అభినవ కృష్ణదేవరాయలు...!
- October 05, 2024
ఆధునిక కాలంలో తెలుగునాట సాహితీ పరిరక్షణకు, సంఘ సంస్కరణకు పాటుపడిన మహానీయుల్లో పిఠాపురం రాజా అత్యంత ముఖ్యులు. గ్రంథిక భాషకే పరిమితం అయిన అనేక తెలుగు గ్రంథాలను, వ్యవహారిక భాషలోకి తిరిగి రాసేందుకు ఎందరో రచయితలకు సహాయ సహకారాన్ని అందించిన వ్యక్తిగా రాజా వారు చరిత్రలో నిలిచిపోయారు.నేడు అభినవ కృష్ణదేవరాయలుగా ప్రసిద్ది గాంచిన కళాప్రపూర్ణ పిఠాపురం రాజా వారి జయంతి.
పిఠాపురం రాజా పూర్తి పేరు రావు వెంకట కుమార మహీపతి సూర్యారావు బహద్దూర్. 1885, అక్టోబర్ 5న రావు వెంకట మహీపతి గంగాధర రామారావు, మంగాయమ్మ దంపతులకు పిఠాపురం పట్టణంలో జన్మించారు.తండ్రి గంగాధర రామారావు పిఠాపురం సంస్థానాధిపతిగా బాధ్యతలు నిర్వర్తిస్తూ అకాల మరణం చెందడంతో పాటు ఆస్తుల కోసం కుటుంబ వివాదాలు కోర్టుల్లో నలగడం వంటివి కారణంగా రాజా వారు బాల్యంలోనే జీవిత ఎత్తు ఫల్లాలు చవిచూశారు. కోర్టు తీర్పుతో రాజ్యాన్ని తిరిగి పొంది అతి పిన్న వయస్సులోనే పట్టాభిషిక్తుడయ్యారు.
పిఠాపురం రాజా గారు మద్రాస్ నగరంలోని ఆనాటి ప్రముఖ న్యూయింగ్టన్ కళాశాలలో చదువుకున్నారు. ఈ సమయంలోనే సంస్కృతం, తెలుగు, కన్నడం, తమిళం, ఆంగ్ల భాషల మీద పట్టు సాధించారు.జమీందారీ బాద్యతలు చేపట్టిన కొద్దీ కాలానికే తన గురువైన మొక్కపాటి సుబ్బారాయుడు గారిని దివానుగా నియాయమించుకొని ఆయన మార్గదర్శనంలో పిఠాపురం సంస్థానానాన్ని బృహత్తరంగా పాలించారు. విద్యారంగం పట్ల మక్కువ ఉన్న రాజావారు రాజమండ్రి, కాకినాడ, పిఠాపురం ప్రాంతాల్లో విద్యాసంస్థలను నిర్మించి విద్యాభివృద్ధికి తోడ్పడ్డారు. ఆయన హయాంలో స్థాపించిన కాకినాడ పిఠాపురం కళాశాల ప్రముఖ విద్యాసంస్థగా ఎందరినో ఉన్నతస్థానాలకు ఎదిగేలా తీర్చిదిద్దింది. రవీంద్రనాథ్ టాగోర్ స్థాపించిన శాంతినికేతన్ అభివృద్ధికి, కలకత్తాలోని సిటీ కాలేజి అభివృద్ధికి, రాజమండ్రిలోని ఆస్తిక కళాశాల, టౌన్ హాలు నిర్మాణానికీ ఆర్థికంగా ఆయన అందించిన సేవలు అనన్యసామాన్యమైనవి.
మొక్కపాటి వారు సంఘ సంస్కరణ పట్ల చిత్త శుద్ధితో ఉండేవారు. వారి ప్రాపకంలో రాజా సూర్యారావు సైతం అభ్యుదయ మార్గంలో అణగారిన వర్గాల ప్రజల అభ్యున్నతికై అలుపెరుగక పరిశ్రమించారు. సంఘ సంస్కరణోద్యమానికి ఆదర్శంగా నిలిచిన బ్రహ్మసమాజ ఉద్యమ ప్రాచుర్యానికి ఆయన తోడ్పాటునందించారు. దక్షిణ భారతదేశంలో ఈ ఉద్యమానికి ఎనలేని సేవచేసిన వ్యక్తిగా చరిత్రలో నిలిచారు. నభూతో నభవిష్యత్ అనే విధంగా కాకినాడలో బ్రహ్మసమాజ మందిరాన్ని నిర్మించారు. 1933లో బ్రహ్మసమాజ సూత్రధారి రాజారామ్మోహన్ రాయ్ శత వర్ధంతిని నిర్వహించారు. ఎన్నో మత సామరస్య, మానవీయ గ్రంథాల్ని ఈ సందర్భంగా ప్రచురించారు. మతసామరస్యం కోసం అంకితభావంతో శ్రమించే వీరు నాలుగవ అంతర్జాతీయ సర్వమత సమ్మేళనానికి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఈ గౌరవాన్ని పొందిన రెండవ భారతీయ రాజుగా ఘనత సాధించారు.
