అంతరిక్ష రంగ మేధావి....!
- September 25, 2024భారత అంతరిక్ష పరిశోధనలకు ప్రణాళికలు రచించిన వ్యక్తి.. విక్రమ్ సారాభాయ్ కాగా, ఆ ప్రణాళికలను ఆచరణలో పెట్టి చూపిన గొప్ప శాస్త్రవేత్త.. ప్రొఫెసర్ సతీష్ ధావన్. సౌండింగ్ రాకెట్ల నుంచి మొదలైన భారత అంతరిక్ష ప్రస్థానం.. నేడు విదేశీ ఉపగ్రహాలను రోదసిలో ప్రవేశ పెట్టే స్థాయికి చేరింది. తాజాగా.. మంగళయాన్, చంద్రయాన్‌తో బాటు సూర్యుడి మీద కూడా మనం పరిశోధన చేయగలిగే స్థాయికి భారత అంతరిక్ష సంస్థ చేరటం వెనక సతీష్ ధావన్ కృషి ఎంతో ఉంది. నేడు అంతరిక్ష రంగ మేధావి సతీష్ ధావన్ జయంతి. ఈ సందర్భంగా భారత అంతరిక్ష రంగ పరిశోధనలకు ధావన్ చేసిన సేవలను స్మరించుకుందాం.
సతీష్ ధావన్ 1920,సెప్టెంబర్ 25న జమ్ము& కాశ్మీర్ రాజధాని శ్రీనగర్ పట్టణంలో జన్మించారు. ధావన్ తండ్రి గారు రావు బహద్దూర్ దేవి దయాళ్ ధావన్ గారు బ్రిటిష్ సివిల్ సర్వీస్ ఉద్యోగిగా చేరి అనంతర కాలంలో జడ్జిగా పనిచేశారు. ధావన్ విద్యాభ్యాసం మొత్తం పంజాబ్ రాష్ట్రంలోని లాహోర్ మరియు పలు ప్రాంతాల్లో సాగింది. బాల్యం నుంచే అత్యంత ప్రతిభావంతుడైన విద్యార్థిగా రాణించి ప్రభుత్వ ఉపకార వేతనలతో పంజాబ్ ఇంజినీరింగ్ కళాశాలకు అనుబంధంగా ఉన్న లాహోర్ పట్టణంలో ఉన్నమొగల్ పురా సాంకేతిక కళాశాలలో బీఎస్సీ, మెకానికల్ ఇంజినీరింగ్ పూర్తి చేశారు. ఇంజినీరింగ్ చదువుతూనే ఎంఏ ఇంగ్లిష్ లిటరేచర్ పూర్తి చేశారు.
ధావన్ మేధోసంపత్తిని గుర్తించిన అప్పటి భారత ప్రభుత్వం విదేశాల్లో చదువుకునేందుకు ఉపకార వేతనం మంజూరు చేసింది. ఉన్నత విద్య కోసం అమెరికా వెళ్ళిన ఆయన మిన్నసోటా విశ్వవిద్యాలయం(University of Minnesota) నుంచి ఏరోస్పేస్ ఇంజినీరింగ్‌లో మాస్టర్స్ మరియు కాలిఫోర్నియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుండి ఏరోనాటికల్ ఇంజినీరింగ్‌లో డిగ్రీ పూర్తి చేసిన తర్వాత అక్కడే ప్రఖ్యాత ఏరోనాటిక్స్ ఇంజినీరింగ్ శాస్త్రవేత్త డా. హాన్స్ డబ్ల్యు లేప్‌మ్యాన్ పర్యవేక్షణలో మ్యాథమెటిక్స్ మరియు ఏరోస్పేస్ ఇంజినీరింగ్‌లో డ్యూయల్ పి.హెచ్.డి చేశారు.
1951లో స్వదేశానికి వచ్చిన ధావన్ బెంగళూరులోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్(IISc)లో అధ్యాపకుడిగా చేరి 1962 నాటికి ఆ సంస్థకు డైరెక్టర్ అయ్యారు. ఐఐఎస్సీలో ఏరోస్పేస్ విభాగం అభివృద్ధిలో ధావన్ పాత్ర కీలకం. బౌండరీ లేయర్ పరిశోధనలో ధావన్ పాత్ర గురించి ప్రముఖ జర్మనీ శాస్త్రవేత్త హెర్మన్ ష్లిక్టింగ్ తాను రాసిన బౌండరీ లేయర్ థియరీ పుస్తకంలో విఫులంగా వివరించారు. ఇండియా మొట్టమొదటి సూపర్‌సోనిక్ విండ్ టన్నెల్‌ను ఐఐఎస్సీలో ధావన్ ఏర్పాటు చేశారు. ఏరోస్పేస్ రంగానికి సంబంధించిన ఫ్లూయిడ్ డైనమిక్స్ శాస్త్రంలోని ట్రై సోనిక్ ఫ్లోస్, బౌండరీ లేయర్స్ వేరు చేయడం, త్రీ డైమెన్షనల్ బౌండరీ లేయర్స్ విషయాల్లో లోతుగా పరిశోధించిన మొట్టమొదటి భారత శాస్త్రవేత్త ధావన్ గారే. 1981 వరకు ఐఐఎస్సీ డైరెక్టర్ బాధ్యతలను నిర్వర్తించారు.
