సినిమా రివ్యూ: ‘శ్వాగ్ (SWAG)’

- October 04, 2024 , by Maagulf
సినిమా రివ్యూ: ‘శ్వాగ్ (SWAG)’

శ్రీవిష్ణుకి ఈ మధ్య గుడ్ టైమ్ నడుస్తోంది. సినిమాలో విషయమున్నా లేకున్నా.. మౌత్ టాక్‌తో మంచి విజయాలు దక్కుతున్నాయ్. ‘సామజవరగమన’, ‘ఓం భూమ్ భుష్’ సినిమాలు అలాగే మంచి సక్సెస్ అందుకున్నాయ్. అదే జోరుతో హ్యాట్రిక్ కొట్టాలని ‘శ్వాగ్’ అంటూ ఓ డిఫరెంట్ సినిమాతో వచ్చాడు. ఈ సినిమా ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

ప్రోమోలతో సినిమాపై మంచి ఆసక్తి క్రియేట్ చేశాడు శ్రీ విష్ణు. ‘స్వాగణిక వంశం..’ అనే కాన్సెప్ట్‌తో రూపొందిన ఈ సినిమా ప్రోమోలతో క్రియేట్ చేసిన ఆసక్తికి తగ్గట్లుగా అంచనాల్ని అందుకుందా.?  లేదా.? తెలియాలంటే కథలోకి వెళ్లాల్సిందే.

కథ:
సాధారణంగా చెప్పేసుకునే కథ కాదిది. స్వాగణిక వంశ వృక్షానికి చెందిన కథ. శ్రీ విష్ణు ఒకటి కాదు, రెండు కాదు, మూడు కాదు ఏకంగా ఐదు డిఫరెంట్ పాత్రల్లో నటించిన కథ. 1551వ సంవత్సరంలో కథ మొదలవుతుంది. పురుషులకు ముసుగులు వేసి, మహిళా సాధికారత అంటే ఏంటో తెలియచెబుతూ మగవాళ్లని తన కాలికింది చెప్పులా అత్యంత హీనంగా చూస్తుంటుంది వింజామర మహారాణి రుక్మిణీ దేవి (రీతూ వర్మ). ఈ విపరీతమైన ధోరణిని తట్టుకోలేని భవభూతి మహారాజు (మొదటి శ్రీ విష్ణు) తన ఓ పన్నాగం ద్వారా తన స్వాగణిక వంశాన్ని వృద్ధి చేసి పురుషాధిక్యతను పెంపొందించాలనుకుంటాడు.

అక్కడ కట్ చేస్తే, నెక్స్‌ట్ కథ రెండో శ్రీ విష్ణు వైపుకు వెళుతుంది. ఎస్.ఐగా రిటైర్ అవబోతున్న భవభూతి (రెండో శ్రీ విష్ణు) తన ఫ్యామిలీ సెట్ అవ్వాలంటే స్వాగణిక వంశానికి చెందిన నిధిని దక్కించుకోవాలని.. ఆ నిధి ఎక్కడుందో కనిపెట్టేందుకు రకరకాల ప్లాన్స్ వేస్తుంటాడు.

అక్కడ కట్ చేస్తే.. మూడో శ్రీ విష్ణు.. సింగరేణి అలియాస్ సింగ తన తండ్రిని వెతుక్కుంటూ తన వంశ వృక్షాన్ని చేరుకుంటాడు. అక్కడే సింగకు అనుభూతి (రెండో రీతూ వర్మ) పరిచయమవుతుంది. స్వాగణిక వంశానికి చెందిన నిధి  వెతుకులాటలో వుంటుంది అనుభూతి.

రికార్డింగ్ డాన్సర్ అయిన యయాతి (నాలుగో శ్రీ విష్ణు). శ్వాగణిక వంశానికి చెందిన నిధి ఎవ్వరికీ దక్కకుండా పోవడానికి కారణం ఈ యయాతియే అని భావిస్తుంటారు అందరూ.

ఇక, ఫైనల్‌ క్యారెక్టర్ ఐదో శ్రీ విష్ణు ఈయన క్యారెక్టర్ మాత్రం సస్పెన్స్ అండోయ్. రివీల్ చేయకూడదు మరి. ఇన్ని రకాల పాత్రలు పోషించి, ఇన్ని రకాల ఇంట్రోలిచ్చాక అసలు స్వాగణిక వంశానికి చెందిన కథ, కమామిషు ఏంటీ.? ఈ క్యారెక్టర్లన్నింటినీ డైరెక్టర్ ఎలా కంచికి చేర్చాడు.? అసలు నిధిని దక్కించుకున్న క్యారెక్టర్ ఏంటీ.? అందుకోసం ఎవరెవరు ఏమేం చేశారు.? తెలియాలంటే స్వాగణిక వంశాన్ని తెరపై చూడాల్సిందే.

