ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదాతో వచ్చే ప్రయోజనాలు

- June 08, 2024 , by Maagulf
ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదాతో వచ్చే ప్రయోజనాలు

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్డీయే కూటమి ప్రభుత్వం కొలువుదీరనున్న నేపథ్యంలో ఫ్రత్యేక హోదా అంశం మరోసారి చర్చల్లోకి వస్తోంది. ఈ ‘ముగిసిన అధ్యాయం’ తిరిగి తెరుచుకుంటుందా? అనే చర్చ మొదలైంది.విభ‌జ‌నతో ఆర్థికంగా కుదేలయిన ఆంధ్ర ప్రదేశ్ అభివృద్ధి చెందాలంటే అది ఒక్క ప్రత్యేక హోదాతోనే  సాధ్యమవుతుంది. అభివృద్ధి అంతా హైదరాబాదులోనే కేంద్రీకృతమై ఉండడం వల్ల ఏపీకి తీరని నష్టం చేకూరింది. కష్టాల కడలి నుంచి గట్టెక్కాలంటే రాష్ట్రానికి ప్రాణవాయువైన ప్రత్యేకహోదాను సాధించుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఉద్యోగాలైనా, పరిశ్రమలైనా, పన్నురాయితీలైనా ఇలా ఏదైనా ప్రత్యేక హోదా తోనే సాధించగలం.

విభ‌జ‌న స‌మ‌యంలో అప్ప‌టి ప్ర‌ధాని (మన్మోహన్ సింగ్) పార్ల‌మెంటు సాక్షిగా ఏపీకి ఐదేళ్లు ప్ర‌త్యేక హోదా ఇస్తామ‌ని ప్ర‌కటించారు. దీన్ని సమర్థించిన నాటి ప్రతిపక్షమైన బీజేపీ హోదా ఐదేళ్ళు కాదు పదేళ్లు ఇవ్వాలని పట్టుబట్టింది. ఆ విధంగా కాంగ్రెస్, బీజేపీలు రెండూ కలిసి రాష్ట్రాన్ని విభజించాయి. ఆంధ్రప్రదేశ్ విభజన కారణంగా హైదరాబాద్ తెలంగాణకు రాగా.. ఏపీకి రాజధాని లేకుండా పోయింది. తెలంగాణ మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రం కావడంతో అప్పటి యూపీఏ ప్రభుత్వం విభజన సమయంలో ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని ప్రకటించింది.

పార్లమెంట్ సాక్షిగా ప్రధాని చేసిన ప్రకటన కాబట్టి ఆ హామీ నెరవేరుతుందని అవశేష ఆంధ్రప్రదేశ్ ప్రజలంతా భావించారు. కానీ ప్రజలు ఒకటి తలిస్తే, ప్రభుత్వాలు మరొకటి తలిచాయి. అధికారంలోకి వచ్చిన తరువాత కేంద్రంలోని బీజేపీ స్వరం మారింది. ప్రత్యేక హోదా కాస్తా ప్రత్యేక ప్యాకేజీగా మారింది. ఏపీకి ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామని 2016 సెప్టెంబర్ 7న అప్పటి కేంద్రమంత్రి అరుణ్ జైట్లీ ప్రకటించారు.

విభజన చట్టం, 14వ ఆర్థిక సంఘం సిఫార్సులు, నీతి ఆయోగ్ సిఫార్సుల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నామని జైట్లీ వివరించారు.ప్రత్యేక హోదాకు సమానంగానే రాష్ట్రానికి 5 సంవత్సరాలపాటు ఆర్థిక సాయం ఉంటుందని జైట్లీ చెప్పారు.రాష్ట్రానికి ప్రత్యేక హోదాకు బదులు ప్రత్యేక ప్యాకేజీకి అప్పటి ముఖ్యమంత్రి అయిన నారా చంద్రబాబు నాయుడు అంగీకరించారు. ప్యాకేజీని నిరాకరిస్తే నష్టపోతామని చంద్రబాబు పేర్కొన్నారు. అయితే, ప్రత్యేక ప్యాకేజీని స్వాగతించడానికి చంద్రబాబు ఎవరంటూ అప్పటి ప్రతిపక్ష వైసీపీ తీవ్రంగా ప్రశ్నించింది.

ఈ నేపథ్యంలో తాము అధికారంలోకి వస్తే ప్రత్యేక హోదా సాధిస్తామంటూ జగన్మోహన్ రెడ్డి 2019 ఎన్నికల ముందు భారీగా ప్రచారం చేశారు. కానీ అధికారంలోకి వచ్చాక ఆయన కూడా మడమ తిప్పారనే విమర్శలు ఉన్నాయి.‘‘ఎన్డీయేకు 250 సీట్లు మించకూడదు అని దేవుడిని కోరుకున్నాను. కానీ మన ఖర్మ కొద్దీ వాళ్లుకు పూర్తి మెజారిటీ వచ్చింది. ఇప్పుడు మన సహాయం వాళ్లకు అవసరం లేదు. కానీ ముందుముందు ప్రధానిని కలిసిన ప్రతిసారీ ప్రత్యేక హోదా అడుగుతూనే ఉంటాను’’ అని జగన్ అప్పుడు చెప్పారు.

