హాస్య సినిమాలకు కేరాఫ్ రేలంగి
- September 30, 2024మనం ఇతరులను బాగా నవ్వించాలంటే ముందుగా మనలో ‘సెన్సాఫ్ హ్యూమర్’ చాలా ఉండాలి. అలాగే, తాను నవ్వకుండానే ఇతరులను నవ్వించడం మరింత పెద్ద కళ. ఆ కళ బాగా తెలిసిన వారు టాలీవుడ్ దర్శకులు రేలంగి నరసింహారావు. గురువు దర్శకరత్న దాసరి నారాయణ రావు వద్ద అనేక చిత్రాలకు అసోసియేట్ గా పనిచేసిన తరువాత రేలంగి మెగాఫోన్ పట్టారు. తెలుగు, కన్నడ భాషల్లో తెరకెక్కించిన అనేక చిత్రాల్లో నవ్వులే పూయించారు. నేడు టాలీవుడ్ హాస్య దర్శకులు రేలంగి నరసింహారావు పుట్టినరోజు.
రేలంగి నరసింహారావు 1951 సెప్టెంబర్ 30న ఉమ్మడి మద్రాస్ రాష్ట్రంలోని పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు పట్టణంలో రేలంగి శ్రీరంగనాయకులు, శివరామమ్మ దంపతులకు జన్మించారు. పాలకొల్లు ఎందరో కళాకారులకు పుట్టినిల్లు. అల్లు రామలింగయ్య, పినిశెట్టి శ్రీరామ్మూర్తి, దాసరి నారాయణరావు వంటివారందరూ ఆ ఊరివారే. దాసరి దర్శకుడు కాగానే తన ఊరికి చెందిన ఎందరో ప్రతిభావంతులకు చిత్రసీమలో స్థానం కల్పించారు.వారిలో రేలంగి నరసింహారావు కూడా ఉన్నారు. దాసరి స్పూర్తితో మద్రాస్ చేరుకున్న రేలంగి తొలుత బి.వి.ప్రసాద్, కె.ఎస్.ఆర్.దాస్ వంటి వారి వద్ద అసిస్టెంట్ గా పనిచేసిన రేలంగి నరసింహారావు, దాసరి దర్శకుడు కాగానే ఆయన చెంత చేరారు.
రేలంగికి దాసరితో మంచి అనుబంధం ఏర్పడింది. గురువు దాసరి సన్నివేశం వివరిస్తే చాలు, శిష్యుడు రేలంగి అల్లుకుపోయేవారు. దానిని అందంగా తెరకెక్కించడంలో పాలుపంచుకొనేవారు. రేలంగి ప్రతిభ చూసి మిత్రులు మరియు అప్పటి సహాయ దర్శకులు కోడి రామకృష్ణ, రవిరాజాలు సైతం ప్రోత్సహించారు. అలా, రేలంగి దర్శకత్వంలో రూపొందిన తొలి చిత్రం ‘చందమామ’. అది ముందుగా వెలుగు చూడలేదు. దాంతో నిరాశకు గురైన రేలంగిని మిత్రులు ఊరడించారు. రేలంగి నరసింహారావులోని సెన్సాఫ్ హ్యూమర్ ను గుర్తు చేసి కామెడీ ట్రై చేయమన్నారు. అలా రూపొందిన చిత్రమే ‘నేను మా ఆవిడ’. ఈ హాస్యభరిత చిత్రం జనాన్ని ఆకట్టుకుంది. ఆ తరువాత రేలంగి దర్శకత్వంలో రూపొందిన “ఏవండోయ్ శ్రీమతిగారు, ఇళ్ళంతా సందడి” కూడా నవ్వులు పూయించాయి. అప్పుడు మొదటి సినిమా ‘చందమామ’కూడా వెలుగు చూసింది.
