వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియా....!
- August 11, 2024
ప్రాణకోటికి జీవనాధారం నదులు. భారత ప్రాచీన నాగరికతలు నదుల వద్దనే మొదలై దేదీప్యమానంగా వెలుగొందాయి. నేటి ఆధునిక సమాజ అభివృద్ధిలో నదుల ప్రాధాన్యత నానాటికి పెరిగిన విషయం సైతం మనందరికి తెలిసిందే! ఇదే సమయంలో దేశంలో నదులు ఎండిపోతుండడం భవిష్యత్తులో వాటిల్లబోయే ముప్పునకు సంకేతంగా భావిస్తూ, హైరానా పడుతున్న సమయంలో మన ప్రాచీన భారత శాస్త్రీయ విధానంతో నదులకు పునర్జీవం కల్పించిన ఆధునిక భగీరథుడు, జలయజ్ఞ సారథి రాజేంద్ర సింగ్. నేడు వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియా ప్రసిద్ధి పొందిన ప్రముఖ పర్యావరణ నిపుణులు డాక్టర్ రాజేంద్ర సింగ్ నేపథ్యం గురించి క్లుప్తంగా మీకోసం...డాక్టర్ రాజేంద్ర సింగ్ ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని భాగ్‌పత్ జిల్లాలోని దౌలా గ్రామంలో సంపన్న రాజపుట్ జమీందారీ కుటుంబంలో జన్మించారు. తమ కుటుంబానికి ఆ ప్రాంతంలో ఉన్న పలుకుబడి కారణంగా ఆయన్ని చిన్నతనం నుంచే ప్రజలు బాగా గౌరవించే వారు. హరిద్వారాలోని రిషికుల్ ఆయుర్వేద కళాశాలలో బి.ఎ.ఎం.ఎస్ పూర్తి చేసి, హిందీ భాష, సాహిత్యం పట్ల ఉన్న మక్కువ కారణంగా అలహాబాద్ విశ్వవిద్యాలయం అనుబంధ బారౌత్ కళాశాలలో నుంచి హిందీ సాహిత్యంలో పోస్టు గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు.
రాజేంద్ర సింగ్ చిన్నతనం నుంచే సామాజిక సేవా కార్యక్రామాల పట్ల ఆసక్తి ఏర్పడింది. అందుకు తోడు మీరట్ పట్టణంలో చదువుతున్న సమయంలో ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు, గాంధేయవాది, గాంధీ శాంతి సంస్థ సభ్యుడు రమేష్ శర్మతో ఏర్పడ్డ పరిచయం సింగ్ జీవితాన్ని కీలకమైన మలుపు తిప్పింది. రమేష్ సహచర్యం మూలంగా సంఘ సేవ, గ్రామీణాభివృద్ధి అంశాల మీద ఆసక్తి, అభిరుచి ఏర్పడింది. ఆయనతో కలిసి గ్రామాలను సందర్శించి పారిశుధ్య కార్యక్రమాల్లో పాల్గొనడం, గ్రంథాలయాలను ఏర్పర్చడం, గ్రామస్తుల సంఘర్షణలను పరిష్కరించడం మరియు మద్యపానానికి వ్యతిరేకంగా ఉద్యమాలను నడిపించారు. హిందీ సాహిత్యంలో ఉదార భావాలకు ప్రసిద్ధి గాంచిన ప్రేమ్‌చంద్, మైథిలి శరణ్ గుప్త, సుభద్ర కుమారి చౌహాన్ రచనలు రాజేంద్రుడి సామాజిక అవగాహన విస్తృతం అవ్వడానికి దోహదపడ్డాయి.
శర్మ తరువాత రాజేంద్రను బాగా ప్రభావితం చేసిన ముఖ్యవ్యక్తి ఇంగ్లీష్ టీచర్ ప్రతాప్ సింగ్. తరగతి గదిలో విద్యార్థులకు పాఠాలను చెప్పడంతో పాటుగా రాజకీయాలు, సాంఘిక సమస్యలను చర్చించేవాడు. దీని మూలంగా సింగ్ ప్రజల సమస్యల గురించి తెలుసుకొని స్వంత అభిప్రాయాలను ఏర్పరచుకున్నాడు. ఇదే సమయంలో సర్వోదయ ఉద్యమ నాయకుడు, లోక్ నాయక్ జయప్రకాశ్ నారాయణ్ పట్ల అభిమానాన్ని పెంచుకున్నారు. దేశంలో ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా ఆయన సారథ్యంలో నడిచిన "ఛాత్ర యువ సంఘర్ష్ వాహిని" విద్యార్థి సంఘంలో పనిచేశారు. ఆ తర్వాత రాజకీయ వాతావరణం నచ్చక రాజకీయాలకు దూరమయ్యారు.