రాజావారు రసజ్ఞత కలిగిన కవి, రచయిత, తత్వవేత్త. నిరంతర పాఠకుడు, సద్విమర్శకుడు.అసంఖ్యాక విశిష్ట గ్రంథాలను ప్రచురించడం, సాంస్కృతిక సామాజిక వికాసానికి తోడ్పాటును అందిస్తూ ఆంధ్ర సాహిత్య పరిషత్తును మద్రాసులో స్థాపించి దానికి శాశ్వత నిధిని ఏర్పాటు చేశారు. ఆక్స్ఫర్డ్ డిక్షనరీ లాంటి సమగ్రమైన నిఘంటువు తెలుగులో కూడా అవసరమనే ఆశయంతో సూర్యరాయాంధ్ర నిఘంటువు నిర్మాణాన్ని ఒక బృహత్కార్యంగా చేపట్టి తెలుగుజాతికి అందించారు.
రాజా వారి ఆస్థాన పండితులుగా శ్రీపాద లక్ష్మీనరసింహశాస్త్రి (తర్కశాస్త్రం), తాతా సుబ్బరాయశాస్త్రి (వ్యాకరణం), చిలుకూరి నారాయణశాస్త్రి, వేదుల సూర్యనారాయణశాస్త్రి, గుదిమెళ్ల వేంకటరంగాచార్యులు (విశిష్టాద్వైతము), వడలి లక్ష్మీనారాయణశాస్త్రి (వేదం), దెందుకూరి నరసింహశాస్త్రి (వేదాంతం), తుమురాడ సంగమేశ్వరశాస్త్రి (సంగీతం) మొదలైన దిగ్దంతులు ఉండేవారు. వీరి సహకారంతో ప్రతియేటా పీఠికాపుర సంస్థాన విద్వత్పరీక్షల పేరుతో విజయదశమి నవరాత్రి ఉత్సవాల సందర్భంలో శాస్త్ర పరీక్షలు నిర్వహించి, ఉత్తీర్ణులైన వారిని కానుకలతో సత్కరించేవారు. ప్రబంధ రచనలో కూడా పోటీలు నిర్వహించేవారు. ఆనాటి సుప్రసిద్ధ పండితులు ఎందరో ఈ పరీక్షలలో బహూకృతులైనవారే. ఆయన్ని నాటి సాహితీవేత్తలు "అభినవ కృష్ణదేవరాయలు"గా కీర్తించారు.
రాజావారు ఉమ్మడి మద్రాస్ రాజకీయాల్లో సైతం క్రియాశీలకంగా వ్యవహరించారు. ఉమ్మడి మద్రాస్ అసెంబ్లీకి ఎన్నికైన రాజావారు, ప్రజా సంక్షేమం కోసం, నిమ్న వర్గాల అభ్యున్నతికి పాటుపడ్డారు. ముఖ్యంగా నిమ్న వర్గాలైన హరిజన కులాల వారి పేరు చివరన ‘గాడు’ అని చేర్చి అవమానంగా పిలవడాన్ని నిషేధించాలనే బిల్లును ప్రవేశపెట్టి, విజయం సాధించారు. సమాజంలో పేరుకుపోయిన అంటరానితనం, అస్పృశ్యత, మూఢాచారాలను రూపుమాపేందుకు కృషి చేశారు. క్షిణ భారతదేశంలోనే మొట్టమొదటి అనాథాశ్రమంగా కరుణాలయం (అనాథాశ్రమం అని పిలవడం ఇష్టం లేక ఈ పేరు పెట్టారు) స్థాపించారు.
పిఠాపురం రాజావారు సమాజ హితం, సాహిత్య అభివృద్ధి కోసం చేసిన కార్యక్రమాలను దృష్టిలో పెట్టుకొని 1929లో నాటి మద్రాస్ బ్రిటిష్ గవర్నర్ వెల్లింగ్టన్ "మహారాజా" బిరుదును ప్రదానం చేశారు. తెలుగు సాహిత్య రంగానికి ఆంధ్ర విశ్వవిద్యాలయం వారు 1938లో గౌరవ డి.లిట్. పట్టా ప్రదానం,1953లో కళాప్రపూర్ణ బిరుదుతో సత్కరించారు.
భాషాభివృద్ధి, సాహిత్యం, సంగీతం, తర్కం, తత్వశాస్త్రం, ఆధ్యాత్మికం, క్రీడలు, రాజకీయాలు, సేవా రంగం, సాంస్కృతిక కార్యక్రమాలు వంటి వివిధాంశాల్లో ఎనలేని సేవలందించి తెలుగునాట సాంస్కృతిక పునరుజ్జీవనానికి అనితరసాధ్యమైన కృషి చేసిన పిఠాపురం మహారాజా సూర్యారావు 1964, మార్చి 6న తన 79 యేట కన్నుమూశారు.
--డి.వి.అరవింద్(మాగల్ఫ్ ప్రతినిధి)
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!