80,09 దశకాల్లో చంద్రమోహన్, రాజేంద్రప్రసాద్ కామెడీ హీరోలుగా తెలుగు చలన చిత్ర సీమలో కదం తొక్కతున్నారు. వారిద్దరితోనూ రేలంగి నరసింహారావు అత్యధిక సినిమాలు తెరకెక్కించారు. అన్నిట్లోనూ నవ్వులే పూశాయి. “ఎదిరింటి మొగుడు- పక్కింటి పెళ్ళాం, ఇద్దరు పెళ్ళాల ముద్దుల పోలీస్, ముచ్చటగా ముగ్గురు, మన్మథలీల కామరాజు గోల, తోడల్లుళ్ళు, చలాకీ మొగుడు – చాదస్తపు పెళ్ళాం, రంభ రాంబాబు, అత్తింట్లో అద్దెఅల్లుడు, పెళ్ళానికి ప్రేమలేఖ-ప్రియురాలికి శుభలేఖ, పరుగో పరుగు” వంటి నవ్వుల సినిమాలను అందించారు. సదా నవ్వులతోనే సాగకుండా “సంసారం, జీవనజ్యోతి, దాగుడుమూతల దాంపత్యం” వంటి ఫ్యామిలీ డ్రామాలూ తీశారు.
సుమన్, భానుచందర్, జయసుధలు ప్రధాన తారాగణంగా ‘ఇద్దరు కిలాడీలు’ వంటి యాక్షన్ మూవీనీ తెరకెక్కించారు. వాస్తవానికి సుమన్ తొలి చిత్రం ఇదే. అయితే ‘తరంగిణి’ ముందు విడుదలయింది. కృష్ణంరాజుతో ‘యమధర్మరాజు’ అనే యాక్షన్ డ్రామానూ తెరకెక్కించారు రేలంగి నరసింహారావు. అలాగే, ఆయన ప్రముఖ సినిమా నటులైన అక్కినేని నాగేశ్వరరావు (దాగుడు మూతల దాంపత్యం), శోభన్ బాబు (సంసారం)లతో కూడా సినిమాలూ చేసారు.అయితే ఆయన కామెడీ మూవీస్ బాగా ఆడాయి. తెలుగులో తాను తీసిన చిత్రాలనే కన్నడలో రీమేక్ చేశారు. అలా కన్నడ సీమలోనూ రేలంగి నరసింహారావు మంచి పేరు సంపాదించారు. సుదీర్ఘ కాలం తర్వాత 2016లో ‘ఎలుకా మజాకా’ అనే చిత్రం తెరకెక్కించారు. ప్రస్తుతం హైదరాబాద్ లో ఉన్నారు.ఇప్పటికీ తాను దర్శకత్వం వహించడానికి రెడీ అంటున్నారు రేలంగి నరసింహారావు.
--డి.వి.అరవింద్(మాగల్ఫ్ ప్రతినిధి)
తాజా వార్తలు
- మహిళా టీ20 ప్రపంచకప్..భారత్ పై న్యూజిలాండ్ విజయం
- నిజమాబాద్: ముగ్గురి ఉసురు తీసిన ఆన్ లైన్ బెట్టింగ్..
- సీనియర్ హీరో రాజేంద్రప్రసాద్ ఇంట తీవ్ర విషాదం
- విద్యార్థుల నుంచి లంచం..టీచర్‌కు మూడేళ్ల జైలు, 5,000 దిర్హామ్‌ల జరిమానా..!!
- సౌదీయేతరులతోనే 64.8% సౌదీల వివాహాలు..అధ్యయనం వెల్లడి..!!
- షేక్ జాయెద్ రోడ్లో యాక్సిడెంట్.. 4.2 కి.మీ పొడవున ట్రాఫిక్ జామ్..!!
- దోహాలో రెండు కీలక రహదారులు తాత్కాలికంగా మూసివేత..!!
- కువైట్ లో తక్షణ చెల్లింపు కోసం 'WAMD' సర్వీస్ ప్రారంభం..!!
- మెట్రో రైడర్స్ కు గుడ్ న్యూస్.. ఈ-స్కూటర్లపై నిషేధం ఎత్తివేత..!!
- షార్ట్స్‌లో వీడియోల నిడివిని పెంచిన యూట్యూబ్