భారత పారిశ్రామిక దిగ్గజం-జె.ఆర్.డి.టాటా
- July 29, 2024
"నాకు ఎక్సలెంట్ మనుషులు వద్దు పర్ఫెక్ట్గా పనిచేసే మనుషులు కావాలి" అన్నది పారిశ్రామిక వేత్త జె.ఆర్.డి.టాటా ఉవాచ. ఈ ఒక్క సంఘటన చాలు ఆయనకు తన పనిని ఎంత ప్రేమిస్తారో తెలియజెప్పడానికి. భారతదేశ పరిశ్రమల రంగానికి మకుటంగా నిలుస్తున్న టాటా సంస్థలకు అధినేతగా, దేశ సామాజిక, ఆర్థిక రంగాల అభివృద్ధికి దోహదపడ్డారు. నేడు భారతదేశ పారిశ్రామిక దిగ్గజం, భారత రత్న, స్వర్గీయ జె.ఆర్.డి.టాటా జయంతి.
జహంగీర్ రతన్‌జీ దాదాభాయి టాటా అలియాస్ జె.ఆర్.డి.టాటా 1904, జూలై 29 ఫ్రాన్స్ దేశ రాజధాని ప్యారిస్‌లో భారతీయ పార్సీ కుటుంబానికి చెందిన రతన్‌జీ దాదాభాయి టాటా(ఆర్.డి.టాటా), ఫ్రెంచ్ దేశస్తురాలైన సుజానె బ్రెయిర్ దంపతులకు రెండో బిడ్డగా జన్మించారు. తండ్రి భారతదేశపు తొలి పారిశ్రామికవేత్త అయిన టాటా సంస్థల వ్యవస్థాపకుడు జెంషెట్‌జీ టాటాకు దాయాది సోదరుడు. టాటాకు పెద్దక్క సిల్లా పేటిట్, చెల్లెలు రోదబ్ మెహతా మరియు ఇద్దరు తమ్ముళ్లు దరాబ్ టాటా, జెంషెడ్ టాటా అలియాస్ జిమ్మీ టాటాలు ఉన్నారు. వీరిలో జిమ్మీ టాటా విమాన ప్రమాదంలో చిన్న వయస్సులోనే మరణించాడు.
తండ్రి టాటా సంస్థల తరుపున యూరోప్ దేశాల్లో వ్యాపారాలు నిర్వహిస్తూ వివిధ దేశాలల్లో పర్యటిస్తూ బిజీగా గడపడం వల్ల తల్లితో పాటుగా ప్యారిస్‌లోనే టాటా తన బాల్యాన్ని గడిపారు. తల్లి ఆకస్మిక మరణం తరువాత తండ్రితో పాటుగా భారతదేశానికి వచ్చేశారు. అయితే, టాటా ప్రాథమిక విద్యాభ్యాసం మొత్తం ప్యారిస్‌లోనే జరిగింది. అక్కడే పైలెట్ గా శిక్షణ పొందారు. యువకుడిగా ప్రాన్స్ దేశ ఆర్మీ తరుపున ఆఫ్రికా ఖండంలోని అల్జీరియా దేశంలో టాటా పనిచేశారు.
టాటా కాలేజీ విద్యను అభ్యసించే సమయంలో తండ్రికి వ్యాపారాల్లో తోడుగా ఉండేందుకు చదువు మధ్యలోనే ఆపేసి టాటా సంస్థలో చేరారు. జెంషెడ్ పూర్ టాటా స్టీల్ కంపెనీలో అప్రెంటిస్ గా జీవితాన్ని మొదలు పెట్టిన టాటా కొద్దీ కాలంలోనే వ్యాపారాన్ని ఆపోసన పట్టారు. 1926లో తండ్రి ఆర్.డి.టాటా ఆకస్మిక మరణం జె.ఆర్.డి జీవితంలో తీరని విషాదం. తండ్రి మరణం తర్వాత టాటా సంస్థల ప్రధాన సంస్థ టాటా సన్స్ డైరెక్టర్ గా నియమితులయ్యారు.1929లో భారతదేశంలోనే మొట్టమొదట విమాన పైలట్ లైసెన్సు పొందిన వ్యక్తిగా ఆయన చరిత్ర సృష్టించారు.
