తత్వశాస్త్ర జ్ఞాన తపస్వి...!
- September 25, 2024ఆచార్య సచ్చిదానందమూర్తి జీవితం, తత్త్వశాస్త్రం రెండు పెనవేసుకుపోయిన విషయాలని భావించవచ్చు. ప్రాచీన కాలంలో తన తాత్విక చింతనతో ఆచార్య నాగార్జునుడు ప్రపంచాన్ని ఉర్రూతలూగిస్తే ఆధునిక కాలంలో తెలుగువారైన డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్, జిడ్డు కృష్ణమూర్తి, ఆచార్య కొత్త సచ్చిదానందమూర్తి ప్రభృతులు తత్వశాస్త్రాన్ని సామాన్యులకు అర్థమయ్యేట్లు చేయటంలో అనుపమానమైన కృషి చేశారు.దానికి కారణం ఆయనకు ఊహ తెలిసినప్పటి నుంచి ఇంటి గ్రంథాలయంలోని పురాణేతిహాసాలు, వివిధ మతగ్రంథాలు, అభ్యుదయ భావాలు గల పుస్తకాలతో పరిచయం ఏర్పడటమే. నేడు తత్వశాస్త్ర జ్ఞాన తపస్వి స్వర్గీయ ఆచార్య కొత్త సచ్చిదానందమూర్తి శతజయంతి.
ఆచార్య కొత్త సచ్చిదానందమూర్తి 1924,సెప్టెంబర్ 25న గుంటూరు జిల్లా సంగం జాగర్లమూడి గ్రామంలో సామాన్య రైతు కుటుంబానికి చెందిన రత్నమాంబ, వీరభద్రయ్య దంపతులకు ఏకైక సంతానంగా జన్మించారు. తండ్రి వీరభద్రయ్య ప్రభావంతో సచ్చిదానందమూర్తి చిన్నతనం నుండే పురాణేతిహాసాలు, దయానంద, వివేకానంద జీవిత చరిత్రలు, బైబిల్, ఖురాన్ తెలుగు అనువాదాలు చదివారు. ఇంటి వద్దనే సుప్రసిద్ధ పండితుల వద్ద సంస్కృతం, హిందీ అధ్యయనం చేశారు. 15 ఏళ్ల వయసులో ‘భగవద్గీత’పై వినూత్న దృక్పథంతో తెలుగులో వ్యాఖ్యానం చేసి సర్ సి.ఆర్. రెడ్డి ప్రశంస పొందారు. అలా తత్వశాస్త్ర అధ్యయనం వైపు ఆకర్షితుడైన సచ్చిదానందమూర్తి సంప్రదాయ, నవీన తర్క శాస్త్రాలు, తులనాత్మక తత్వశాస్త్ర అధ్యయనాలలో ప్రముఖులు అయిన శైలేశ్వర్ సేన్, పి.టి. రాజు శిష్యరికంలో వైట్ హెడ్. ఉడ్ రాస్, డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గ్రంథాలు, రామతీర్థకృతులు లోతుగా అధ్యయనం చేశారు.
గుంటూరులోని ఏసీ కళాశాలలో ఇంటర్ పూర్తి చేసి చేసి, ఆంధ్ర విశ్వకళాపరిషత్తు నుంచి 1946లో ఆనర్స్ డిగ్రీ తీసుకున్నారు. ఆ తరువాత కొద్ది కాలం తిరుపతి శ్రీ వేంకటేశ్వర కళాశాలలోనూ, ఒడిషాలోని మయూర్ భంజ్ కళాశాలలో కొంతకాలం పనిచేశారు.1949లో ఆంధ్ర విశ్వవిద్యాలయ తత్వశాస్త్ర విభాగంలో అధ్యాపకుడిగా ప్రవేశించి, ఆ విభాగాధ్యక్షుడిగా, ఆచార్యుడిగా, శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయ కులపతిగా, అఖిల భారతీయ దర్శన పరిషత్ అధ్యక్షునిగా, ఇండియన్ ఫిలసాఫికల్ కాంగ్రెస్ అధ్యక్షునిగా, ఇండియన్ ఫిలాసాఫికల్ కాంగ్రెస్ నిర్వాహక వర్గ చైర్మన్‌గా, వివిధ పదవులు అలంకరించారు.
