఉంటే తొలుత ఆంగ్లభాష నేర్చుకోవాలని ఆ తర్వాత విషయం బోధపడుతుందని చెప్పారు. ఇది పిల్లలకు ప్రయాసతో కూడిన అని అన్నారు. అదే తెలుగులో నేర్చుకుంటే నేరుగా విషయం తలకెక్కుతుందని చెప్పారు. తెలుగులో నువ్వు కుంటే ఉన్నత స్థానాలకు ఎదగలేమని కొందరిలో భావన ఉందని ఇది తప్పని స్పష్టం చేశారు. భారతదేశ రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము, ప్రపంచమంతా భారత్ వైపు చూసేలా చేసిన శక్తిమంతమైన నేత, భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ, గ్రామస్థాయి నుంచి ఉపరాష్ట్రపతి పదవి వరకు అంచెలంచెలుగా ఎదిగిన తాను, భారత సర్వోన్నత న్యాయస్థానానికి ప్రధాన న్యాయమూర్తిగా సేవలందించిన జస్టిస్ శ్రీ ఎన్ వి రమణ తెలుగు మాధ్యమం లోనే చదువుకున్నామని గుర్తు చేశారు. తెలుగు మాధ్యమంలో చదివితే ఉన్నత స్థానాలకు ఎదగవచ్చని నిరూపించడానికి ఇంతకంటే ప్రత్యక్ష నిదర్శనమేమి ఉంటుందని అన్నారు.
 తాను అనేక సందర్భాల్లో చెబుతున్నట్లు
"భాష పోతే శ్వాస పోయినట్లే.
భాష పోతే మన సంస్కృతి పోతుంది.
భాష పోతే సినిమా పోతుంది.
భాష పోతే నాటకం పోతుంది. 
ప్రాంతీయ పత్రికలు పోతాయి.
ఆఖరుకు మన అడ్రస్ పోతుంది.. అంటే మన గుర్తింపే లేకుండా పోతుంది. 
భాష... ఒక సహజ ప్రవాహం...
భాష... ఒక సజీవ సమాజ దర్పణం..
భాష... మానవసంబంధాలను అభివృద్ధి పరిచే సంస్కృతికి ప్రతిబింబం." అని పేర్కొన్నారు.

"జన్మభూమి కంటే | స్వర్గంబు వేరేది |
మాతృభాష కంటే  | మధురమేది |
కన్నతల్లి కంటే  | మన దైవమింకేది |
తెలియుమయ్య నీవు | తెలుగుబిడ్డ"
అని ప్రముఖ రచయిత నార్ల చిరంజీవి మాతృభాష గొప్పతనాన్ని గురించి చెప్పిన పంక్తులను వెంకయ్య నాయుడు ఉదహరించారు.ఈ స్ఫూర్తితో భాషతో పాటు యాసను గుర్తుంచుకుని కాపాడుకోవాలి అని పిలుపునిచ్చారు. "ప్రతి నాగరికతా తన గొప్పతనాన్ని భాష ద్వారా వ్యక్తం చేసింది. మన ఆటలు, మాటలు, పాటలు, సంగీతం, కళలు, పండుగలు, పబ్బాలు, సామూహిక కార్యక్రమాలు. వ్యాపార సంబంధాలు ఇవన్నీ భాష లేకుండా పెంపొందలేవు. భాష సమాజాన్ని సృష్టిస్తుంది. జాతిని బలపరుస్తుంది. అభివృద్ధికి మార్గం వేస్తుంది. సామాజిక పరిణామ క్రమంలో భాష కీలకమైన ఇరుసు వంటిది. భాష అంటే మానవ సంబంధాల అభివృద్ధి వ్యక్తీకరణ. తెలుగు పద్యం అంటే నాకు ఎంతో ఇష్టం. పద్యం అంటే ఏమిటి?ఎన్నో విషయాలను కొద్ది వాక్యాల్లో అద్భుతంగా చెప్పే ప్రక్రియ. సముద్రాన్ని చిన్న గిన్నెలో ఇమిడ్చినట్లు ఎన్నో భావాలను ఒక పద్యం లో ఇమిడ్చి చెప్పేందుకు ఎంతో ప్రతిభ కావాలి.  ఆదికవి నన్నయ్య కాలం నుంచి ఈనాటి వరకూ తెలుగు సాహిత్యంలో మనకు వేలాది పద్యాలు ఉన్నాయి. అలాంటి పద్యాన్ని కాపాడుకుని మన తెలుగు భాష ఔన్నత్యాన్ని సగర్వంగా చాటుకోవాలి." అని చెప్పారు.
తెలుగు భాషా, సంస్కృతుల పరిరక్షణ కోసం తానా ఇప్పటి వరకూ తీసుకున్న చొరవ అభినందనీయ మైనదని, అమెరికాలోనే గాక, సొంత గడ్డ మీద కూడా ఈ దిశగా తానా చేసిన కృషి ముదావహమని చెప్పారు. ప్రవాస తెలుగు ప్రజల ద్వారా మన భాషా సంస్కృతులు విశ్వవ్యాపితమవుతున్నాయని,ఎల్లలు దాటి ప్రపంచమంతా తెలుగు భాషా, సంస్కృతుల వెలుగులు ప్రసరిస్తున్నాయని చెప్పారు. ప్రవాస తెలుగు ప్రజలు తెలుగును మిక్కిలిగా ప్రేమిస్తున్నారని, ఏ దేశంలో ఉన్నా తెలుగు సంస్కృతిని పరిరక్షిస్తున్నారని అభినందించారు.
భారత్ మళ్లీ విశ్వ గురు స్థానంలోకి రావాలని వెంకయ్య నాయుడు అభిలషించారు. "ఒకప్పడు ప్రపంచానికి జ్ఞానాన్ని, విజ్ఞానాన్ని అందించిన దేశం భారత దేశం. నలంద, తక్షశిల వంటి విశ్వవిద్యాలయాలకు ప్రపంచవ్యాప్తంగా వివిధ ప్రదేశాల నుంచి జ్ఞానసముపార్జనకు వచ్చేవారు. ఇక్కడి నుంచి నేర్చుకుని ప్రపంచం నలుచెరుగులా ఆ విద్యాసంపదను పంచేవారు.  మరలా భారత్ విశ్వగురు స్థానంలోకి రావాలి. భారతీయులలో, తెలుగువారిలో అసమాన ప్రతిభాపాటవాలు సహజసిద్ధంగానే ఉంటాయి. వాటిని వెలికి తీసి ప్రోత్సహిస్తే భారత్ మరలా విశ్వగురు స్థానానికి చేరుకుంటుంది. ఇందుకోసం మీలో ప్రతిఒక్కరూ మీ వంతు పాత్ర పోషించాలి. ప్రతిభావంతులను గుర్తించి మీవంతుగా సానబెట్టండి." అని పిలుపునిచ్చారు. "ప్రపంచంలోనే టాప్ 30 కంపెనీలకు సీఈవోలుగా భారతీయులు, అందులో తెలుగువారూ ఉండడం మనకు గర్వకారణం. భారతీయులు, తెలుగువారి సామర్థ్యానికి ఇదే నిదర్శనం. సత్యనాదెళ్ల (మైక్రోసాఫ్ట్), సుందర్ పిచాయ్ (గూగుల్), వసంత్ నరసింహన్ (నోవార్టీస్ ఏజీ), శంతను నారాయెన్ (అడోబ్), అరవింద్ క్రిష్ణ (ఐబీఎం) తదితరులు తమ ప్రతిభతో ప్రపంచస్థాయి కంపెనీల సారథులయ్యారు. ఇలా ప్రతిభాపాటవాలు, నాయకత్వ లక్షణాలున్నవారు వందల్లో ఉన్నారు. " అని పేర్కొన్నారు.

