రాజకీయ కలైంజ్ఞర్
- June 03, 2024
కరుణానిధి...భారత దేశ రాజకీయాల్లో ఈ పేరుకు ప్రత్యేకమైన స్థానం ఉంది. ద్రవిడ రాజకీయాలను అవపోసన పట్టి, తమిళనాడు రాజకీయాల్లో ప్రబల శక్తిగా ఎదిగారు. అధికారంలో ఉన్నా, లేకున్నా రాజకీయాలను శాసించారు. ద్రావిడ వాదమే తన సర్వస్వంగా జీవించి, తమిళనాడు ప్రజలకు ఆరాధ్యనేతగా మారారు ముత్తువేల్ కరుణానిధి.నేడు తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, కలైంజ్ఞర్ కరుణానిధి జయంతి.
ముత్తువేల్ కరుణానిధి 1924, జూన్ 3వ తేదీన అప్పటి మద్రాస్ ప్రెసిడెన్సీలోని తిరుక్కువలై (నాగపట్నం జిల్లా)లో తెలుగు మూలాలు ఉన్న నాయిబ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. ఆయన తల్లిదండ్రులు ముత్తువేలర్, అంజుగం. కరుణ అసలు పేరు దక్షిణామూర్తి. కరుణానిధి పూర్వీకులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రకాశం జిల్లా కేంద్రమైన ఒంగోలుకు ఆనుకుని ఉన్న చెర్వుకొమ్ముపాలెం గ్రామానికి చెందిన వారు. చదువుకునే రోజుల్లో డ్రామా, కవిత్వం, రచనపై ఆసక్తి కబరిచారు. జస్టిస్ పార్టీకి కీలక నేత అలగిరిస్వామి ప్రసంగాలతో ఉత్తేజితుడయ్యారు. 14వ ఏటనే సాంఘీక పోరాటలవైపు అడుగేశారు.
కరుణానిధి 1940వ దశకంలో తమిళనాడు వ్యాప్తంగా ‘హిందీ’ వ్యతిరేక ఉద్యమంలో, పాల్గొన్నారు. స్థానిక యువతలో స్ఫూర్తిని రగిల్చేందుకు సంస్థను స్థాపించిన కరుణానిధి.. ఆ సంస్థ సిబ్బంది కోసం చేతిరాతతో రూపొందించిన దినపత్రిక ‘మానవర్ నెసాన్’ నడిపారు. ‘తమిళ్ మానవర్ మాండ్రం’ అనే పేరుతో విద్యార్థి సంఘాన్ని స్థాపించారు. తదనంతర కాలంలో ఉధ్రుతంగా సాగిన ద్రవిడ ఉద్యమానికి ప్రేరణగా, ప్రతీకగా ‘తమిళ్ మానవర్ మాండ్రం’ పేరొందింది. తమిళ్ మానవర్ మాండ్రం సభ్యుల్లో స్ఫూర్తిని రగిలించడానికి, ఆవేశం పెంపొందించడానికి ప్రారంభించిన దినపత్రిక క్రమంగా ‘మురసొలి’గా.. ప్రస్తుతం తమిళనాడు ప్రతిపక్ష పార్టీ ద్రవిడ మున్నేట కజగం (డీఎంకే) అధికార దినపత్రికగా ఉంది.
ద్రావిడ ఉద్యమ పితామహుడు పెరియార్ రామస్వామి నాయకర్ ప్రతిపాదించిన ద్రవిడ సిద్ధాంతాల పట్ల ఆకర్షితులైన కరుణానిధి, ఆయన గురువు అన్నాదురైలు జస్టిస్ పార్టీకి రాజీనామా చేసి, పెరియార్ స్థాపించిన ద్రవిడ కళగం సంస్థలో చేరారు. అన్నాదురై నాయకత్వంలో తమిళనాడు వ్యాప్తంగా కుల నిర్మూలన ఉద్యమాన్ని ఉదృతంగా నిర్వహించారు. సంస్థను నడిపేందుకు కరుణానిధి నాటకాలు, సినిమాలకు కథలు, పాటలు రాస్తూ ఆర్థికంగా అండగా నిలిచారు.
