అయోధ్యలో శ్రీరాముడి విగ్రహ ప్రతిష్ఠాపన క్రతువులు ప్రారంభం..

- January 16, 2024 , by Maagulf
అయోధ్యలో శ్రీరాముడి విగ్రహ ప్రతిష్ఠాపన క్రతువులు ప్రారంభం..

అయోధ్య: విశ్వ ఆధ్యాత్మిక నగరిగా విరాజిల్లుతున్న అయోధ్య రామ మందిరంలో శ్రీరాముని విగ్రహ ప్రతిష్ఠకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. మరికొన్ని రోజులు మాత్రమే గడువు ఉంది. జనవరి 22న అయోధ్య రామమందిరంలోని రామ్ లల్లా విగ్రహ ప్రతిష్టాపన జరగబోతుంది. ఈ మహత్తర ఆధ్యాత్మిక ఘట్టంకోసం దేశ వ్యాప్తంగానేకాక.. ప్రపంచ వ్యాప్తంగాఉన్న హిందువులు ఎదురు చూస్తున్నారు. అయితే, శ్రీరాముని విగ్రహ ప్రతిష్టకు మంగళవారం నుంచి సంప్రదాయ క్రతువులు ప్రారంభయ్యాయి. నేటి నుంచి జనవరి 21వ తేదీ వరకు నిరంతరాయంగా జరుగుతాయి.

22వ తేదీన మధ్యాహ్నం 12.30 గంటలకు శ్రీరాముడి విగ్రహాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రాణ ప్రతిష్టాపన చేస్తారు. ఈ కార్యక్రమంలో సుమారు 150 దేశాల నుంచి భక్తులు హాజరయ్యే అవకాశం ఉంది. దేశవ్యాప్తంగా ఏడు వేల మందికి ఆలయ ట్రస్టు ఆహ్వానాలు వెళ్లాయి. జనవరి 23 నుంచి భక్తులకు శ్రీరాముడి దర్శన భాగ్యం కల్పిస్తారు.

ఏరోజున ఏం చేస్తారంటే ..

  • జనవరి 16న పూజలు ఉదయం 9.30గంటలకు ప్రారంభమయ్యాయి. ఈ ఘట్టంలో ముందుగా ప్రాయశ్చిత్త పూజ చేస్తారు. దాదాపు ఐదు గంటలపాటు ఏకధాటిగా తొలిరోజు పూజలు జరగనున్నాయి. అనంతరం సరయూ నది ఒడ్డున దశవిధ స్నానం, విష్ణు పూజ, గోపూజ జరుగుతాయి.
  • జనవరి 17న శ్రీరాముడి విగ్రహ ఊరేగింపు అయోధ్యకు చేరుకుంటుంది. వేద మంత్రోచ్ఛరణలతో గర్భగుడి శుద్ధి చేస్తారు.
  • జనవరి 18న శ్రీరాముడి విగ్రహానికి గణేష్ అంబికా పూజ, వరుణ పూజ, మాతృక పూజ, వాస్తు పూజలు చేస్తారు.
  • జనవరి 19న రామాలయంలో యజ్ఞం ప్రారంభమవుతుంది. అదేరోజు నవగ్రహ, హవన్ స్థాపన నిర్వహిస్తారు.
  • జనవరి 20న గర్భగుడిని పవిత్ర సరయూ నది నీటితో శుద్ధి చేస్తారు. ఆ తర్వాత చక్రస్నానం, పండ్లు, పుష్పాలతో అభిషేకాలు ఉంటాయి.
  • జనవరి 21న శ్రీరాముడి విగ్రహానికి 125 కలశాలతో అభిషేకం చేస్తారు.
  • జనవరి 22న ప్రధాన ప్రాణ ప్రతిష్ట వేడుక జరుగుతుంది. మధ్యాహ్నం 12.30 గంటలకు ఈ కార్యక్రమం మొదలవుతుంది. శ్రీరాముడి విగ్రహాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రతిష్టాపన చేస్తారు.

ప్రాణ ప్రతిష్ఠ అంటే ఏమిటి?
ప్రాణ్ ప్రతిష్ఠ.. జైనమతం, హిందూ మతంలో విస్తృతంగా ఆచరించే ఆచారం. ప్రాణ్ ప్రతిష్ఠ కేవలం ఒక విగ్రహాన్ని ఉండం కాదు.. ఇది ఒక శక్తివంతమైన ప్రక్రియ. పవిత్రీకరణ ప్రక్రియను అనుసరించి దేవాలయం వంటి పవిత్ర ప్రదేశంలో దేవతా విగ్రహాన్ని ప్రతిష్ఠించడం జరుగుతుంది. ప్రతిష్ఠాపన సమయంలో పూజారులు వేద శ్లోకాల మంత్రోచ్ఛారణల మధ్య ఆచారాలతో ప్రక్రియను నిర్వహిస్తారు. ప్రాన్ అనే పదం ప్రాణశక్తిని సూచిస్తుంది.. ప్రతిష్ఠ అనే పదం స్థాపనను సూచిస్తుంది. సారాంశంలో ప్రాణ్ ప్రతిష్ఠ, ప్రతిష్టాపన కార్యక్రమం, విగ్రహంలోకి ప్రాణశక్తిని ప్రేరేపించడం, దేవత, దాని పవిత్ర నివాసం మధ్య లోతైన బంధాన్ని సృష్టించడం.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com