" ఇప్పుడే కాదు.. ప్రపంచ పటంలో ఏనాడో ప్రముఖ స్థానాన్ని సంపాదించిన పుణ్యభూమి మనది. ఆరు గజాల చీరను అగ్గిపెట్టలో అమర్చగల కళా నైపుణ్యాన్ని కైవసం చేసుకున్న నేత కృషి వరులకు జన్మనిచ్చిన కర్మభూమి మనది. రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించి తుపాకి గుండ్లకు గుండెలు ఎదురొడ్డిన అల్లూరి సీతారామరాజు, కొమరంభీమ్ వంటి జగజ్జెట్టీలు, తెలుగు వెలుగును విశ్వవ్యాపితం చేసిన నట సార్వభౌముడు, మన మాజీ ముఖ్యమంత్రి శ్రీ నందమూరి తారకరామారావు వంటి దిగ్గజాలు జన్మించిన నేల మనది. స్వేచ్ఛా వాయువుల కోసం పోరాడామే తప్ప విస్తరణ కాంక్ష, ఆక్రమణ కాంక్ష మనకు లేవు. " అని స్పష్టం చేశారు." భారత్ విశ్వగురుగా అవతరించాలనుకోవడం సామ్రాజ్య విస్తరణకు కాదు.  ఎవరినీ శాసించాలనీ కాదు. ఏ దేశాన్నీ ఆక్రమించాలనీ కాదు. ఆ ఉద్దేశం మనకు ఎన్నడూ లేదు. భారత్ శక్తిమంతంగా తయారు కావాలని పెట్టుకున్న లక్ష్యం వెనక ఉద్దేశం విశ్వానికి విజ్ఞాన, పరిజ్ఞానాలను అందించడమే. విశ్వసౌభ్రాత్రుత్వం భారత్ నమ్మే ధర్మం." అని విస్పష్టంగా చెప్పారు. 

అమెరికాలో తెలుగు వారిని తానా వేదిక ద్వారా కలవటం ఎంతో సంతోషంగా ఉంది అని చెప్పారు.  45 ఏళ్ళకు పైగా అమెరికాలో తెలుగు భాష, సంస్కృతి, సంప్రదాయ పరిరక్షణ కోసం పాటు పడుతూ, వాటిని ప్రవాసాంధ్ర భావితరానికి అందించే క్రమంలో ఆహరహం కృషి చేస్తోందని ఉత్తర అమెరికా తెలుగు సంఘానికి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా తానా అధ్యక్షుడు లావు అంజయ్య చౌదరికి, తానా మహాసభల సమన్వయకర్త రవి పొట్లూరి సహా సభ్యులందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com