సచ్చిదానందమూర్తి విద్యావిషయక జీవన గమనం ఆంధ్ర విశ్వవిద్యాలయంలో వికాసం చెందిందని చెప్పవచ్చు. అక్కడ పనిచేస్తున్నప్పుడే చరిత్ర, మానసిక, సామాజిక, మానవ శాస్త్రాలను విస్తృతంగా స్వాధ్యయనం చేశారు. వాటితో పాటు క్రైస్తవ ధర్మశాస్త్రవేత్తలతో పరిచయం, మధ్యయుగ తత్త్వప్రావీణ్యులైన ఆన్‌స్లెమ్, బోన్‌వెంచురా, ఆక్వినాస్ వంటి పాశ్చాత్య రచయితల రచనలను కూడా అధ్యయనం చేశారు. ప్రపంచవ్యాప్తంగా తత్త్వశాస్త్రంలో సంభవిస్తున్న పరిణామాలను కూడా ఆయన ఎప్పటికప్పుడు ఆకళింపుచేసుకునే వారు.
తాను తత్త్వవేత్తను కానని, అనేక దేశాలలో అనేక రూపాలలో వ్యక్తమవుతున్న తాత్త్విక చింతనల అధ్యయనం వల్ల తత్త్వశాస్త్ర సమస్యలపట్ల లోతైన అవగాహనకు అవకాశం ఏర్పడి, ఆ దిశగా తత్త్వశాస్త్ర సమస్యల పరిష్కారానికి కృషిచేసే ప్రయత్నశీలినేనని ఆచార్య సచ్చిదానందమూర్తి చెప్పుకున్నారు. పాశ్చాత్య, ప్రాచ్య ఇస్లామిక్, జపనీస్, చైనీస్ తత్త్వాలలో ఆయనకు ప్రగాఢమైన పాండిత్యం ఉంది. ఆయన రచనలు వైవిధ్యభరితంగానూ, సూక్ష్మ వివరణలతోనూ కూడి ఉంటాయి. తత్త్వశాస్త్ర అంశాలతో పాటు ఇండియన్ ఫారిన్ పాలసీ; ద క్వెస్ట్ ఫర్ పీస్; జనరల్ ఎడ్యుకేషన్ రీ కన్సిడర్డ్; ఎథిక్స్, ఎడ్యుకేషన్, ఇండియన్ యూనిటీ అండ్ కల్చరల్ వంటి గ్రంథాలకు సంపాదకత్వం వహించడమో లేదా రచించడమో చేశారు.
1950,60 దశకాల్లో పలు దేశాలలో పర్యటించి ప్రముఖ దార్శనికులతో సమావేశమయ్యారు. బెర్ట్రాండ్ రస్సెల్‌తో సమావేశమైనపుడు, వారిరువురు మానవుని నాగరికత, సంస్కృతులను కాపాడుకోవడం ఎలా అనే వాటిపై సమాలోచనలు చేశారు. అలాగే మనోవిజ్ఞాన శాస్త్రాన్ని మతం, కవిత్వం, స్వప్నాలతో విశ్లేషించిన కార్ల్ యాంగ్, ప్రసిద్ధ గణితాత్మక తర్కవేత్త అయిన బోహిన్‌స్కీని కలిశారు. ప్రసిద్ధ తత్త్వవేత్తలైన మూర్, కారల్ జాస్పర్స్ వంటివారితోనూ ప్రభావితమయ్యారు. రెండవ ప్రపంచయుద్ధ కాలం వరకూ ప్రాచీన భారతీయతత్త్వాలను సమకాలీన పరిస్థితులకు అన్వయింప చేసేవారు. ఆ తరువాతనే మిగతా సామాజిక శాస్త్రాలతోపాటు, విజ్ఞానశాస్త్రాల ప్రభావం కూడా తత్త్వశాస్త్ర రచనలలో కనబడుతుంది.
ఈనాడు సమాజం ఎదుర్కొంటున్న సమస్యలను తార్కికంగా ఆలోచించటం కూడా ఆచార్య మూర్తి రచనలలో గోచరమౌవుతుంది. తాను రచించిన ‘ఇవల్యూషన్ ఆఫ్ ఫిలాసఫీ ఇన్ ఇండియా’ అనే గ్రంథంలో ఆయన ఈ విధంగా పేర్కొన్నారు, ‘నా ఆలోచన వేదాంతంలోనూ, అలాగే కొంతవరకు బుద్ధుని బోధనలలోనూ పాదుకొని ఉన్నప్పటికీ సమకాలీన తత్త్వశాస్త్ర పరిస్థితి గురించి కూడా నాకు తెలుసు. అస్తిత్వవాద రచనలతో ప్రభావితం అయ్యాను. చివరిపరిణామం మాత్రం వేదాంతను పునర్‌వ్యాఖ్యానించడం కానీ, అస్తిత్వవాదాన్ని పునరారంభం చేయడం కానీ కాదు. మానసిక, సాంస్కృతిక మానవశాస్త్రాల ప్రభావంతో భాషాసంబంధశాస్త్ర పాఠాలు మరవకుండా అవకాశమున్న సంశ్లేషణకు కాదగిన భావధారను రూపొందించడం’’. బుద్ధునిపైన, ఆచార్య నాగార్జున పైన విస్తృత పరిశోధనలు చేసి పలు పరిశోధనాపత్రాలు, గ్రంథాలు ప్రచురించిన దర్శనాచార్యుడు ఆచార్య సచ్చిదానంద మూర్తి.
