ఉమ్మడి పౌర స్మృతితోనే సమానత్వ సాధన: వెంకయ్యనాయుడు
- October 28, 2023
బెంగళూర్: భిన్న సంస్కృతులకు, భిన్న మతాలకు నిలయమైన భారత్ లో సమానత్వ సాధనకు ఉమ్మడి పౌరస్మృతి ఎంతో అవసరమని భారత పూర్వ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు చెప్పారు. స్వాతంత్రం వచ్చిన నాటి నుంచి పౌరస్మృతి లేకపోవటం వలన అప్పటికే ఉన్న అసమానతలు ఇంకా పెరిగిపోయాయని చెప్పారు. వివాహం, విడాకులు, దత్తత, వారసత్వం తదితర అంశాల్లో ప్రతి మతానికీ ప్రత్యేకంగా సొంత చట్టాలున్నాయని గుర్తు చేస్తూ భిన్నత్వంతో ప్రకాశించే మన దేశంలో అందరికీ ఒకటే న్యాయాన్ని అందించడానికి వీలు కల్పించే ఉమ్మడి పౌర స్మృతి లేకపోవడం వల్ల అసమానతలు శాశ్వతంగా పాతుకుపోతున్నాయని చెప్పారు. బెంగళూర్ లో శుక్రవారం రాష్ట్ర ధర్మ నిర్వహించిన కార్యక్రమం లో ఉమ్మడి పౌర స్మృతి- భారత పురోగతి పై ప్రభావం అనే అంశం పై వెంకయ్య నాయుడు ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉమ్మడి పౌర స్మృతి లేకపోవడం వల్ల స్వరాజ్యం సాధించిన తర్వాత కూడా భారత్ సామాజికంగా, ఆర్థికంగా ఆశించినంత పురోగతి సాధించలేక పోయిందని స్పష్టం చేశారు. ఉమ్మడి పౌరస్మృతి అంశం ఈనాటిది కాదని, రాజ్యాంగ సభలోనే దీనిపై చర్చలు జరిగాయని గుర్తు చేశారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఉమ్మడి పౌరస్మృతి అవసరాన్ని నొక్కి చెప్పారని గుర్తు చేశారు. రాజ్యాంగసభలో అల్లాడి కృష్ణ స్వామి అయ్యర్, కె.ఎం.మున్షీ వంటి ప్రముఖ కోవిదులు కూడా ఉమ్మడి పౌర స్మృతి ఆవశ్యకతను సమర్థించారని వెల్లడించారు. రాజ్యాంగ సభలో ఉమ్మడి పౌర స్మృతిపై ఏకాభిప్రాయానికి రాలేకపోయినందున, ఈ అంశాన్ని ఆదేశిక సూత్రాలలోని 44వ అధికరణం కింద చేర్చారన్నారు. మత విశ్వాసాలు, ఆచారాలు, మతచట్టాలకు అతీతంగా దేశంలోని పౌరులందరికీ వర్తించేలా ఉమ్మడి పౌరస్మృతి ని తీసుకురావాలని ఈ అధికరణం స్పష్టం చేస్తోందని, సుప్రీంకోర్టు కూడా ఒకటి కన్నా ఎక్కువ సందర్భాల్లో ఈ అంశాన్ని ప్రస్తావించిందని తెలిపారు. 44వ అధికరణం నిరుపయోగంగా పడి ఉందని షాబానో కేసులో సుప్రీంకోర్టు వ్యాఖ్యానించిన సంగతిని గుర్తు చేశారు. దేశ సమైక్యతకు ఉమ్మడి పౌర స్మృతి ఉపయోగపడగలదని అభిప్రాయపడిందని తెలిపారు. పౌరులందరి ప్రాథమిక హక్కులను పరిరక్షించడానికి, సాంఘిక అసమానతలు, స్ర్తీ-పురుష అసమానత్వాన్ని తగ్గించడానికి ఎప్పటినుంచో ప్రతిపాదనగా ఉండిపోయిన ఉమ్మడి పౌర స్మృతిని అమల్లోకి తీసుకురావాలనుకోవడం సరైన దిశగా పడుతున్న అడుగేనని స్పష్టం చేశారు. దేశంలో అసమానతలను రూపుమాపే ఉమ్మడి పౌరస్మృతిని రాజకీయ పార్టీలు ,విభాగాలు వ్యతిరేకించరాదని విజ్ఞప్తి చేశారు. దీన్ని వ్యతిరేకిస్తే భారత సామాజిక , ఆర్థిక పురోగతికి అడ్డు తగిలినట్టేనన్నారు. ఉమ్మడి పౌరస్మృతిని ప్రత్యేకించి ఒక మతాన్ని లక్ష్యంగా చేసుకోవడానికి తీసుకు వస్తున్నారని అపోహ పడరాదని స్పష్టం చేశారు.రాజకీయ పార్టీలు, మతాలు దీనిపై సానుకూలంగా స్పందించాలని విజ్ఞప్తి చేశారు.
తాజా వార్తలు
- అక్టోబర్ 1న దుబాయ్ ఫౌంటెన్ రీ ఓపెన్..!!
- ఒక నెలలో 53 మిలియన్లకు పైగా యాత్రికులు..!!
- వద్ద ఒమన్ క్రెడిట్ రేటింగ్ 'BBB-'..!!
- 2029 పురుషుల వాలీబాల్ ప్రపంచ ఛాంపియన్‌షిప్‌కు ఖతార్ ఆతిథ్యం..!!
- వరల్డ్ ఫుడ్ ఇండియాతో గ్లోబల్ పార్టనర్ షిప్..!!
- బహ్రెయిన్‌లో తొలి వెటర్నరీ మెడిసిన్ కాన్ఫరెన్స్ సక్సెస్..!!
- శంకర నేత్రాలయ డెట్రాయిట్ 5K వాక్ ఘనంగా ముగిసింది
- మూసీ ఉగ్రరూపం చూశారా..
- హైదరాబాద్ కమిషనర్‌గా సజ్జనార్
- ఒమన్, కువైట్‌తో ఖతార్ సహకారం బలోపేతం..!!