సినిమా రివ్యూ: ‘స్కంధ’

- September 29, 2023 , by Maagulf
సినిమా రివ్యూ: ‘స్కంధ’


నటీనటులు: రామ్ పోతినేని, శ్రీలీల, సయీ మంజ్రేకర్, శ్రీలీల, దగ్గుబాటి రాజా, అజయ్ పుర్వార్, లోహితశ్య, ఇంద్రజ, గౌతమి, పృద్వీ, తదితరులు
సంగీతం : థమన్,
సినిమాటోగ్రఫీ: సంతోష్ దేటకే
నిర్మాత: శ్రీనివాస్ చిట్టూరి, 
దర్శకత్వం: బోయపాటి శీను

‘అఖండ’ వంటి భారీ విజయం తర్వాత బోయపాటి తెరకెక్కించిన చిత్రం ‘స్కంధ’. బోయపాటి సినిమాలంటే మాస్, ఊరమాస్ రేంజ్‌లోనే వుంటాయని ఆడియన్స్ ఆల్రెడీ ఫిక్స్ అయిపోయారు. అయితే, రామ్‌ని బోయపాటి చూపించిన మాస్ యాంగిల్ ఎలా వుంది.? ప్రేక్షకుల్ని ఆకట్టుకుందా.? లేదా.? తెలియాలంటే కథలోకి వెళ్లాల్సిందే.

కథ:
రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య కథలోకి హీరోని చొప్పించిన విధానమే ‘స్కంధ’ కథ. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి రాయుడు (అజయ్ పుర్కార్) కూతుర్ని పెళ్లి పీటల మీద నుంచి తీసుకెళ్లిపోతాడు తెలంగాణా ముఖ్యమంత్రి రంజిత్ రెడ్డి (శరత్ లోహితశ్య) కుమారుడు. దాంతో, తెలంగాణా సీఎంనీ, ఆయన కొడుకుని చంపించేందుకు సుపారీని దించుతాడు ఏపీ ముఖ్యమంత్రి. తెలంగాణా ముఖ్యమంత్రిని ఆ సుపారీ నుంచి కాపాడతాడు భాస్కర్ (రామ్ పోతినేని). ఆ వంకతో తెలంగాణా సీఎంకి దగ్గరైన భాస్కర్.. ఆయన కూతురితో పాటూ, అటు ఆంధ్ర కూతురిని కూడా ఎత్తుకెళ్లిపోతాడు. దీంతో ఇరు రాష్ర్టాల ముఖ్యమంత్రులూ భాస్కర్‌ని టార్కెట్ చేస్తారు. అసలు భాస్కర్ ఎవరు.? ముఖ్యమంత్రుల్ని టార్గెట్ చేసేందుకు అంత బలమైన కారణమేంటీ.? అనే ఆసక్తికరమైన ట్విస్ట్ తెలియాలంటే ‘స్కంధ’ సినిమా ధియేటర్లో చూడాల్సిందే.  

నటీనటుల పనితీరు:
బోయపాటి సినిమాలు కేవలం బాలయ్యకే సెట్ అవుతాయ్. ఆయన మాస్ స్టైల్.. బోయపాటి శీను మాస్ మేకింగ్ దొందూ దొందే అనేలా సెట్ అయిపోయాయ్. అందుకే ఆ పెయిర్ సక్సెస్ పెయిర్‌గా పాపులర్ అయ్యింది. కానీ, గతంలో రామ్ చరణ్ హీరోగా వచ్చిన ‘వినయ విధేయ రామ’ ప్రేక్షకుల్ని మెప్పించలేకపోయింది. కానీ, రామ్‌కి ఒకింత బోయపాటి మాస్ స్టైల్ నప్పినట్లే అనిపించింది. క్లాస్‌గా కనిపించినా మాస్ లుక్స్‌లోనూ రామ్ అతికినట్లు సరిపోతాడు. అదే ఈ సినిమాకి ప్లస్ అయ్యిందని చెప్పొచ్చు. అదే తరుణంలో అక్కడక్కడా కాస్త అతి అనిపించడం సహజమే. తనదైన మాస్ అప్పియరెన్స్‌తో రామ్ ఆకట్టుకున్నాడీ సినిమాలో. శ్రీలీల పాత్ర కేవలం గ్లామర్‌కే పరిమితమైంది. డాన్సుల వరకే శ్రీలీల గురించి మాట్లాడుకోవాలి తప్ప అంతకు మించి సినిమా లేదు. సయీ మంజ్రేకర్ వున్నంతలో కాస్త బెటర్. విలన్ రోల్స్ ఓకే. శ్రీకాంత్, సీనియర్ నటుడు దగ్గుబాటి రాజా తదితరులు తమ పాత్ర పరిధి మేర మెప్పించారు. ఇంద్రజ, గౌతమి తదితర పాత్రల్ని బోయపాటి సరిగ్గా వాడుకోలేకపోయారు.

సాంకేతిక వర్గం పనితీరు:
బోయపాటి సినిమాల్లో లాజిక్కులుండవ్. అప్పటికప్పుడే దేశాలు దాటేస్తుంటాడు. అదే బోయపాటి అతి. అలాంటి అతి సన్నివేశాలు ఈ సినిమాలోనూ చాలానే వుంటాయ్. కానీ లాజిక్కులు ఆలోచించకుండా.. మాస్ మ్యాజిక్ మాత్రమే ప్రామాణికంగా తీసుకుంటే.. ‘స్కంధ’ ఓకే అనిపిస్తుంది. అంతకు మించి బోయపాటి సినిమాల్లో కొత్తదనం ఆశిస్తే మాత్రం డిజప్పాయింట్‌మెంట్ తప్పదు.. ఇక థమన్ మ్యూజిక్ ‘అఖండ’తో పోల్చితే ఏమంత మ్యాజిక్స్ క్రియేట్ చేయలేదనే చెప్పాలేమో. రెండు పాటలు బాగున్నాయంతే. సినిమాటోగ్రఫీ ఓకే. నిర్మాణ విలువలు బాగున్నాయ్. పల్లెటూరి వాతావరణం ఏంబియన్స్ ఆకట్టుకుంటుంది. ఎడిటింగ్‌కి కాస్త ఎక్కువే పదును పెట్టి వుండాల్సింది. 

ప్లస్ పాయింట్స్:
రామ్ మాస్ లుక్స్.. అక్కడక్కడా కొన్ని ఎలివేషన్లు, 

మైనస్ పాయింట్స్:
అతి అనిపించేలా అన్ని రకాల ఆయుధాల్ని వాడేసి కస కసా అడ్డొచ్చిన రౌడీల్ని నరుక్కుంటూ పోవడం కాస్త అతిగా అనిపిస్తుంది. కొన్ని చోట్ల రామ్‌కి అది సెట్ అయినట్లు అనిపించదు.
కొత్తదనం లేని కథనం. 

చివరిగా: 
మాస్ ఫీస్ట్ ‘స్కంధ’. లాజిక్కులు అడక్కుండా.. ఓన్లీ మాస్ మ్యాజిక్ ఇష్టపడేవారికి స్కంధ ఓకే. డిఫరెంట్ ఫీల్ కోరుకుంటే మాత్రం నాట్ ఓకే.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com