తమ అవసరం కేంద్రానికి లేకపోయినా ‘ప్రత్యేక హోదా, విశాఖ రైల్వేజోన్, పోలవరం’ గురించి అడుగుతూనే ఉంటామన్నారు. అయితే, జగన్మోహన్ రెడ్డి తన ఐదేళ్ళ పాలనా కాలంలో ఎప్పుడు దిల్లీకి వెళ్లినా ప్రధానికి తాను అడుగుతూనే ఉంటానని చెప్పిన విషయాలపై వినతి పత్రం ఇవ్వడానికి మాత్రమే పరిమితమయ్యారనే విమర్శలు బలపడ్డాయి.

కేంద్రంలో 10 ఏళ్లుగా అధికారంలో ఉన్న నరేంద్ర మోదీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇచ్చేది లేదని దాదాపుగా తేల్చేసింది. అయితే అప్పుడు సొంతంగా బీజేపీకి మెజార్టీ ఉండటంతో ఏది చెప్పినా చెల్లింది. కానీ ఇప్పుడు ఎన్డీఏ కూటమిలో టీడీపీ కీలక పాత్ర పోషించే అవకాశాలు ఉన్నాయి. దీంతో ఇప్పుడు ఏపీకి ప్రత్యేక హోదా సాధించే అవకాశం చంద్రబాబు నాయుడుకు దక్కింది.

ప్రస్తుతం కేంద్రంలో బీజేపీ అధికారాన్ని ఏర్పాటు చేయాలన్నా.. నరేంద్ర మోదీ.. మరోసారి ప్రధానమంత్రి కావాలన్నా.. చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని టీడీపీ ఎంపీలే కీలకం కానున్నారు. అయితే ఇప్పుడు మోదీకి సపోర్ట్ చేయాలంటే.. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలనే డిమాండ్‌ను కేంద్రం ముందు ఉంచే అవకాశాలు ఉన్నాయి.

ప్రత్యేక హోదాతో వచ్చే ప్రయోజనాలు:

1. ప్రత్యేక హోదా కల్పించిన రాష్ట్రానికి కేంద్రం మెరుగైన సదుపాయాలు అందించేందుకు గ్రాంట్ల రూపంలో ఆర్థికసాయాన్ని అందిస్తుంది.

2. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు ఇస్తున్న నిధుల్లో 30 శాతం నిధులను మొదట ప్రత్యేక హోదా కలిగిన రాష్ట్రాలకే పంచుతారు. ఆ తర్వాతే మిగిలిన 70 శాతం నిధులను ఇతర రాష్ట్రాలకు అందిస్తారు.

3. కేంద్ర ప్రభుత్వ పథకాల్లో 90 శాతం నిధులను గ్రాంట్లుగా, 10 శాతం నిధులను ప్రత్యేక హోదా కలిగిన రాష్ట్రాలకు రుణంగా ఇస్తారు. గ్రాంట్లుగా ఇచ్చిన నిధులను తిరిగి చెల్లించాల్సిన అవసరం ఉండదు. కానీ అప్పుగా ఇచ్చిన నిధుల‌ను మాత్రం తిరిగి కట్టాల్సి ఉంటుంది.

4. ప్రత్యేక హోదా ఉన్న రాష్ట్రాల్లో పరిశ్రమలు పెట్టే వారికి భారీగా రాయితీలిస్తారు. ప్రోత్సాహకాలు అందిస్తారు. రుణాల చెల్లింపును వాయిదా వేయడం లేదా పునరుద్ధరించడం కూడా చేస్తారు. ఆదాయ‌పు ప‌న్నుల నుంచి పరిశ్రమలకు మిన‌హాయింపు ల‌భిస్తుంది. ఇలాంటి ఉపయోగాలు ఉంటే.. ఆ రాష్ట్రంలో పరిశ్రమలు పెట్టేందుకు వ్యాపారవేత్తలు ఎగబడతారు. ఇలాంటి వాటి వల్ల రాష్ట్రాల్లో వ‌స్తువుల ధ‌ర‌లు కూడా త‌గ్గుతాయి.

పార్లమెంట్‌లో నాటి ప్రధాని ఇచ్చిన ప్రత్యేక హోదా సాధనకైనా రాష్ట్రానికి రావాల్సిన ఇతర ప్రయోజనాలను సాధించుకోవడానికైనా ఇంతకంటే మంచి అవకాశం ఉంటుందా అనే మాట ముందుకొస్తుంది. అదే సమయంలో అదంత సులభమైన వ్యవహారం అని కూడా చెప్పే స్థితిలేదు. 

--డి.వి.అరవింద్(మాగల్ఫ్ ప్రతినిధి) 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com