టాటా సన్స్ డైరెక్టర్ గా ఉంటూనే భారతదేశంలో మొట్టమొదటి వాణిజ్య విమానయాన సంస్ధ టాటా ఎయిర్ లైన్స్( ఎయిర్ ఇండియా)ను 1932లో టాటా ప్రారంభించారు. ఈ సంస్థ దేశానికి స్వాతంత్రం వచ్చే వరకు విజయవంతంగా కొనసాగింది. తర్వాతి కాలంలో ఆయన "భారత పౌర విమానయాన పితమహుడి" (Father Indian Civil Aviation )గా గుర్తింపు పొందాడు. స్వాతంత్రం వచ్చిన తర్వాత ప్రధాని నెహ్రూ తన స్వార్థ రాజకీయ ప్రయోజనాలు కోసం సోషలిజం పేరుతో వీరి సంస్థను బలంవంతంగా ప్రభుత్వ పరంగా చేసి టాటాను మానసికంగా దెబ్బతీసిన విషయంలో దేశ చరిత్రలో విషాద ఘట్టం. వ్యాపార వర్గాల నుంచి ఒత్తిడి మూలాన నెహ్రూ ఆ సంస్థకు నామినల్ అథారిటీ చైర్మన్ గా నియమించి చేతులు దులుపుకున్నారు.
టాటా ఎయిర్ లైన్స్ విజయవంతం కావడంతో టాటా సన్స్ ఛైర్మన్ ఆదేశాల మేరకు పలు నూతన రంగాల్లో కంపెనీలను టాటా ప్రారంభించారు. 1938లో టాటా సన్స్‌కి చైర్మన్ అయిన సర్ నౌరోజి సక్లత్ వాలా చనిపోగానే 34 ఏళ్ల వయస్సున్న జె.ఆర్.డి దేశంలోనే అతిపెద్ద పారిశ్రామిక సామ్రాజ్యామైన టాటా సంస్థకు అధిపతి అయ్యారు. తన హయాంలో ఇంజినీరింగ్ , ఎల్లక్ట్రికల్స్, ఐటి , గడియారాల తయారీ, కెమికల్స్ మరియు పలు రంగాల్లో పరిశ్రమలు టాటా హయాంలోనే మొదలైయ్యాయి. జె.ఆర్.డి ఛైర్మన్ గా ఉన్న సమయంలోనే టాటా గ్రూప్ కంపెనీలు 15 నుండి 100 కు చేరాయి.
ఎటువంటి మేనేజ్మెంట్ డిగ్రీలు లేకున్నా, 42 ఏళ్ళ పాటు టాటా సంస్థను అత్యుత్తమ ప్రమాణాలతో కూడిన పారిశ్రామిక సంస్థగా నిలబెట్టారు. ఎవరు ఏ రంగంలో నిపుణులో వారికి ఆ బాధ్యతలు అప్పగించి సంస్థ అభివృద్ధి కోసం స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునే వాతావరణం కల్పించడమే తన విజయ రహస్యం అని జె.ఆర్.డి పలు మార్లు పేర్కొన్నారు.
జె.ఆర్.డి విలువలతో కూడిన వ్యక్తి. తమ వ్యాపార విస్తరణ, లాభాల కోసం తప్పుడు మార్గాలు తొక్కకూడదు అన్న సూత్రాన్ని తూచా తప్పకుండా ఆచరించి టాటా సంస్థలకు అన్వయించిన ఉదాత్తుడు. యూనివర్సిటీ విద్యలు లేకున్నా తన వ్యక్తిత్వం, వయస్సుతో పాటు వచ్చి అనుభవంతో పారిశ్రామిక రంగంలో ఎదురులేని మనిషిగా నిలిచారు.
జె.ఆర్.డి టాటా గొప్ప వితరణశీలి, జాతికి సేవందించడంలో ఆయన ఎప్పుడూ విఫలం కాలేదు. 1941లో బొంబాయి (నేడు ముంబై) నగరంలో టాటా మెమోరియల్ క్యాన్సర్ హాస్పిటల్ ప్రారంభించారు. ఆసియాలోనే ఇది మొట్ట మొదటి కేన్సర్ ఆసుపత్రిగా రికార్డులకెక్కింది. అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన నాణ్యమైన వైద్యాన్ని తక్కువ ఖర్చుకే రోగులకు అందిస్తున్నారు. నిరుపేదలకు వారి స్థాయిని బట్టి ఉచితంగా లేదా టాటా ఫౌండేషన్ ద్వారా చికిత్స చేస్తున్నారు. కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద తమ సంస్థలను నెలకొల్పిన ప్రాంతాలను దత్తత తీసుకోని అక్కడి ప్రజలకు విద్య, వైద్యం మరియు ప్రాథమిక మౌలిక సదుపాయాలను ఏర్పర్చడం వీరి హయాంలోనే టాటా సంస్థల్లో మొదలైంది.