నటీనటుల పని తీరు:
చాలా సినిమాల్లో డబుల్, ట్రిపుల్ రోల్స్ పోషించారు పలువురు హీరోలు. ‘దశావతారం’ సినిమా కోసం విశ్వ నటుడు కమల్ హాసన్ ఏకంగా పది పాత్రలూ పోషించేశారు. అయితే, ఈ సినిమా కోసం శ్రీ విష్ణు పంచ పాత్రలు పోషించారు. ఏ పాత్రకి ఆ పాత్రే భిన్నం. ఆయా పాత్రలన్నింట్లోనూ శ్రీ విష్ణు అద్భుతంగా అలవోకగా నటించేశాడు. అచ్చ తెలుగు భాషతో తనదైన మ్యానరిజంతో ఆకట్టుకున్నాడు. రెండు విభిన్నమైన పాత్రల్లో రీతూ వర్మ బాగానే నటించింది. గ్లామర్ కోసం దక్షా నగార్కర్‌ని తీసుకున్నారు. సీనియర్ హీరోయిన్ మీరా జాస్మిన్, సునీల్, గోపరాజు రమణ, గెటప్ శీను తదితరులు తమ పాత్రల పరిధి మేర నటించి అవసరమున్న చోట నవ్వించి మెప్పించారు.

సాంకేతిక వర్గం పనితీరు:
శ్రీవిష్ణుతో గతంలో ‘రాజ రాజచోర’ సినిమా తెరకెక్కించి హిట్టు కొట్టిన దర్శకుడు హసిత్ గోలి ఈ సినిమాని తెరకెక్కించాడు. ఫస్టాప్‌ ఒకింత బాగానే నడిపించాడు. కానీ, సెకండాఫ్‌కి వచ్చేసరికి తను కన్ఫ్యూజ్ అయ్యి, ఆడియన్స్‌నీ కన్ఫ్యూజ్ చేసేశాడు. బ్రిలియంట్ స్టోరీ.. ఓ మంచి మెసేజ్‌తో సినిమాకి ముగింపు ఇచ్చాడు. కానీ, వివిధ కాలాల బ్యాక్ డ్రాప్‌లో నడిచే కథని ఆడియన్స్‌కి కనెక్ట్ అయ్యేలా నడిపించడంలో చాలా కన్ఫ్యూజ్ అయ్యాడు. దాంతో, సూపర్ హిట్ అవ్వాల్సిన కాన్సెప్ట్ రక రకాల ట్విస్టులు తిరిగి, చివరికి దిక్కూ దివాణం లేకుండా పోయింది. వివేక్ సాగర్ అందించిన మ్యూజిక్ ఓకే అనిపిస్తుంది. ఇంటర్వెల్ బ్యాంగ్‌లో ట్విస్ట్ రివీల్ చేసే సందర్భంలో  ఇచ్చిన బీజీఎమ్ అద్భుతంగా వుంటుంది. సెకండాఫ్‌లో ఎడిటింగ్ విషయంలో కాస్త బ్రిలియెన్స్ వాడి వుంటే కథ బాగుండేది. డిఫరెంట్ వేరియేషన్స్‌లో ఆర్ట్ వర్క్ బాగుంది. నిర్మాత టి.జి.విశ్వ ప్రసాద్ ఎక్కడా రాజీ పడలేదని చెప్పొచ్చు. ఓవరాల్‌గా ఎడిటింగ్ తప్ప మిగిలిన సాంకేతిక వర్గం ఫర్వాలేదనిపిస్తుంది.

ప్లస్ పాయింట్స్:
ఫస్టాఫ్, శ్రీ విష్ణు పర్‌ఫామెన్స్, ముఖ్యంగా ఐదో పాత్రలోని ట్విస్ట్.. అచ్చ తెలుగు భాషలో పలికిన డైలాగులు.. ఫైనల్‌గా ఇచ్చిన మెసేజ్..

మైనస్ పాయింట్స్:
కథనం, బోరింగ్ సెకండాఫ్, సాదా సీదాగా సాగిపోయిన సన్నివేశాలు, కథకు అవసరమే లేని అనవసరమైన ట్విస్టులు,

చివరిగా:                                                                                                                                                       అనగనగా ఓ స్వాగణిక వంశం..కంచికి చేరాల్సిన ఈ కథని అర్ధం చేసుకోవాలంటే చాలా పాట్లే పడాలి. ఓర్పూ సహనం వహించినా ఒకింత కష్టమే సుమీ.!

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com