ఐఐఎస్సీలో పనిచేస్తున్న సమయంలోనే ఇండియన్ అటామిక్ శాస్త్రజ్ఞుడు హోమీ బాబా, భారత అంతరిక్ష పరిశోధనల పితామహుడిగా ప్రసిద్ది చెందిన విక్రమ్ సారాభాయ్ గార్లతో పరిచయం ఏర్పడింది. అంతరిక్ష రంగంలో ఇండియాను నిలిపేందుకు ఐఐఎస్సీ వేదికగా బాబా, సారాభాయ్, ధావన్ ఆలోచనలు చేసేవారు. బాబా అకాల మరణం తర్వాత వీరిద్దరూ అంతరిక్ష రంగ పరిశోధనల అభివృద్ధి కోసం పని చేస్తూ వచ్చారు. వీరి కృషి ఫలితంగా 1969లో భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) ఏర్పడింది.
1971 డిసెంబర్‌లో విక్రమ్ సారాభాయ్ ఆకస్మిక మరణంతో ఎలక్ట్రానిక్స్ కమిషన్‌లో ఉన్న డాక్టర్ ఎం.జి.కె.మీనన్ ఇస్రో చైర్మన్ అయ్యారు. అయితే, తన కంటే.. అమెరికాలో ఉన్నత విద్య పూర్తి చేసి ఐఐఎస్సీకి డైరెక్టర్‌గా ఉన్న సతీష్ ధావన్ ఇస్రో చైర్మన్ అయితే బాగుంటుందని భావించిన మీనన్.. ధావన్‌ను ఇస్రో చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించాలని కోరారు. డాక్టర్ మీనన్ చేసిన ప్రతిపాదనను అంగీకరిస్తూనే.. ధావన్ రెండు షరతులు పెట్టారు. ఒకటి.. ఇస్రో ప్రధాన కార్యాలయాన్ని బెంగళూరుకు మార్చటం, రెండు.. ఐఐఎస్సీ డైరెక్టర్‌గానూ కొనసాగేందుకు అనుమతించటం. ఈ రెండింటికీ నాటి ప్రధాని శ్రీమతి ఇందిరా గాంధీ అంగీకరించటంతో మీనన్ స్థానంలో ఇస్రో చైర్మన్ అయ్యారు.
ఇస్రో చైర్మన్‌గా ధావన్ నెలకు ఒక రూపాయి వేతనమే ఆయన తీసుకునేవారు. ధావన్ హయాంలోనే భారత్ తన తొలి ఉపగ్రహమైన ‘ఆర్యభట్ట’ను సోవియట్ రష్యా సాయంతో 1975 ఏప్రిల్ 19న రోదసిలోకి పంపింది. స్వదేశీ పరిజ్ఞానంతో రాకెట్ తయారీ, ప్రయోగం లక్ష్యంగా ధావన్ నాయకత్వంలో ఇస్రో 1979 ఆగస్టులో రోదసిలోకి పంపిన స్వయం నిర్మిత రాకెట్ ప్రయోగం విఫలం కావటంతో ధావన్ మీద పలు విమర్శలొచ్చాయి.కానీ, 1980 జూలై 18న SLV-3 వాహకనౌకతో రోహిణి-1 అనే 35 కేజీల శాటిలైట్‌ను ఇస్రో విజయవంతంగా ప్రయోగించింది. తద్వారా భారత్ తన సొంత రాకెట్, ఉపగ్రహాలను అభివృద్ధి చేసి, వాటిని పర్యవేక్షించగలిగే వ్యవస్థలను ఏర్పాటు చేసుకున్న ఆరో దేశంగా అవతరించింది.
అనంతరం భాస్కర, యాపిల్ ఉపగ్రహాలను నిర్మించి ఎస్‌ఎల్‌వీ ఉపగ్రహవాహకనౌక ద్వారా ప్రయోగించగలిగారు. ఇన్‌శాట్, ఐఆర్‌ఎస్, తరహా ఉపగ్రహాల నిర్మాణ ప్రణాళికలు తయారు చేశారు. అంతరిక్ష రంగంలో ధావన్ విశిష్ట సేవలకు గానూ.. 1971లో పద్మభూషణ్, 1981లో పద్మవిభూషణ్ అవార్డులను ప్రదానం చేయడం జరిగింది. దీనితో బాటు 1999లో ఇందిరాగాంధీ జాతీయ సమైక్యతా పురస్కారం, ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అవార్డు, కాలిఫోర్నియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వారి పురస్కారమూ అందుకున్నారు.