పెరియార్ నియంతృత్వ పోకడలను వ్యతిరేకిస్తూ అన్నాదురైతో కలిసి 1949 సంవత్సరంలో ద్రవిడ మున్నేట్ర కళగం(డీఎంకే) పార్టీని స్థాపించారు. డీఎంకే ఆవిర్భావం తర్వాత కరుణానిధి పార్టీ విస్తరణ బాధ్యతలను చేపట్టి తమిళనాడు వ్యాప్తంగా పార్టీకి పటిష్టమైన పూనాదులు నిర్మించారు. అన్నాదురై మరో ముఖ్య శిష్యుడైన తమిళ సినీ అగ్రకథానాయకుడు ఎంజీఆర్ నటించిన సినిమాల ద్వారా ద్రావిడ సిద్ధాంతాలను ప్రజలకు చేరువ చేయడంలో కరుణానిధి కీలకమైన పాత్ర పోషించారు.
1957 సంవత్సరంలో మొదటి సారిగా కులిత్తరై నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన కరుణానిధి,1962లో తంజావూర్ నియోజవర్గం నుంచి గెలిచి రాష్ట్ర అసెంబ్లీలో డీఎంకే ఉప నేతగా పనిచేశారు. 1967లో డీఎంకే అధికారంలో వచ్చినప్పుడు అన్నాదురై మంత్రివర్గంలో కరుణానిధి ప్రజా పనుల శాఖ మంత్రిగా పనిచేశారు. 1969లో అన్నాదురై ఆకస్మిక మరణంతో తమిళనాడు ముఖ్యమంత్రిగా, డీఎంకే అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు.అప్పుడు ఆయన వయస్సు కేవలం 45 సంవత్సరాలు. 1971లో చెన్నైలోని సైదాపేట,1977,1980లో అన్నానగర్,1989,1991లో చెన్నై హార్బర్,1996, 2001, 2006లో చెపాక్, 2011లో తిరువారూర్, 2016లో చెపాక్ నియోజకవర్గాల్లో గెలుపొందారు. ఇలా మొత్తం 13 సార్లు తమిళనాడు అసెంబ్లీకి ఎన్నికయ్యి ఓటమి ఎరుగని నేతగా రికార్డు సృష్టించారు. ఇలా, భారతదేశ రాజకీయ చరిత్రలో అత్యధిక సార్లు ఎమ్యెల్యేగా ఎన్నికైన నేతగా కరుణానిధి నిలిచిపోయారు.
1969లో కరుణానిధి ముఖ్యమంత్రిగా ఎన్నికైన తర్వాత నుంచి సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి, తమిళనాడు ప్రజల్లో తిరుగులేని ప్రజా నేతగా ఎదిగారు. 1971లో డీఎంకే అధికారంలోకి వచ్చిన తర్వాత కరుణానిధి రెండో సారి సీఎంగా బాధ్యతలు చేపట్టారు. అయితే, పార్టీలో ఎంజీఆర్ ను అడుగడుగునా అవమానాలకు గురిచేయడంతో ఆత్మభిమానం గల ఎంజీఆర్ పార్టీకి రాజీనామా చేసి తన రాజకీయ గురువైన అన్నాదురై పేరుమీద అఖిల భారత అన్నా ద్రవిడ మున్నేట్ర కళగం(అన్నాడీఎంకే) పార్టీని 1972లో స్థాపించారు. కరుణానిధి అసమ్మతి నేతలు మొత్తం అన్నాడీఎంకేలో చేరారు.
కరుణానిధికి రాజకీయ గడ్డుకాలం ఎంజీఆర్ రూపంలో మొదలైంది. తమిళనాడులో అత్యధిక ప్రజాదరణ కలిగిన కథానాయకుడైన ఎంజీఆర్ స్థాపించిన అన్నాడీఎంకేను ప్రజలు ఆదరించడమే కాకుండా 1977,1980,1985 అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీకి పట్టం కట్టి వరుసగా ఎంజీఆర్ ను మూడు సార్లు సీఎం పీఠంలో కూర్చోబెట్టారు. 1987చివర్లో ఎంజీఆర్ మరణంతో కరుణానిధి రాజకీయంగా ఊపిరి పీల్చుకున్నారు. 1989ఎన్నికల్లో మూడోసారి ముఖ్యమంత్రిగా కరుణానిధి ఎన్నికయ్యారు. అయితే, శాసనసభ సమావేశంలో ప్రతిపక్ష నాయకురాలు జయలలితపై డీఎంకే ఎమ్యెల్యేలు భౌతిక దాడి చేయడంతో కరుణానిధి ప్రభ మహిళల్లో మసకబారింది.
