తెలంగాణ ప్రభుత్వం 3 కీలక నిర్ణయాలు..
- February 12, 2024హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం మూడు కీలక నిర్ణయాలు తీసుకుంది. మాదకద్రవ్యాల రహిత రాష్ట్రంగా తెలంగాణను మార్చే దిశగా అడుగులు వేస్తున్న సర్కార్.. హుక్కా సెంటర్ల నిషేధం బిల్లును తీసుకొచ్చింది. మరోవైపు గ్రూప్-1 నోటిఫికేషన్ కు లైన్ క్లియర్ చేస్తూ సుప్రీంకోర్టులో ఉన్న పిటిషన్ ను ఉపసంహరించుకున్న ప్రభుత్వం.. ఇదే సమయంలో నిరుద్యోగులకు తీపికబురు అందించింది. యూనిఫామ్ సర్వీస్ మినహా ఉద్యోగ నియామక పరీక్షల వయో పరిమితిని మరో రెండేళ్లు పెంచుతూ నిర్ణయం తీసుకుంది.
1.హుక్కా సెంటర్లపై నిషేధం..
తెలంగాణలో హుక్కా సెంటర్లపై నిషేధం విధిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సర్కారు ప్రవేశపెట్టిన బిల్లుకు ఉభయ సభల్లో ఆమోదం లభించింది. ఫిబ్రవరి 4న జరిగిన కేబినెట్ భేటీలో ఈ నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం.. సోమవారం బిల్లును ప్రవేశపెట్టింది. ఉభయ సభల్లో మంత్రి శ్రీధర్‌బాబు ప్రవేశపెట్టిన బిల్లు.. ఎలాంటి చర్చ లేకుండా ఏకగ్రీవంగా ఆమోదం పొందింది. ఇక నుంచి రాష్ట్ర వ్యాప్తంగా హుక్కా సెంటర్లను మూసివేయడంతో పాటు ధూమపానం, పొగాకుకు సంబంధించిన ఎలాంటి ప్రకటనలు ఇవ్వకూడదు. ఇక హుక్కాకు సంబంధించిన ఉత్పత్తులను కొనడంగానీ, విక్రయించడం గానీ నేరం అవుతుంది.
హుక్కా సెంటర్ టు డ్రగ్స్…
హైదరాబాద్‌లోని పలు హుక్కా పార్లర్లలో పొగాతు ఉత్పత్తులతో పాటు గంజాయి, డ్రగ్స్ వంటి మత్తు పదార్థాల సరఫరా జరుగుతున్నట్లు పోలీసులు గుర్తించారు. దీనికితోడు డ్రగ్స్ కేసుల్లో పట్టుబడుతున్న యువకుల్లో ఎక్కువ మంది హుక్కా సెంటర్లకు వెళ్తున్నట్లు గుర్తించిన ప్రభుత్వం.. దీన్ని కట్టడి చేయాలని నిర్ణయం తీసుకుంది. ఒక్క హైదరాబాద్ నగరంలోనే దాదాపు 500 వరకు హుక్కా సెంటర్లు ఉంటాయని అంచనా వేస్తున్నారు. వీటితోపాటు కొన్ని పబ్బులు, రెస్టారెంట్లు, హోటల్స్‌లో కూడా హుక్కా వినియోగం నడుస్తోంది. ప్రభుత్వం తీసుకువచ్చిన తాజా బిల్లుతో వీటిన్నింటిని చెక్ పడనుంది.
2.గ్రూప్-1 నోటిఫికేషన్‌కు లైన్ క్లియర్
ఇక తెలంగాణలో గ్రూప్-1 నోటిఫికేషన్‌కు లైన్ క్లియర్ అయ్యింది. ఈ మేరకు గతంలో సుప్రీంకోర్టులో TSPSC వేసిన పిటిషన్‌ను ఉపసంహరించుకుంది. తెలంగాణలో ఇప్పటికి రెండుసార్లు గ్రూప్-1 పరీక్ష రద్దయ్యింది. రెండోసారి హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ గత ప్రభుత్వం ఆదేశాల మేరకు TSPSC సుప్రీంకోర్టుకు వెళ్లింది. అయితే.. కొత్త ప్రభుత్వం ఆదేశాల మేరకు TSPSC ఆ పిటిషన్‌ను ఉపసంహరించుకుంది.
మొత్తం 536 పోస్టులు భర్తీ..
గ్రూప్-1లో గతంలో ఖాళీగా ఉన్న 503 ఖాళీలకు అదనంగా మరో 60 పోస్టులు పెంచుతూ ఇటీవల కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో మొత్తం 563 పోస్టులను భర్తీ చేసేలా త్వరలోనే నోటిఫికేషన్ ఇచ్చేందుకు TSPSC సిద్ధమవుతోంది. పరీక్ష విధానం, సిలబస్‌లో కొన్ని మార్పులు చేసి ఉద్యోగ నియామకాలు చేపట్టే అవకాశమున్నట్లు తెలుస్తోంది.
3.ఉద్యోగాలకు వయో పరిమితి పెంపు..
ఇదిలా ఉంటే.. రాష్ట్రంలోని నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది ప్రభుత్వం. ఉద్యోగ నియామక పరీక్షల వయోపరిమితిని 44 ఏళ్ల నుంచి 46 ఏళ్లకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. యూనిఫామ్ సర్వీస్ మినహాయించి మిగతా ఉద్యోగాలకు వయో పరిమితిని సడలిస్తూ సోమవారం అధికారిక ప్రకటన విడుదల చేసింది ప్రభుత్వం.
తాజా వార్తలు
- తెలంగాణలో నేటి నుంచి ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక
- భారీ భూకంపంతో కాలిఫోర్నియాలో సునామీ హెచ్చరికలు
- చికాగోలో NATS ఆధ్వర్యంలో దీపావళి వేడుకలు
- అవిశ్వాస తీర్మానంలో ఓడిన ఫ్రాన్స్ ప్రధాని బార్నియర్
- అల్లు అర్జున్ పై కేసు నమోదు చేసి సమన్లు జారీ చేసిన పోలీసులు
- యూఏఈలో కార్ వాష్ రూల్స్: మురికి వాహనాలపై Dh3,000 వరకు ఫైన్..!!
- విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్
- చమురు ఉత్పత్తి కోతలను 3 నెలలు పొడిగించిన ఒపెక్ దేశాలు..!!
- 'దుక్మ్-1' రాకెట్‌ను విజయవంతంగా ప్రయోగించిన ఒమన్..!!
- బహ్రెయిన్ ఫెస్టివిటీస్ 2024..12 క్రూయిజ్ షిప్‌లకు స్వాగతం..!!