రాజేంద్ర సింగ్ చదివింది ఆయుర్వేదం అయినప్పటికీ సామాజిక సేవా కార్యక్రమాల మీద మక్కువతో 1980లో నేషనల్ సర్వీస్ విద్యా వాలంటీర్స్ తరుపున యువజన విద్యా పథకం సమన్వయకర్తగా రాజస్థాన్ రాజధాని జైపూర్ సమీపంలోని దౌసలో పనిచేయడం ప్రారంభించారు. ఆ సమయంలోనే జైపూర్ విశ్వవిద్యాలయం విద్యార్థులు స్థాపించిన "తరుణ్ భారత్ సంఘ్" (Young India Association) అనే స్వచ్చంద సేవా సంస్థలో చేరారు. కొంతకాలానికే ఆ సంస్థ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టారు.
భూసార పరిరక్షణ, జల సంరక్షణ, అడవుల సంరక్షణ, పర్యావరణ పరిరక్షణకు ఆ సంస్థ అప్పటికే పనిచేస్తున్నప్పటికి, సింగ్ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆ కార్యక్రమాల పరిధిని మరింత విస్తరించారు. ప్రజా సమస్యలపై అధికారుల ఉదాసీన వైఖరికి నిరసనగా తన పదవికి రాజీనామా చేసి తరుణ్ భారత్ సంఘ్(టి.బి.ఎస్) తరుపున పూర్తి స్థాయిలో పనిచేయడం ప్రారంభించారు. అదే సమయంలో రాజస్థాన్ కరువు కోరల్లో చిక్కుకొని పైరు నోచుకోక బీళ్లుగా మారిన పొలాలు, దాహం తీరే దారి లేక, భుక్తి గడిచే మార్గం లేక గ్రామాలకు గ్రామాలు వలస పోతున్న జనాలు, తిండి దొరక్క జంతువుల మృతువాతను చూసి రాజేంద్ర సింగ్ చలించి పోయారు.
కరువు కోరల నుండి రైతన్నలను రక్షించేందుకు రాజేంద్ర సింగ్ , తన సన్నిహితులైన తరుణ్ భారత్ సభ్యులతో చర్చించి ఆరావళి ప్రాంతంలో పర్యటించడం ప్రారంభించారు. ఆరావళి ప్రాంతంలో ముఖ్య జిల్లా ఆల్వార్ లోని కిషోరి గ్రామంలో ఉంటూ ఆయుర్వేద వైద్యాన్ని ఉచితంగా అందిస్తూ ఆ చుట్టుపక్కల గ్రామాలకు దగ్గరయ్యారు. ఆయన స్నేహితులు ఆయా గ్రామాల్లో విద్యను బోధించడం ద్వారా వారి నమ్మకాన్ని సంపాదించారు.
అటవీ నిర్మూలనం, గనుల తవ్వకాల ఫలితంగా నీరు తగ్గడం, వరదలు తరువాత తక్కువ వర్షాలు కురిసిన కారణంగా, ఒకప్పుడు పుష్కలంగా ధాన్యం పండించిన ఆల్వార్ జిల్లా బీడు భూములతో అనావృష్టికి గురైంది. దీనికి మరొక కారణం సాంప్రదాయ జల పరిరక్షణ విధానాలను నెమ్మదిగా విడిచిపెట్టడం, జోహాడ్ లేదా చెక్ డ్యాముల వంటి నిర్మాణాలకు బదులుగా గ్రామస్థులు ఆధునిక బోరు బావులపై ఆధారపడటం. ఈ బోరుబావులు భూగర్బ జలాలను పీల్చివేస్తాయి. ఇలా వాడడం మూలంగా భూగర్భ జలాల స్థాయి తగ్గి తరువాతి కాలంలో ఇంకా లోతైన బోరుబావులు త్రవ్వవలసి వస్తుంది. ఇలా పర్యావరణంగా ఆ ప్రాంతాన్ని బీడు భూములుగా మారే స్థితికి తెచ్చింది.
గత ఐదు సంవత్సరాలుగా భూగర్భ జలాలు అంతరించిపోయిన కారణంగా, ఆ ప్రాంతాన్ని ప్రభుత్వం అధికారికంగా "చీకటి జోన్"గా ప్రకటించింది. నీటి సంక్షోభం కారణంగా ప్రతి యేటా పంటలు ఎండిపోవడంతో ప్రజలు వ్యవసాయం మీద ఆశలు వదిలేసుకుంటున్న దశలో వారికి రాజేంద్ర సింగ్ మార్గనిర్దేశం చేసేందుకు సమాయత్తం అయ్యారు. సంప్రదాయ జల సంరక్షణ పద్దతులతో కరువు కాటకాలను నిర్ములించవచ్చని నీటి బొట్టు కట్టడికి శ్రమను పెట్టుబడిగా పెట్టాలని గ్రామస్తులకు పిలుపునిచ్చారు. చుక్క నీటినైన ఒడుపుగా ఒడిసి పట్టాలి, ప్రతి చెరువు గట్టును చక్కబెట్టాలి అంటూ గ్రామస్తులకు నినాదాన్ని ఇచ్చారు.
