ఉగ్రవాద దాడులను ముందుగానే పసిగట్టే సాంకేతిక విధానం

- June 20, 2016 , by Maagulf
ఉగ్రవాద దాడులను ముందుగానే పసిగట్టే సాంకేతిక విధానం

ఫలానా ప్రాంతంలో ఉగ్రవాదులు దాడులకు పాల్పడే అవకాశం ఉందని నిఘా వర్గాలు హెచ్చరిస్తుంటాయి. అందుకు వివిధ మార్గాల ద్వారా అనుమానితుల కదలికలను గమనిస్తూ ఉంటారు. అయితే.. ఇంటలిజెన్స్‌ వర్గాలతో పనిలేకుండా ఉగ్రవాదులు ఎక్కడెక్కడ దాడులకు పాల్పడేందుకు వ్యూహం పన్నుతున్నారో ముందుగానే పసిగట్టే సాంకేతిక విధానాన్ని పరిశోధకులు అభివృద్ధి చేశారు.
అమెరికాలోని ఫ్లోరిడాలో ఉన్న మియామీ విశ్వవిద్యాలయానికి చెందిన డా.నెయిల్‌ జాన్సన్‌ నేతృత్వంలోని పరిశోధకుల బృందం ఈ సాంకేతికతను అభివృద్ధి చేశారు. ఉగ్రవాదులు వ్యూహరచనకు.. సమాచార మార్పిడికి సోషల్‌మీడియానే ఎక్కువగా వినియోగిస్తున్నట్లు ఇటీవల జరిగిన చాలా దాడుల్లో బయటపడింది.
ఐసిస్‌ లాంటి ఉగ్రవాద సంస్థలకు ప్రత్యేకంగా సైబర్‌ విభాగాలు కూడా ఉన్నట్లు నిఘావర్గాలు అనుమానిస్తున్నాయి. ఈ నేపథ్యంలో వందల వెబ్‌సైట్లలో పోస్టులను విశ్లేషిస్తూ ఎక్కడ దాడులకు పాల్పడేందుకు వ్యూహం పన్నుతున్నారో ముందస్తుగా పసిగట్టేలా అల్గారిథమ్‌ను అభివృద్ధి చేసినట్లు డా. జాన్సన్‌ వెల్లడించారు.
గత రెండేళ్లలో వివిధ దేశాల్లో జరిగిన దాడులకు ముందు ఉగ్రవాదుల మధ్య సాగిన సమాచార మార్పిడి.. సంభాషణలపై అధ్యయనం చేశారట. అలా గుర్తించిన వివరాల ప్రకారం భిన్నమైన అర్థాలతో ఉగ్రవాదుల సంభాషణలు ఉంటాయని.. సాధారణ పోస్టులతో పాటు అనుమానాస్పద పోస్టులను కూడా గుర్తించగలిగే అల్గారిథమ్‌ను రూపొందించినట్లు వివరించారు. సోషల్‌ మీడియాలో ఉగ్రవాదుల సంభాషనలు అధికారులు గుర్తించాలంటే ఎంతో ప్రయాస అవసరం. కానీ.. ఈ సాంకేతికతతో చాలా సులభంగా గుర్తించొచ్చని చెబుతున్నారు.
అయితే అకస్మాత్తుగా.. ముందస్తు వ్యూహం లేకుండా జరిగే ఉన్మాదుల దాడులను గుర్తించడం సాధ్యం కాదని చెప్పారు. ఈ కొత్త విధానానికి సంబంధించిన పూర్తి వివరాలను తాజాగా 'సైన్స్‌' జర్నల్‌లో ప్రచురించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com