1991లో కరుణానిధి ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వం రద్దు చేయడంతో వచ్చిన 1991 అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకే విజయం సాధించి జయలలిత సీఎం అయ్యారు. జయలలిత హయాంలో డీఎంకే పార్టీ నేతలపై జరిగిన అరెస్టులు, ఆదాయ పన్ను శాఖ దాడులు కరుణానిధిని వుక్కిరిబిక్కరి చేశాయి. 1996 వరకు కరుణానిధి రాజకీయ జీవితంలో చీకటి రోజులుగా మిగిలాయి. 1996లో నాలుగో సారి ముఖ్యమంత్రిగా ఎన్నికైన కరుణానిధి సైతం కక్షపూరిత రాజకీయాలకు పాల్పడ్డారు. 2001లో అధికారం కోల్పోయిన తర్వాత జయలలిత హయాంలో కరుణానిధిని అవమానకర రీతిలో అర్థరాత్రి అరెస్ట్ చేయించింది. 2006లో ఐదో సారి ముఖ్యమంత్రిగా కరుణానిధి ఎన్నికయ్యారు.
కరుణానిధి తమిళనాడు రాజకీయాల్లో బిజీగా ఉన్నప్పటికీ జాతీయ స్థాయి రాజకీయాల్లో ముఖ్య భూమిక పోషించారు. 1977లో జనతా ప్రభుత్వం ఏర్పాటులో, 1989లో నేషనల్ ఫ్రంట్ ప్రభుత్వం ఏర్పాటులో, 1996లో యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వం ఏర్పాటులో కీలకమైన పాత్ర పోషించారు. తమ రాజకీయ భావజాలానికి వ్యతిరేకమైన బిజెపితో సైతం చేతులు కలిపి 1999లో ఎన్డీయే కూటమి ప్రభుత్వం ఏర్పాటుకు కీలకంగా వ్యవహరించారు. జాతీయ రాజకీయాల్లో తన అల్లుడైన మురుసోలీ మారన్ ద్వారా తమ మద్దతుతో ఎన్నికైన కేంద్ర ప్రభుత్వాల మీద ఒత్తిడి తెచ్చి తమిళనాడు రాష్ట్ర ప్రయోజనాలను సాధించడంలో సఫలీకృతం అయ్యారు.
తమిళనాడు రాజకీయాల్లో కరుణానిధి ఒక ఉన్నత శిఖరమే కాదు... ఓ గొప్ప రచయిత కూడా. రాజకీయాల్లోకి రాకముందు తలైవా సినిమారంగంలో పనిచేశారు. అక్కడ ఎన్నోసినిమాలకు కథను అందించాడు. తమిళ సాహిత్యానికి కూడా కరుణానిధి యనలేని సేవలందించారు. కరుణ కలం నుంచి ఎన్నో కథలు, నవలలు, సినిమా కథలు, సంభాషణలు, నాటకాలు, పద్యాలు, పాటలు జాలువారాయి. ఇవన్నీ ఇప్పుడు కరుణానిధి జ్ఞాపకాలుగా మిగిలిపోనున్నాయి. తమిళ భాషపై అత్యున్నత పట్టున్న నేతగా కరుణానిధికి మంచి పేరుంది.
తమిళంలో కలైంజ్ఞర్ అంటే "వివిధ కళలపై పట్టున్న బహుముఖ మేధావి అని అర్థం. ఇది కరుణానిధికే తమిళ ప్రజలు పేటెంట్ హక్కులా ఎందుకు ఇచ్చారంటే.. తమిళ భాషలో ఆయన మేధావి, పదాలతో మాయచేయగల సత్తా ఉన్నవాడు. తమిళ సాహిత్యానికి కరుణానిధి అశేష సేవలందించారు. "కురులోవియం,తోల్కప్పియా పూంగా, పూంబుకర్‌తో పాటు ఎన్నో పద్యాలు, వ్యాసాలు, నవలలు రాశారు. ఇక పుస్తకాల విషయానికొస్తే సంగ తమిళ్, తిరుక్కురల్ ఉరై, పొన్నార్ శంకర్, రొమపూరి పాండియన్, తెన్‌పాండి సింగం, వెలికిలమై, నేన్‌జుక్కు నీది, ఇనియావై ఇరుబతు లాంటివి రాశారు. తను 100కు పైగా పద్యగద్య రూపంలో పుస్తకాలు రాశారు.