ఆయనిచ్చిన స్పూర్తితో స్థానిక యువకులు, రైతులు, మహిళలు నడుంబిగించి కొన్ని సంవత్సరాలపాటు నిర్లక్ష్యానికి గురైన గోపాలపుర జోహాడ్ పూడికతీత పనులను ప్రారంభించారు. ఆ సంవత్సరం వర్షాలు బాగా పడినప్పుడు జోహాద్ పూర్తిగా నీటితో నిండిపోయింది. కొన్ని సంవత్సరాలుగా ఎండిపోయి ఉన్న బావులలోనికి నీరు చేరింది. గ్రామస్తులకు జోహాద్ త్రవ్వకాలను కొనసాగించారు. దీని ఫలితంగా తరువాతి మూడు సంవత్సరాలలో 15 అడుగుల లోతుకు చేరింది. ఈ కార్యక్రమాలు భూగర్భ జలాల స్థాయి పెరుగుదలకు దోహదపడ్డాయి. కరువు రహిత ప్రాంతానికి దగ్గరగా ఉన్నట్లు ఆ ప్రాంతాన్ని "వైట్ జోన్"గా మార్చాయి. ఈ విజయంలో ఆ ప్రాంత ప్రజలు ఆయన్ని "జల పురుష్" (నీటి సంరక్షకుడు)గా కీర్తించారు.
1986లో ఈ ప్రాంతంలోని గ్రామాలలో పాదయాత్రను ప్రారంభించాడు. గ్రామాలలో చెక్‌డ్యాంలను పునర్మించవలసిందిగా ప్రజలను కోరారు. గోపాల్‌పురలో సాధించిన విజయాన్ని తన పాదయాత్రలో అనేక గ్రామాలలో వివరించారు.1986లో గోపాల్‌పురకు 20 కి.మీలు దూరంలో గల భానోటా-కోల్యాల గ్రామ ప్రజలు తరుణ్ భారత సంఘ్ స్వచ్ఛంద కార్యకర్తలతో పాటు శ్రమదానం చేసి, పూర్తిగా ఎండిపోయిన అర్వారి నది మూలం వద్ద జోహాద్ ను నిర్మించారు. ఆ నదీ పరీవాహక ప్రాంతంలో అనేక గ్రామాలలో కూడా వారు చిన్న మట్టి డ్యాములను నిర్మించారు. 224 మీటర్ల పొడవు, 7 మీటర్ల ఎత్తు గల కాంక్రీట్ డ్యాములు కూడా ఆరావళి కొండలపై నిర్మించారు. చివరికి ఆనకట్టల సంఖ్య 375 కు చేరుకున్నప్పుడు, 60 సంవత్సరాల పాటు ఎండిపోయి ఉన్న అర్వారి నదిలో 1990లో నీటిప్రవాహం మొదలైంది.
సరిస్కా అభయారణ్య ప్రాంతంలో మైనింగ్‌ను నిషేధించేందుకు ప్రజల తరుపున కోర్టుల్లో పోరాడి విజయం సాధించారు. ఆరావళి ప్రాంతంలో నదుల పునర్జీవం కోసం ఆ ప్రాంత ప్రజలతో కలిసి పనిచేశారు. దశాబ్దాల కాలంగా పొడిగా మారిన రూపారెల్, సర్సా, భగాని, జహాజ్‌వాలి నదులు కూడా పునరుజ్జీవనం చెందాయి. జైపూర్, దౌసా, సవై మాధోపూర్, భరత్పూర్, కరౌలి ప్రాంతాలలోని పొరుగు జిల్లాలలోని వందలాది కరువు ప్రాంతాలలోని గ్రామాల నుండి కరువు కారణంగా వెళ్లిపోయిన గ్రామస్తులందరూ గ్రామాలకు తిరిగి వచ్చి వ్యవసాయ కార్యకలాపాలను మొదలుపెట్టారు. టి.బి.ఎస్ సంస్థ కార్యక్రమాలు క్రమక్రమంగా రాజస్థాన్ అంతటా విస్తరించాయి.
రాజస్థాన్ వ్యాప్తంగా టి.బి.ఎస్ సంస్థ ఆధ్వర్యంలో జల సంరక్షణ పద్దతుల గురించి రైతులకు అవగాహన కల్పిస్తూన్నారు. సింగ్ తన ప్రయాణాన్ని కేవలం రాజస్థాన్ వరకే పరిమితం చేయకుండా దేశవ్యాప్తంగా నదుల పునరుజ్జీవనం, సంప్రదాయ నీటి వనరుల రక్షణ కోసం కృషి చేస్తున్నారు. ప్రజల భాగస్వామ్యం ఉంటే అసాధారణ లక్ష్యాలను సైతం సకాలంలో సాధించవచ్చని, ఎడారుల్లో ఆనకట్టలు నిర్మించవచ్చని, ఇసుమంత రాశి లేని ఇసుక భూముల్లో పసిడి పంటలు పండించవచ్చని రాజేంద్ర సింగ్ నిరూపించారు.
ఎడారి రాష్ట్రమైన రాజస్థాన్‌లో అంతరించిపోయిన 5 నదులకు జీవం పోసి, 1000 గ్రామాలకు నీరందించిన ఘనమైన చరిత్ర ఆయనది. వందల అడుగులు తవ్వితేగానీ జల పడనిచోట ఆయన పాటించిన విధానాలతో 15 అడుగుల లోతులోనే నీళ్లు పడేంతగా భూగర్భజలాలు రీచార్జ్ కావడంలో విశేషణం. వర్షపు నీటిని నిల్వచేసేట్యాంకులు, చెక్ డ్యాం లను ఉపయోగించి నీటిని సంరక్షించే సంప్రదాయ విధానాల ద్వారా నీటి సంరక్షణకు ఆయన చేస్తున్న కృషికి గాను ఆయన "వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియా"గా గుర్తించబడ్డారు. 2009లో భారత ప్రభుత్వ పర్యావరణ పరిరక్షణ చట్టం-1986 కు అనుగుణంగా గంగా నది పరిరక్షణ కోసం ఏర్పడిన అధికార ప్రణాళిక, ఫైనాన్సింగ్, పర్యవేక్షణ, సమన్వయ అధికారం గల సంస్థ "నేషనల్ గంగా రివర్ బేసిన్ అథారిటీ" వ్యవస్థాపక సభ్యుడిగా రాజేంద్ర సింగ్ పనిచేశారు.
జల సంరక్షణకు రాజేంద్ర సింగ్ చేస్తున్న కృషిని గుర్తించిన ఫిలిప్పీన్స్ ప్రభుత్వం 2001లో రామన్ మెగసెసే పురస్కారంతో సత్కరించింది. అంతకుముందు 1994లో భారత రాష్ట్రపతి నుంచి రోటరీ అంతర్జాతీయ పురస్కారాన్ని అందుకున్నారు. అదే ఏడాది భారత ప్రభుత్వంచే ఇందిరాగాంధీ పర్యావరణ పురస్కారం అందుకున్నారు. 1998లో ప్రముఖ ఆంగ్ల వార పత్రిక థి వీక్ "మ్యాన్ ఆఫ్ థి ఇయర్" గా ప్రకటించింది. 1999లో ఉజ్జయిని రాజ వంశస్థుల ట్రస్ట్ అందించే క్రాంతి వీర్ అవార్డును అందుకున్నారు. 2000లో ఆచార్య తులసి సమాజ్ వికాస్ పురస్కారాన్ని అందుకున్నారు. గ్రామీణాభివృద్ధికి చేస్తున్న కృషికి గాను 2005లో జమ్నాలాల్ బజాబ్ పురస్కారం అందుకున్నారు. 2015లో నోబెల్ ప్రైజ్ ఆఫ్ వాటర్ గా ప్రసిద్ధి గాంచిన స్టాక్‌హోం వాటర్ ప్రైజ్, 2016లో యూకేలోని జైనాలజీ విద్యాసంస్థ నుండి అహింస అవార్డును అందుకున్నారు.
జల సంరక్షణ బాధ్యత కేవలం కొందరిది మాత్రమే కాదు ఈ దేశ ప్రజలందరి బాధ్యత అని ఆయన ఎన్నో సార్లు తెలిపారు.తన చిరకాల స్వప్నమైన కరువు కాటకాలు లేని భారత దేశం కోసం తన చివరి శ్వాసవరకు శక్తివంచన లేకుండా కృషి చేస్తానని రాజేంద్ర సింగ్ పలు వేదికల మీద పేర్కొన్నారు.
--డి.వి.అరవింద్(మాగల్ఫ్ ప్రతినిధి)
తాజా వార్తలు
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్‌లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్‌ఫామ్..!!