‘ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణానికి ఏర్పాట్లు

- December 06, 2023 , by Maagulf
‘ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణానికి ఏర్పాట్లు

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ ప్రకటించిన ఆరు గ్యారెంటీలలో ‘ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం’ ఒకటి. చెప్పిన విధంగానే మహిళల ఉచిత ప్రయాణంకు ఏర్పాట్లు చేస్తోంది. ఏయే కేటగిరీ బస్సుల్లో అమలు చేస్తే.. ప్రభుత్వానికి ఎంత భారం పడనుందనే విషయంలో ఆర్టీసీ అధికారులు ఇప్పటికే లెక్కలు వేస్తున్నారు. కర్ణాటక రాష్ట్రంలో అమలవుతోన్న ఈ పథకం వివరాలను పరిశీలించేందుకు నలుగురు ఆర్టీసీ అధికారుల బృందం అతి త్వరలోనే బెంగళూరుకు వెళ్లనుంది. రెండు రోజుల పాటు కర్ణాటకలో ఈ పథకాన్ని పరిశీలించి.. పూర్తి వివరాలతో ఓ నివేదిక సిద్ధం చేయనున్నారు. తెలంగాణలో వీలైనంత తొందరలో ఈ పథకం అమలు చేసే అవకాశం ఉండడంతో.. సీఎం రేవంత్‌ రెడ్డి అడిగిన వెంటనే నివేదిక అందజేసేందుకు ఆర్టీసీ ఏర్పాట్లు చేస్తోంది.తమిళనాడులో మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ వసతి కల్పించారు. నగర, పట్టణ ప్రాంతాల్లో తిరిగే సిటీ, ఆర్డినరీ బస్సుల్లో మాత్రమే పథకంను అందుబాటులో ఉంచారు. ఇందుకోసం తమిళనాడులో ప్రత్యేకంగా గులాబీ రంగు బస్సులను ఉపయోగిస్తున్నారు. కర్ణాటకలో మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా ఎక్స్‌ప్రెస్‌, ఆర్డినరీ బస్సుల్లో ఈ పథకంను అమలులోకి తెచ్చింది. తెలంగాణలో కర్ణాటక మోడల్‌ను తీసుకొస్తారా? లేదా తమిళనాడు మోడల్‌ను అనుసరిస్తారా? అన్నది తెలియాల్సి ఉంది.కర్ణాటకలో మాదిరి పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్‌ బస్సుల్లో ఈ పథకాన్ని అమలు చేస్తే.. ఏటా రూ. 2200 కోట్లు ప్రభుత్వానికి ఖర్చు అవుతుందట. అదే పల్లె వెలుగు బస్సులకే పరిమితం చేస్తే.. రూ. 750 కోట్లు అవుతుందని అంచనా. తెలంగాణాలో మహిళలకు ఉచిత ప్రయాణ పథకం ప్రారంభమైతే.. ఆర్టీసీ కోల్పోయే ఆదాయాన్ని ప్రభుత్వమే చెల్లించాల్సి (రీయింబర్స్‌) ఉంటుంది.రోజుకు ఎంతమంది మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించారనే లెక్క తేలడం కోసం కర్ణాటకలో ‘జీరో టికెట్‌’ విధానం ప్రవేశపెట్టారు. అంటే.. మహిళలకు రూ. సున్నా అని ఉండే జీరో టికెట్‌ను ఇస్తారు. దాంతో రోజుకు ఎన్ని టికెట్లు జారీ అయ్యాయో నమోదు చేసి.. నెల వారీగా లెక్కిస్తారు. తెలంగాణలో కూడా ఇదే పద్ధతి ప్రవేశపెడతారా? లేదా మరో పద్ధతిని అనుసరిస్తారా? అన్నది చూడాలి. కర్ణాటకలో మాదిరి తెలంగాణలో అమలు చేస్తే.. పట్టణ, పల్లె మహిళలకు ప్రయోజనం చేకూరుతుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com