కరుణానిధి గొప్ప పరిపాలనా దక్షుడు. ఐదు సార్లు ముఖ్యమంత్రిగా తమిళనాడును పాలించిన ఆయన పాలనలో అనేక సంస్కరణలు, అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టారు. తమిళనాడు నాట విద్య, ఉద్యోగాల్లో 30 శాతం మహిళలకు రిజర్వేషన్, పేదరిక నిర్మూలన, తాగునీటి పథకాలు ప్రవేశపెట్టిన ఘనత కరుణకు మాత్రమే స్వంతమని డీఎంకే కార్యకర్తలు అంటారు. రుణమాఫీ, పౌష్టికాహార పథకం, చేనేతకు ఉచిత విద్యుత్ వంటి ఎన్నో పథకాలకు శ్రీకారం చుట్టారు.
కరుణానిధి వ్యకిగత జీవితానికి వస్తే, ఆయనకు ముగ్గురు భార్యలు. మొదటి భార్య పద్మావతి, రెండో భార్య దయాళు అమ్మాల్, చనిపోయే నాటికి మూడో భార్య రాజాత్తి అమ్మాల్‌తో నివసించేవారు. కరుణ మొదటి భార్య పద్మావతి, తమ కొడుకైన ఎంకే ముత్తు చిన్నతనంలోనే యుక్తవయస్సులోనే కన్నుమూశారు. అలగిరి, స్టాలిన్, సెల్వీ, తమిళరుసు దయాళు అమ్మల్‌కు జన్మించారు. కనిమొళి రాజాత్తి అమ్మల్‌కు జన్మించారు. కరుణానిధి చిన్నకుమారుడైన స్టాలిన్ ప్రస్తుతం డీఎంకే పార్టీ అధ్యక్షుడిగా, తమిళనాడు ముఖ్యమంత్రిగా ఉన్నారు.
తమిళ రాజకీయాల్లో శక్తిమంతమైన నేతగా కరుణానిధికి సాటిలేరు. దాదాపు 7 దశాబ్దాల రాజకీయ జీవితంలో తాను నమ్మిన ద్రవిడ సిద్ధాంత భావజాలం పట్ల కరుణానిధి అచంచలమైన విశ్వాసాన్ని కలిగి ఉండేవారు. ఆ భావజాలానికి ప్రతినిధిగా ఉన్న ఆయన్ని తమిళనాడు ప్రజలు తమ వాడిగా అక్కున చేర్చుకున్నారు.
--డి.వి.అరవింద్(మాగల్ఫ్ ప్రతినిధి)
తాజా వార్తలు
- రేపు కూటమి సర్కార్ తొలి వార్షికోత్సవ సభ
- ఒమాన్‌లో 2028 నుండి 5% వ్యక్తిగత ఆదాయ పన్ను
- ముంబై విమానాశ్రయంలో భారీగా బంగారం సీజ్..
- రాజకీయ ప్రవేశం పై ఊహాగానాలకు తెరదించిన సౌరవ్ గంగూలీ
- ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం: స్థిరంగా యూఏఈ ఎయిర్ ట్రాఫిక్..సౌదీలో రెట్టింపు..!!
- సంక్షోభంలో మానవత్వం..ఇరాన్‌పై అమెరికా దాడిని ఖండించిన ప్రపంచ దేశాలు..!!
- ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధంలోకి అమెరికా ఎంట్రీ.. 3 అణు కేంద్రాలపై దాడులు..!!
- విలాయత్ బర్కాలో అగ్నిప్రమాదం..సీడీఏఏ
- ప్రపంచవ్యాప్తంగా పాస్వర్డ్లు హ్యాక్.. ఐటీ భద్రతను పెంచాలన్న కంపెనీలు..!!
- ఇరాన్‌పై ఇజ్రాయెల్ ది దురాక్రమణ..సౌదీ అరేబియా