ఆచార్య మూర్తి కృషికి గుర్తింపుగా మాస్కోలోని రష్యన్ అకాడమీ ఆఫ్ సైన్సెస్, బల్గేరియాలోని సోఫియా యూనివర్సిటీ, బీజింగ్‌లోని పీపుల్స్ యూనివర్సిటీ ఆఫ్ చైనా, జర్మనీలోని హాల్ విట్టేవ్ యూనివర్సిటీ తదితర సంస్థలు గౌరవ డాక్టరేట్ డిగ్రీలు ప్రదానం చేశాయి. అత్యంత ప్రతిష్ఠాకరమైన పద్మవిభూషణ్ గౌరవం వారికి లభించింది. స్వామి ప్రణవానంద తత్వశాస్త్ర జాతీయ బహుమతి, శృంగేరి పీఠం వారి విద్యాసాగర్, వాచస్పతి లభించింది. ఇలా తాత్విక రంగంలో ఎవరూ పొందనన్ని గౌరవాలు వారు పొందారు. విశేష విద్వత్ కృషికి గుర్తింపుగా వారి 71వ ఏట నాగార్జున విశ్వవిద్యాలయంలో రూ. 30 లక్షల వ్యయంతో ఆఫ్రో–ఏసియన్ తత్వశాస్త్రాధ్యయన సంస్థ విదేశీ ప్రముఖుల సమక్షంలో ఏర్పడింది. ఈ సంస్థ ప్రారంభోత్సవానికి సెనెగల్ రిపబ్లిక్ అంబాసిడర్ అహ్మద్ ఎల్. మన్సూర్ దియోస్, దక్షిణ కొరియా అంబాసిడర్ బ్యూంగ్ యోంగ్ సోలు గౌరవ అతిధులుగా హాజరయ్యారంటేనే వారి కీర్తిప్రతిష్టలను అంచనా వేయవచ్చు. ఇంతటి అపూర్వ గౌరవం భారతదేశంలో ఒకరిద్దరికి మాత్రమే లభించి ఉండవచ్చు.
తత్వశాస్త్రాన్ని నిర్వచిస్తూ ‘ఏది ఉన్నదో అదే తత్వం. ఉన్నది ఉన్నట్లుగా చూడటం తత్వదర్శనం. ఉన్న దాని స్వరూపాన్ని గ్రహించటం తత్వశాస్త్ర లక్ష్యం. వేదాంతం తత్వశాస్త్రంలో ఒక భాగమని’ ఆచార్య సచ్చిదానందమూర్తి అన్నారు. ప్రాక్పశ్చిమ తత్వశాస్త్రాల విశేష అధ్యయన అవగాహనతో ఆచార్య మూర్తి గీతలో బోధించిన సమదృష్టి అందరికీ కావాలంటారు. భర్తృహరి ఉద్ఘాటించిన శాస్త్ర సమత్వం కూడా వివిధ శాస్త్రాల పౌరసత్వక ఆధారిత ప్రక్రియా పద్ధతులలో సమన్వయంతో ఆయన పరిశీలించారు.సమాజ పురోగమనానికి అవసరమైన వాటిని విచక్షణతో పరిగ్రహించి, ఇముడ్చుకుంటూనే కాలం చెల్లిన వాటిని పరిత్యజించడంలోనే హేతుబద్ధమైన జీవిత విధానం, ఆలోచనా సమగ్రత, మానవ ఆదర్శాల సంపూర్ణ అవగాహన సాధ్యమని ఆచార్య మూర్తి భావన.
