లిటిల్ మాస్టర్...!

- July 10, 2024 , by Maagulf
లిటిల్ మాస్టర్...!

భార‌త క్రికెట్ జ‌ట్టు మొట్టమొద‌టి సూప‌ర్‌స్టార్‌. స్టార్ క్రికెట‌ర్‌గా హోదా పొందిన తొలి ఆట‌గాడు సునీల్ గ‌వాస్క‌ర్. తన అద్భుత ఆటతీరుతో ఎంతో అభిమానులతో పాటు ఎన్నో రికార్డులను సొంతం చేసుకున్నాడు. భారత దేశ క్రికెటర్లలో వివాదాస్పద ఆటగాడిగా పేరు తెచ్చుకున్న అతికొద్ది మంది ఆటగాళ్లలో గవాస్కర్ ముందువరుసలో ఉంటాడు. నేడు లిటిల్ మాస్టర్ గవాస్కర్ జన్మదినం.

సునీల్ మ‌నోహ‌ర్ గ‌వాస్క‌ర్‌ 1949 జులై 10వ తేదీన ముంబైలో జన్మించారు. ముంబై తరుపున రంజీ ట్రోఫీలో అద్భుతమైన ఆట తీరును ప్రదర్శించి ఇండియన్ టీంలోకి అడుగుపెట్టాడు. సాంప్రదాయ టెస్ట్ క్రికెట్ తొలి సూపర్ ఓపెనర్ గా ఇండియా విజయాల్లో కీలకమైన పాత్ర పోషించాడు. 1971- 1987 వరకు ఇండియన్ టీం వెన్నెముకగా గవాస్కర్ నిలిచారు.

టెస్టు క్రికెట్ చరిత్రలోనే అరంగేట్రం సిరీస్ లోనే 774 పరుగులు సాధించడం ద్వారా గవాస్కర్ ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. కరీబియన్ ఫాస్ట్ , బౌన్సీ పిచ్ లపైన..అరివీరభయంకర వెస్టిండీస్ ఫాస్ట్ బౌలర్లను సునాయాసంగా ఎదుర్కొని గవాస్కర్ పరుగుల మోత మోగించాడు. మొత్తం ఎనిమిది ఇన్నింగ్స్ లో 4 సెంచరీలు, ఓ డబుల్ సెంచరీతో సహా 774 పరుగులు సాధించాడు. ఓ భారత ఓపెనర్ తన అరంగేట్రం టెస్టు సిరీస్ లోనే ఈ ఘనత సాధించిన భారత తొలి బ్యాటర్ గా రికార్డుల్లో చేరాడు.

భారత క్రికెట్ చరిత్రలో ఎందరు లిటిల్ మాస్టర్లున్నా..తొలి లిటిల్ మాస్టర్ ఘనత సునీల్ గవాస్కర్ కు మాత్రమే దక్కుతుంది. సునీల్ గవాస్కర్ బావ గుండప్ప విశ్వనాథ్ కు సైతం లిటిల్ మాస్టర్ గా పేరుంది. 1970 దశకంలో టెస్టు క్రికెట్లో భారత సూపర్ జోడీగా గవాస్కర్- విశ్వనాథ్ తమ ఆటతీరుతో అభిమానులను ఉర్రూతలూగించారు. 1971లో భారతజట్టులో లిటిల్ ఓపెనర్ గా అడుగుపెట్టిన గవాస్కర్ ఆ తర్వాత 16 సంవత్సరాలరాలపాటు ఓ వెలుగు వెలిగారు.

టెస్టు క్రికెట్లో ఓపెనర్ స్థానం కోసమే పుట్టిన గవాస్కర్ కు తొలిరోజుల్లో హెల్మెట్ లేకుండానే ప్రపంచ మేటి ఫాస్ట్ బౌలర్లను అలవోకగా ఎదుర్కొన్న ఘనత ఉంది. తన కెరియర్ లో 125 టెస్టులు ఆడి 10వేల 122 పరుగులు సాధించారు.అత్య‌ధిక స్కోరు 236. బ్యాటింగ్ స‌గ‌టు 51.1. 45 అర్ధ‌సెంచ‌రీలను చేశారు. 14 దశాబ్దాల టెస్టు క్రికెట్ చరిత్రలో మొట్ట మొద‌టిసారిగా 10 వేల ప‌రుగుల ల్యాండ్‌మార్క్‌ను అందుకున్న క్రికెట‌ర్‌గా రికార్డుల‌ను నెల‌కొల్పాడు. సాంప్ర‌దాయ‌క క్రికెట్‌లో 10 వేల ప‌రుగుల‌ను అందుకోవ‌డ‌మనేది మామూలు విష‌యం కాదు. ఆధునిక క్రికెట్‌లో ఈ మైలురాయిని అందుకోవ‌డం మంచినీళ్ల ప్రాయ‌మే అయిన‌ప్ప‌టికీ, దానికి బాట‌లు వేసింది మాత్ర‌మే గ‌వాస్క‌రే.

1982 వరకూ ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజం సర్ డాన్ బ్రాడ్మన్ పేరుతో ఉన్న అత్యధిక టెస్టు శతకాల రికార్డును 1983లో గవాస్కర్ అధిగమిస్తే.. గవాస్కర్ పేరుతో ఉన్న 34 శతకాల రికార్డును బ‌ద్ద‌లు కొట్ట‌డానికి రెండు ద‌శాబ్దాలు పట్టింది. 2005లో మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండుల్కర్ ఈ రికార్డును తెరమరుగు చేశాడు.

1983 ప్ర‌పంచ‌క‌ప్‌ను సాధించిన భార‌త క్రికెట్ జ‌ట్టులో భాగ‌స్వామి గ‌వాస్క‌ర్‌. గ‌వాస్క‌ర్ వ‌న్డే కేరీర్‌లో ఒకే ఒక్క సెంచ‌రీ న‌మోదైంది. ఆయ‌న అత్య‌ధిక స్కోరు 103. 108 మ్యాచ్‌ల్లో 102 ఇన్నింగుల‌ను ఆడిన ఆయ‌న 3092 ప‌రుగులు చేశారు. ఇందులో 27 అర్ధ‌సెంచ‌రీలు ఉన్నాయి. త‌న ఏకైక వ‌న్డే సెంచ‌రీని ఆయ‌న ఇంగ్లండ్‌పై సాధించారు. 1987లో అంత‌ర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు ప‌లికిన సునీల్ గ‌వాస్క‌ర్ ప్ర‌స్తుతం కామెంట‌ర్‌గా త‌న రెండో ఇన్నింగ్‌ను కొన‌సాగిస్తున్నారు.

క్రికెట్‌ను దేశవ్యాప్తంగా ప్రాచుర్యంలోకి తీసుకురావడంలో భారత మాజీ కెప్టెన్ గవాస్కర్ తనదైన కృషి చేశాడు. భారత క్రికెట్ కు చిరస్మరణీయమైన సేవలు అందించిన సునీల్ గవాస్కర్ ను భారత ప్రభుత్వం పద్మశ్రీ, పద్మభూషణ్ పురస్కారాలతో గౌరవించింది. అతను క్రికెట్ మైదానాన్ని విడిచిపెట్టి 3 దశాబ్దాలకు పైగా గడిచినా ఇప్పటికి అతన్ని అభిమానించే అభిమానుల సంఖ్య మాత్రం తరగలేదు.  

--డి.వి.అరవింద్(మాగల్ఫ్ ప్రతినిధి)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com