‘వైఎస్సార్‌ సుజలధార’ను ప్రారంభించిన సీఎం జగన్‌

- December 14, 2023 , by Maagulf
‘వైఎస్సార్‌ సుజలధార’ను ప్రారంభించిన సీఎం జగన్‌

అమరావతి: శ్రీకాకుళం జిల్లా కంచిలి మండలం మఖరాంపురం జాతీయ రహదారి పక్కన రూ.700 కోట్లతో నిర్మించిన వైఎస్సార్‌ సుజల ధార సురక్షిత తాగునీటి ప్రాజెక్టుని సిఎం జగన్మోహన్‌ రెడ్డి గురువారం ప్రారంభించారు. తొలుత శిలాఫలకం ఆవిష్కరణ చేసి పంపు హౌస్‌లో బటన్‌ నొక్కి నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఉద్దానం ప్రాంతంలో కళ్లెదుటే కిడ్నీ సమస్య కనిపిస్తున్నా గతంలో ఏ ప్రభుత్వాలు చొరవచూపలేదని చెప్పుకొచ్చారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రూ.785 కోట్లతో ఉద్దానం వ్యాధిగ్రస్తుల సమ­స్యకు శాశ్వత పరిష్కారాన్ని చూపించామని సీఎం వైఎస్ జగన్ వెల్లడించారు.ఉద్దానం ప్రాంతంలో దీర్ఘకాలిక మూత్రపిండ వ్యాధులు (క్రానిక్‌ కిడ్నీ డిసీజెస్‌) ప్రబలంగా ఉన్న ఏడు మండలాల్లోని అన్ని గ్రామాలకు ‘వైఎస్ఆర్ సుజలధార‘ ప్రాజెక్టు ద్వారా శుద్ధి చేసిన రక్షిత తాగునీరు అందించబోతున్నట్లు వెల్లడించారు. హిరమండలం రిజర్వాయర్‌ నుంచి నీటిని తీసుకుని శుద్ధి చేసి పలాస, ఇచ్ఛాపురం నియోజకవర్గాల పరిధిలో 7 మండలాల్లోని 807 గ్రామాలకు రక్షిత నీటి సరఫరా అందించబోతున్నట్లు తెలిపారు. ఈ ప్రాంతంలో ప్రస్తుతం ఉన్న 6.78 లక్షల జనాభా 2051 నాటికి 7.85 లక్షలకు చేరుతుందన్న అంచనాతో అప్పటి అవసరాలకు కూడా సరిపోయేలా ఒక్కొక్కరికి రోజుకు 100 లీటర్ల చొప్పున నీటి సరఫరా చేసేలా ప్రాజెక్టు నిర్మాణం చేసినట్లు వెల్లడించారు. ఇప్పటికే 613 గ్రామాలకు నీటి సరఫరా జరుగుతుందని సీఎం వైఎస్ జగన్ వెల్లడించారు. అనంతరం పలాసలో కిడ్నీ రీసెర్చ్‌ సెంటర్‌-సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రిని ప్రారంభించారు. ఆయన వెంట పలువురు మంత్రులతో పాటు, జిల్లా అధికారులు ఉన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com