తత్వశాస్త్ర అధ్యయన జగత్తులో డాక్టర్ రాధాకృష్ణన్ తరువాత ప్రపంచవ్యాప్తంగా దాదాపు అన్ని గౌరవాలు, సన్మానాలు పొందిన ప్రజ్ఞామూర్తి సచ్చిదానందమూర్తి. రాగద్వేషాలకు అతీతంగా, కీర్తి కాంక్షలకు దూరంగా, తనకు ప్రియమైన స్వగ్రామం సంగం జాగర్లమూడిలో అధ్యయన, అనుశీలన, రచనా, వ్యాసంగాలతో జీవించి వున్నంతవరకు గడిపారు. ప్రపంచమంతా చుట్టి వచ్చినా, మూడున్నర దశాబ్దాల పాటు కాస్మోపాలిటన్ సిటీగా ప్రసిద్ధి చెందిన విశాఖపట్నంలో ఉన్న ఆంధ్ర విశ్వవిద్యాలయంలో పదవీ విరమణ చేసిన తరువాత తన కన్న ఊరు అయిన సంగం జాగర్లమూడిలో పితృ పితామహులు నివసించిన ఇంటిలోనే నివసిస్తూ అవకాశం, అవసరం, కలిగినప్పుడల్లా తన మేధాశక్తిని సమాజానికి పంచుతూ వచ్చారు.
అప్పుడప్పుడు అవసరానికి మించి కటువుగా మాట్లాడటం, తన సంభాషణలో తీవ్రమైన వ్యంగ్యాన్ని విసరటం, గిలిగింతలు పెట్టే హాస్యాన్ని వెదజల్లటం, సరుకున్నవాడు ఎంత చిన్నవాడైనా ఆదరించటం, సరుకు లేని వాళ్ళు ఎంత ఉన్నతులైనా తృణీకరించటం ఆచార్య మూర్తి ప్రత్యేక లక్షణాలు. ఒత్తిడుల జీవితానికి దూరంగా ఉంటూ కలిమిలేములకు ఆనంద విషాదాలకు లొంగని స్థిత ప్రజ్ఞుడు, తాత్విక సంపన్నుడు. బోధనపట్ల అపరిమిత నిబద్ధతతోనూ, విశ్వవిద్యాలయ నిర్వహణాపరంగానూ, రచనలలోనూ సృజనాత్మకతను కనబరచి అలనాటి తత్త్వవేత్తలలో ప్రాముఖ్యత సంతరించుకున్న విశిష్టుడు ఆచార్య సచ్చిదానందమూర్తి. యునెస్కో, కేంద్ర ప్రభుత్వ విద్యాసంబంధ కమిటీలలో ఛైర్మన్ లేదా సభ్యులుగా తత్త్వశాస్త్ర వికాసానికీ, విద్యావిషయకంగా మానవాభ్యుదయానికి ఆయన చేసిన సేవలు అనుపమానమైనవి.
భారతీయ తత్వదృక్పధాన్ని విశ్వవ్యాప్తంగా వ్యాపింపచేసిన ఆధునిక నాగార్జునుడు, నవీన బుద్ధఘోషుడు ఆచార్య మూర్తిగారు. విద్యావేత్తగా, తత్వశాస్త్ర పీఠాధిపతిగా, జాతీయ, అంతర్జాతీయ కీర్తిప్రతిష్టలు సంతరించుకున్న మహామనిషి ఆచార్య కొత్త సచ్చిదానందమూర్తి 2011 జనవరి 24వ తేదీన 86వ యేట తన స్వగ్రామమైన సంగం జాగర్లమూడిలో కన్నుమూశారు.
--డి.వి.అరవింద్(మాగల్ఫ్ ప్రతినిధి)
తాజా వార్తలు
- నిజమాబాద్: ముగ్గురి ఉసురు తీసిన ఆన్ లైన్ బెట్టింగ్..
- సీనియర్ హీరో రాజేంద్రప్రసాద్ ఇంట తీవ్ర విషాదం
- విద్యార్థుల నుంచి లంచం..టీచర్‌కు మూడేళ్ల జైలు, 5,000 దిర్హామ్‌ల జరిమానా..!!
- సౌదీయేతరులతోనే 64.8% సౌదీల వివాహాలు..అధ్యయనం వెల్లడి..!!
- షేక్ జాయెద్ రోడ్లో యాక్సిడెంట్.. 4.2 కి.మీ పొడవున ట్రాఫిక్ జామ్..!!
- దోహాలో రెండు కీలక రహదారులు తాత్కాలికంగా మూసివేత..!!
- కువైట్ లో తక్షణ చెల్లింపు కోసం 'WAMD' సర్వీస్ ప్రారంభం..!!
- మెట్రో రైడర్స్ కు గుడ్ న్యూస్.. ఈ-స్కూటర్లపై నిషేధం ఎత్తివేత..!!
- షార్ట్స్‌లో వీడియోల నిడివిని పెంచిన యూట్యూబ్
- కాంగో పడవ ప్రమాదంలో 78 మంది జల సమాధి