టాటాలకు సైన్స్ రంగానికి విడదీయరాని అనుబంధం ఉంది. దేశంలోనే మొట్ట మొదటి ఆధునిక సైన్స్ పరిశోధనా సంస్థ "ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్" ను బెంగుళూరులో ఏర్పాటు చేసింది టాటాలే. శాస్త్ర సాంకేతిక రంగం పట్ల టాటాలకు ఉన్న మక్కువ దేశ శాస్త్ర పరిశోధన రంగం విస్తృతంగా అభివృద్ధి చెందేందుకు దోహద పడింది. జె.ఆర్.డి హయాంలో సైతం సైన్స్ పరిశోధన రంగం అభివృద్ధికి కీలకంగా కృషి చేశారు. ప్రఖ్యాత భౌతిక శాస్త్రవేత్త డాక్టర్ హోమీ జహంగీర్ భాభా ఆధ్వర్యంలో 1945లో టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ (TIFR) సంస్థ ఏర్పాటు చేశారు . అంతే కాకుండా భాభా అణు మరియు అంతరిక్ష పరిశోధనలకు నిధులను సమకూర్చారు.
భారతదేశంలో జనాభా నియంత్రణ కోసం మొదటగా కృషి ప్రారంభించింది టాటానే.1951 జనాభా లెక్క ప్రకారం భారతదేశం 35 కోట్ల జనాభాను మించిపోయిందని ఆయన గుర్తించాడు. టాటా ఈ విషయాన్ని అప్పటి ప్రధాని నెహ్రూ దృష్టికి తీసుకువెళ్లారు. కానీ ఆయన దాన్ని పట్టించుకోలేదు. ప్రభుత్వ స్పందన కోసం వేచిచూడకుండా సామాజిక వేత్త అయిన శ్రీమతి ఆవాబాయి వాడియా ప్రారంభించిన భారత కుటుంబ నియంత్రణ అసోసియేషన్‌కు ఆర్థిక సాయాన్ని అందించారు. 1970లో ఫోర్డ్ ఫౌండేషన్ భాగస్వామ్యంతో భారత కుటుంబ నియంత్రణ పరిశోధన సంస్ధను ప్రారంభించారు. ఈ సంస్థకు అంతర్జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు లభించింది. ఈ సంస్థ జనాభా అంశాల మీద భారత ప్రభుత్వంతో కలిసి పనిచేస్తుంది.
తన 80వ ఏట నుంచి టాటా ఛైర్మన్ బాధ్యతలు కంటే సామాజిక సేవా కార్యక్రమాల్లో విస్తృతంగా పాల్గొనడం ప్రారంభించారు. తన పేరు మీదే జె.ఆర్.డి టాటా ట్రస్ట్ ఏర్పాటు చేసి మహిళా అభ్యుదయం, స్త్రీ ఆర్థిక అక్షరాస్యత వంటి పలు కార్యక్రమాలను ట్రస్ట్ ద్వారా నిర్వహించారు. 82వ ఏట అంటే 1991లో టాటా ఛైర్మన్ బాధ్యతలు నుంచి తప్పుకొని తన బంధువు, ప్రియ శిష్యుడైన రతన్ టాటాను సంస్థ బాధ్యతలు అప్పగించారు.
భారతదేశ వాణిజ్య మరియు సామాజిక సేవా రంగాల్లో ఆయన చేసిన కృషికి గాను 1955లో పద్మవిభూషణ్, 1992 లో భారతదేశపు అత్యున్నత పౌరపురస్కారం భారతరత్నతో ప్రభుత్వం గౌరవించింది. జనాభా నియంత్ర రంగంలో కృషికి గాను ఐక్యరాజ్య సమితి 1992లో ప్రతిష్టాత్మక యునైటెడ్ నేషన్స్ పాపులేషన్ అవార్డును ప్రదానం చేసింది. విమానయాన రంగం అభివృద్ధికి వీరి కృషికి పలు దేశాలు తమ దేశాల అత్యున్నత పురస్కారాలతో సత్కరించాయి. భారత వాయుసేనలో ఆయన ఎయిర్ వైస్ మార్షల్ గౌరవ ర్యాంక్ అందుకున్నారు.
తన దీక్షా, దక్షతలతో వ్యాపారాన్ని అభివృద్ధి చేయడమే కాకుండా, దేశాభివృద్ధికి చిత్తశుద్ధితో పాటుపడిన గొప్ప వ్యక్తి జె.ఆర్.డి. దేశం ఆర్థికంగా సూపర్ పవర్ అవ్వాలని కోరుకోవడంలేదు. భారతీయులు ఆనందంగా ఉండే దేశం కావాలని ఆయన కోరుకునే వారు. ఐదు దశాబ్దాల పాటు భారతదేశ పారిశ్రామికాభివృద్ధిలో పాలుపంచుకున్న జె.ఆర్.డి.టాటా 1993, నవంబరు 29న కిడ్నీల ఇన్ఫెక్షన్ కారణంగా స్విట్జర్లాండ్‌లోని జెనీవా నగరంలో తన 89వ ఏట మరణించారు.
--డి.వి.అరవింద్(మాగల్ఫ్ ప్రతినిధి)
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్‌తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్‌ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి