స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల వేళ ఢిల్లీలో హైఅలర్ట్ .. ఎర్రకోట వద్ద పటిష్ఠ భద్రత
- August 13, 2024న్యూఢిల్లీ: 78వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా ఢిల్లీ హైఅలర్ట్ ప్రకటించారు. దేశ రాజధానిలోని కీలక ప్రాంతాల్లో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. ఎర్రకోట, రాష్ట్రపతి భవన్, ప్రధాని నివాసం, పార్లమెంట్, ఇండియా గేట్, ఐజిఐ విమానాశ్రయం, రైల్వే స్టేషన్, మెట్రో స్టేషన్లు, మాల్స్, మార్కెట్లు, రద్దీ ప్రాంతాల్లో కేంద్ర బలగాలతో భద్రతను పటిష్ఠం చేశారు. ఆగస్టు 15వ తేదీన 11వ సారి ఎర్రకోట పై ప్రధాని నరేంద్ర మోదీ జాతీయ పతాకాన్ని ఎగురవేయనున్నారు. వికసిత భారత్ థీమ్ తో 78వ స్వతంత్ర దినోత్సవ వేడుకలకు ఎర్రకోటలో ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఎర్రకోట పరిసరాల్లో 700 ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్ సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. 10వేల మంది పోలీసులతో భద్రత ఏర్పాటు చేశారు. ఎర్ర కోటలో వేడుకలకు 20 నుంచి 22 వేల మంది ప్రజలు హాజరుకానున్నారు. వేడుకలకు హాజరయ్యేవారికి క్యూఆర్ స్కానింగ్ కోడ్ పాసులు జారీ చేశారు. స్నైపార్స్, షార్ప్ షూటర్లు, స్వాట్ కమండోలతో ప్రధాని సహా ప్రముఖులకు భద్రత కల్పించనున్నారు.
ఆగస్టు 15న ఎర్రకోట సహా ట్రాఫిక్ విధుల్లో 3వేల మంది ట్రాఫిక్ పోలీసులు పాల్గొననున్నారు. ఎర్రకోట వద్ద స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ముగిసే వరకు “నో కైట్ ఫ్లయింగ్ జోన్” గా ఎర్రకోట పరిసర ప్రాంతాలు ఉండనున్నాయి. భద్రతా కారణాల దృష్ట్యా ఆగస్టు 2 నుంచి 16వ తేదీ వరకు ఢిల్లీలో రాజధానిలో పారాగ్లైడర్లు, హ్యాంగ్-గ్లైడర్లు, హాట్ ఎయిర్ బెలూన్‌లు డ్రోన్లు ఎగరవేయడాన్ని ఢిల్లీ పోలీసులు నిషేధించారు. ఎర్ర కోట పరిసరాల్లో కైట్ కాచర్స్ మోహరించారు. ఆగస్టు 15 వేడుకల భద్రతా ఏర్పాట్లను ఢిల్లీ పోలీసు కమిషనర్ సంజయ్ అరోరా పర్యవేక్షిస్తున్నారు.
ఎర్రకోటలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు నాలుగు వేల మందికి పైగా ప్రత్యేక ఆహ్వానితులు హాజరుకానున్నారు. ప్రత్యేక ఆహ్వానితుల్లో విద్యార్థులు, పేదలు, మహిళలు, రైతులు, యువత, గిరిజనులు, కార్మికులు ఉన్నారు. పారిస్ ఒలింపిక్స్ బృందం కూడా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు హాజరుకానున్నారు. ఆగస్టు 15 అతిథులను 11 కేటగిరీలుగా విభజించారు. వ్యవసాయం రైతుసంక్షేమ వర్గం నుండి వెయ్యి మంది ఆహ్వానితులు, యువజన వ్యవహారాల నుంచి 600 మంది, స్త్రీ, శిశు అభివృద్ధి విభాగం నుంచి 300 మంది, పంచాయతీ రాజ్ నుంచి 300, గ్రామీణాభివృద్ధి నుండి 300 మంది, గిరిజన వ్యవహారాలు, పాఠశాల విద్య, అక్షరాస్యత సరిహద్దు రోడ్ల సంస్థ/రక్షణ మంత్రిత్వ శాఖల నుంచి 350 మంది, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ, క్రీడల విభాగాల నుంచి 450 మంది ఆహ్వానితులు హాజరుకానున్నారు. అదేవిధంగా నీతి ఆయోగ్ నుండి 1,200 మంది ప్రత్యేక అతిథులు హాజరుకానున్నారు.
ప్రధాని నరేంద్ర మోదీ మూడోసారి పీఎంగా బాధ్యతలు చేపట్టిన తరువాత తమ ప్రభుత్వ ప్రాధాన్యతలపై ఎర్రకోట నుంచి తన ప్రసంగంలో వివరిస్తారు. భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా మార్చడానికి ఎర్రకోట నుంచి రోడ్‌మ్యాప్ ను మోదీ ప్రకటిస్తారు. విద్య, ఆరోగ్యం, మౌలిక సదుపాయాలు, సాంకేతిక అభివృద్ధి పై మోదీ ప్రసంగించనున్నారు. ప్రభుత్వ గత విజయాలు , భవిష్యత్తు లక్ష్యాలు, ప్రభుత్వ విధానాలను వివరిస్తూ స్వాతంత్ర్య సమరయోధులకు మోదీ నివాళులర్పించనున్నారు.
తాజా వార్తలు
- జిసిసిలో సివిల్ ఏవియేషన్.. కీలక అంశాలపై సమీక్ష..!
- బహ్రెయిన్ జలాల్లో చేపల వేట..నలుగురు భారతీయులు అరెస్ట్
- యూఏఈ వీసా క్షమాభిక్ష పథకం.. అథారిటీ కీలక అప్డేట్ జారీ..!!
- ఖతార్ నేషనల్ సైబర్ సెక్యూరిటీ స్ట్రాటజీ 2024-2030 ప్రారంభం..!
- రియాద్ లైట్ ఫెస్టివల్ 2024.. నవంబర్ 28న ప్రారంభం..!!
- కువైట్ లో రాబోయే రోజుల్లో వర్షాలు..!
- ప్రధాని మోదీ మూడు రోజుల అమెరికా పర్యటన
- చరిత్ర సృష్టించిన టీమిండియా, ఆసియా హాకీ ట్రోఫీ విజేతగా భారత్
- ప్రపంచంలో రాత్రిళ్ళు లేని దేశాల గురించి తెలుసా..?
- తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్