భారత తొలి ఉపగ్రహ వాహక నౌక ప్రయోగం విఫలమై సముద్రంలో పడిపోయినప్పుడు.. స్వదేశీ మీడియా, రాజకీయ నాయకులు ‘వందల కోట్ల ప్రజాధనాన్ని మిడిమిడి జ్ఞానంతో సముద్రం పాలు చేశారు’ అంటూ మండిపడ్డారు. ఆ ప్రయోగ బృందానికి నాయకత్వం వహించిన అబ్దుల్ కలాం ఎవరో మీడియా ముందుకొచ్చి క్షమాపణలు చెప్పాలని వారంతా డిమాండ్ చేశారు. కానీ.. ఆ రోజు కలాంకు బదులుగా ఇస్రో చైర్మన్ ధావన్ మీడియా ముందుకొచ్చి.. తాము విఫలమైన మాట నిజమేననీ, త్వరలో దేశం గర్వించే విజయాన్ని అందుకుంటామని చెప్పారు.
సరిగ్గా ఏడాది తర్వాత ఇస్రో ఉపగ్రహ ప్రయోగం విజయవంతమైనప్పుడు.. కలాంను మీడియా సమావేశంలో మాట్లాడమని ధవన్ పంపించారు. దీనిని మాజీ రాష్ట్రపతి, నాటి ధావన్ టీం మెంబర్ అయిన డా.ఏపీజే అబ్దుల్ కలాం తరచూ విద్యార్థులకు చెప్పేవారు. ఫెయిల్ అయినప్పుడు నాయకుడిగా తాను బాధ్యత తీసుకొని మాట్లాడి, సక్సెస్ సమయంలో తన టీమ్‌ని మాట్లాడమని చెప్పి, వాళ్లకి ఆ క్రెడిట్ వచ్చేలా చేశారు ధావన్.
ఇస్రో చైర్మన్‌గా పదవీ విరమణ చేసిన తర్వాత కూడా ఆయన దేశ అంతరిక్ష పరిశోధనా రంగానికి విశేషమైన సేవలు అందించారు. 1984 నుండి 1993 వరకు బెంగళూరు కేంద్రంగా ఉన్న జాతీయ ఏరోస్పేస్ లాబొరేటరీ ఛైర్మన్, ఇండియన్ స్పేస్ కమిషన్ అధ్యక్ష బాధ్యతలను ధావన్ సమర్థవంతంగా నిర్వర్తించారు. 2002, జనవరి 3న 81వ యేట బెంగళూరులో ధావన్ కన్నుమూశారు. ఆయన సేవలకు గుర్తుగా భారత ప్రభుత్వం.. శ్రీహరికోట రాకెట్ కేంద్రానికి(షార్) 2002 సెప్టెంబర్ 5న సతీష్ ధావన్ స్పేస్ సెంటర్‌గా నామకరణం చేసింది. అలాగే, షార్‌లోని రెండోగేట్ వద్ద సతీష్ ధావన్ విగ్రహం ఏర్పాటు, సతీష్ ధావన్ మెమోరియల్‌లను నిర్మించారు.
--డి.వి.అరవింద్(మాగల్ఫ్ ప్రతినిధి)
తాజా వార్తలు
- మహిళా టీ20 ప్రపంచకప్..భారత్ పై న్యూజిలాండ్ విజయం
- నిజమాబాద్: ముగ్గురి ఉసురు తీసిన ఆన్ లైన్ బెట్టింగ్..
- సీనియర్ హీరో రాజేంద్రప్రసాద్ ఇంట తీవ్ర విషాదం
- విద్యార్థుల నుంచి లంచం..టీచర్‌కు మూడేళ్ల జైలు, 5,000 దిర్హామ్‌ల జరిమానా..!!
- సౌదీయేతరులతోనే 64.8% సౌదీల వివాహాలు..అధ్యయనం వెల్లడి..!!
- షేక్ జాయెద్ రోడ్లో యాక్సిడెంట్.. 4.2 కి.మీ పొడవున ట్రాఫిక్ జామ్..!!
- దోహాలో రెండు కీలక రహదారులు తాత్కాలికంగా మూసివేత..!!
- కువైట్ లో తక్షణ చెల్లింపు కోసం 'WAMD' సర్వీస్ ప్రారంభం..!!
- మెట్రో రైడర్స్ కు గుడ్ న్యూస్.. ఈ-స్కూటర్లపై నిషేధం ఎత్తివేత..!!
- షార్ట్స్‌లో వీడియోల నిడివిని పెంచిన యూట్యూబ్