NAREDCO ప్రతినిధులతో రాష్ట్ర రెవిన్యూ శాఖ మంత్రి అనగాని సత్య ప్రసాద్

- August 09, 2024 , by Maagulf
NAREDCO ప్రతినిధులతో రాష్ట్ర రెవిన్యూ శాఖ మంత్రి అనగాని సత్య ప్రసాద్

విజయవాడ: రియల్ ఎస్టేట్ రంగం ఎదుర్కుంటున్న సమస్యలను పరిష్కరించేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర రెవిన్యూ శాఖ మంత్రి అనగాని సత్య ప్రసాద్ అన్నారు. నిర్మాణ రంగంపై లక్షలాది మంది కార్మికులతో పాటు, పలు ఇతర రంగాలు కూడా ఆధార పడి ఉన్నాయన్నారు. నేషనల్ రియల్ ఎస్టేట్ డెవలప్ మెంట్ కౌన్సిల్ (NAREDCO) ప్రతినిధుల బృందం గురువారం సచివాలయంలో మంత్రిని కలిసి తమ పరిశ్రమ ఎదుర్కొంటున్న విభిన్న సమస్యలను ప్రస్తావించారు. దాదాపు అరగంటలకు పైగా జరిగిన సమావేశంలో నెరెడ్కో ప్రతినిధులు గత ప్రభుత్వం ప్రవేశ పెట్టిన విభిన్న విధానాల పట్ల తమ అసంతృప్తిని వ్యక్త పరిచారు. అమరావతి ప్రాంతంతో సహా రాష్ట్ర వ్యాప్తంగా రియల్ ఎస్టేట్ రంగాన్ని ఇక్కట పాలు చేసారని నెరెడ్కో రాష్ట్ర అధ్యక్షుడు గద్దె చక్రధరరావు మంత్రి అనగాని దృష్టికి తీసుకువచ్చారు. భూసర్వే పేరిట ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన చట్టాలను రద్దు చేయాలని కోరారు. ఎల్ పిఎం నెంబర్ విధానం వల్ల ఎటువంటి ఉపయోగం లేదని, దీని వల్ల కొత్త సమస్యలు ఉత్పన్నం అవుతున్నాయని వివరించారు. నాలా (నాన్ అగ్రికల్చరల్ ల్యాండ్ అసెస్మెంట్) పన్నును గణనీయంగా పెంచుతూ పోతున్నారని దానిని హెతుబద్దం చేయాలని సెంట్రల్ జోన్ అధ్యక్షుడు సందీప్ మండవ కోరారు. ఉమ్మడి అభివృద్ధి ఒప్పందం (జెడిఎ) కోసం రిజిస్ట్రేషన్ ఛార్జీలు మినహాయింపుతో డెవలపర్లపై ఆర్థిక భారాన్ని తగ్గించాలని విన్నవించారు. కనీసం ఒక సంవత్సరం పాటు రిజిస్ట్రేషన్ చార్జీలు పెంచకుండా చూడాలని రాష్ట్ర కార్యనిర్వాహక ఉపాధ్యక్షుడు కిరణ్ పరుచూరి అన్నారు. జాయింట్ డెవలప్మెంట్ ప్రాజెక్టలను ప్రోత్సహించేలా నిబంధనలు సరళీకరించాలన్నారు. వ్యవసాయ భూమిని గృహ వినియోగ అవసరాలకు మార్చే సమయంలో భూమి లెక్కింపును ఎకరాలలో తీసుకోవాలని నెరెడ్కో ప్రతినిధులు మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా మంత్రి అనగాని మాట్లాడుతూ ముఖ్యమంత్రి రియల్ ఎస్టేట్ సమస్యల పరిష్కారం పట్ల సానుకూలంగానే ఉన్నారని, రానున్న రోజుల్లో అన్ని విభాల సమన్వయంతో ఉన్నత స్ధాయి సమీక్ష నిర్వహించి ప్రతి సమస్యకు పరిష్కారం చూపుతామని హామీ ఇచ్చారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com