రాజకీయ కార్యశీలి-గడ్కరీ
- May 27, 2024
దేశ రవాణా ముఖ చిత్రాన్ని వేగంగా మార్చేసిన ఘనత ఆయన సొంతం. దేశ రాజకీయాలను ప్రభావితం చేసే ఆరెస్సెస్ సమాజానికి అత్యంత ఇష్టుడైన నాయకుడిగా సైతం ఆయనకు భారత రాజకీయ వర్గాల్లో పేరుంది. ఆయనే బీజేపీ సీనియర్ నాయకుడు, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ. నేడు నితిన్ గడ్కరీ జన్మదినం.
నితిన్ గడ్కరీ పూర్తి పేరు నితిన్ జైరామ్ గడ్కరీ. 1957, మే 27వ తేదీన మహారాష్ట్రలోని నాగ్‌పూర్ పట్టణంలో జైరామ్ గడ్కరీ, భానుతాయ్ దంపతులకు జన్మించారు. నాగ్‌పూర్ లోని G.S. కాలేజ్ ఆఫ్ కామర్స్ అండ్ ఎకనామిక్స్ లో బీ.కామ్, నాగ్‌పూర్ విశ్వవిద్యాలయం నుంచి ఎమ్.కామ్, ఎల్.ఎల్.బి పూర్తి చేశారు. గడ్కరీ తండ్రికి ఆరెస్సెస్ పెద్దలతో ఉన్న సన్నిహిత సంబంధాలు కారణంగా, చిన్నతనంలోనే ఆరెస్సెస్ సంఘంలో బాల స్వయంసేవక్ గా చేరి అంచెలంచెలుగా ఎదుగుతూ సంఘ్ ప్రచారక్ అయ్యారు. ఇదే సమయంలో ఆరెస్సెస్ పెద్దలకు అత్యంత సన్నిహితుడిగా మారారు.
కళాశాలలో చదువుతున్న రోజుల్లోనే ఆరెస్సెస్ అనుబంధ విద్యార్థి సంఘం అఖిల భారత విద్యార్ధి పరిషత్(ఏబీవీపీ) సంఘంలో క్రియాశీలకంగా వ్యవహరిస్తూ, 1975లో వచ్చిన ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా పోరాడి జైలుకు వెళ్లారు. 1977లో జనతా పార్టీ తరుపున ఎన్నికల ప్రచారంలో క్రియాశీలకంగా పాల్గొన్నారు. 1980లో భారతీయ జనతా పార్టీ(బీజేపీ) ఆవిర్భావంతో తర్వాత ఆ పార్టీ యువజన విభాగమైన భారతీయ జనతా యువజన మోర్చా(బీజేవైఎం)లో కార్యకర్తగా చేరి క్రమశిక్షణ, నిబద్దతతో నాయకుడిగా ఎదిగారు.
1980-1989 వరకు బీజేపీ పార్టీ బలోపేతం కోసం గడ్కరీ పనిచేశారు. 1989లో తొలిసారి పట్టభద్రుల ఎమ్మెల్సీ గా ఎన్నికైన గడ్కరీ, ఆతర్వాత 1990, 1996, 2002, 2008 లలో సైతం ఎమ్మెల్సీ గా ఎన్నికయ్యారు. 1995 ప్రాంతంలో మహారాష్ట్రలో ఏర్పడ్డ శివసేన- బీజేపీ కూటమి ప్రభుత్వంలో తొలుత రోడ్డు రవాణా కార్పొరేషన్ చైర్మన్ గా,1995-1999 వరకు ప్రజా పనుల శాఖ మంత్రిగా పనిచేశారు.
ప్రజా పనుల శాఖ మంత్రిగా ముంబై-పూణే ఎక్స్‌ప్రెస్ హైవే పూర్తి కావడంతో కీలకమైన పాత్ర పోషించారు. దేశంలోనే తొలిసారిగా పబ్లిక్- ప్రైవేట్ భాగస్వామ్యం (పీపీపీ)తో నిర్మించి అందరి ప్రశంసలు అందుకున్నారు. గడ్కరీ హయాంలోనే ముంబై నగరంలో ప్రజల సౌకర్యార్థం 55 ఫ్లై ఓవర్లను నిర్మించడం జరిగింది.
గడ్కరీ 1999-2005 వరకు మహారాష్ట్ర శాసనమండలిలో ప్రధాన ప్రతిపక్ష నేతగా కొనసాగారు. 2005-09 వరకు మహారాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా , రాజ్ నాథ్ సింగ్ తర్వాత 2009-13 వరకు బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా పనిచేశారు.
2014,2019 సార్వత్రిక ఎన్నికల్లో నాగ్‌పూర్ నుండి లోక్ సభకు అత్యధిక మెజారిటీతో ఎన్నికయ్యారు. 2014-2024 వరకు నరేంద్ర మోడీ మంత్రివర్గంలో రవాణా, నౌకాయానం, గ్రామీణాభివృద్ధి పంచాయతీ రాజ్, నీటిపారుదల, సూక్ష్మ, చిన్న మరియు మధ్యతరహా పరిశ్రమల శాఖల మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు.
దేశ రోడ్డు రవాణా వ్యవస్థ అభివృద్ధిలో గడ్కరీ పాత్ర చాలా కీలకమైనది. 1999లో అప్పటి ఎన్డీయే ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజపేయ్ మానసపుత్రిక గా వ్యవహరించే స్వర్ణ చతుర్భుజి ప్రాజెక్టును వాస్తవ రూపంలోకి తీసుకురావడంలో జాతీయ గ్రామీణ రోడ్డు అభివృద్ధి కమిటీ చైర్మన్ గడ్కరీ, అప్పటి కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్య నాయుడు లు కృషి చేశారు. ప్రధానమంత్రి గ్రామీణ్ సడక్ యోజన పథకం కింద దేశవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో యుద్ధ ప్రాతిపదికన నిర్మించేందుకు గడ్కరీ రూపొందించిన ప్రణాళికలను ఎన్టీయే మరియు యూపీఏ ప్రభుత్వాలు అమలు పరిచాయి.
నరేంద్ర మోడీ ప్రధాన మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత దేశ రవాణా వ్యవస్థను ఆధునీకరించే బాధ్యతను గడ్కరీకి అప్పగించారు. రవాణా వ్యవస్థపై మంచి పట్టున్న గడ్కరీని కేంద్ర రవాణా శాఖ మంత్రిగా నియమించుకున్నారు. మంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుండి దేశవ్యాప్తంగా హైవేలు, ఎక్స్‌ప్రెస్‌వేలు, భారీ ఫ్లై ఓవర్లు, దేశవ్యాప్తంగా ఉన్న గ్రామీణ ప్రాంతాల్లో సీసీ రోడ్లను యుద్ధ ప్రాతిపదికన నిర్మించి అంతర్జాతీయంగా ప్రశంసలు అందుకున్నారు. ప్రధాని మోడీ కలల ప్రాజెక్టు భారతమాలను చకచకా పరుగులు పెట్టిస్తున్నారు.
గడ్కరీ చేతల మనిషి కాదు గొప్ప కార్యశీలి, తనకు అప్పగించిన బాధ్యతకు నూటికి నూరు శాతం న్యాయం చేయడానికి వ్యయ ప్రయాసలను లెక్కచేయకుండా కష్టపడి పని చేస్తారు. సుదీర్ఘ రాజకీయ జీవితంలో పదవుల కోసం ఏనాడు పాకులాడలేదు. ఆయనకు స్వపక్షంలో కంటే విపక్ష పార్టీలోనే మంచి మిత్రులున్నారని రాజకీయ విశ్లేషకులు చెబుతారు.
--డి.వి.అరవింద్(మాగల్ఫ్ ప్రతినిధి)
తాజా వార్తలు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్ 14 వచ్చేసింది..!!
- వరల్డ్ టాప్ 10 సురక్షితమైన దేశాలలో ఒమన్..!!
- కువైట్ లో "దిస్ ఈస్ యువర్ రోల్" ప్రారంభం..!!
- బహ్రెయిన్, ఇండియా మధ్య లీగల్, ట్యాక్స్ సహకారం..!!
- ఒమన్‌తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..
- నటుడు రోబో శంకర్ మృతి..