సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన సౌదీ నుంచి స్వదేశానికి చేరిన నిర్మల్ జిల్లావాసి

- October 05, 2024 , by Maagulf
సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన సౌదీ నుంచి స్వదేశానికి చేరిన నిర్మల్ జిల్లావాసి

హైదరాబాద్: కువైట్-సౌదీ అరేబియా సరిహద్దుల్లోని ఎడారిలో ఒంటెల కాపరిగా కష్టాలు అనుభవించిన నిర్మల్ జిల్లావాసి రాథోడ్ నాందేవ్ సీఎం ఏ.రేవంత్ రెడ్డి చొరవతో ఇటీవల రియాద్ నుంచి హైదరాబాద్ కు క్షేమంగా చేరుకున్నాడు. నిర్మల్‌ జిల్లా ముధోల్ మండలం రూవి గ్రామానికి చెందిన రాథోడ్‌ నాందేవ్‌ అనే గిరిజనుడు ఇంటిపని వీసాపై కువైట్‌ వెళ్లాడు.అరబ్బు యజమాని అతన్ని కువైట్‌ నుంచి అక్రమంగా సౌదీకి తరలించి ఒంటెల కాపరి పని చేయించాడు. యజమాని హింసను తట్టుకోలేకపోతున్నానని, నిత్యం నరకం అనుభవిస్తున్నానని, ఎడారి నుంచి నన్ను రక్షించండి అంటూ రాథోడ్ నాందేవ్ ఆగస్టులో సీఎం రేవంత్ రెడ్డిని వేడుకుంటూ కన్నీరుమున్నీరుగా విలపిస్తూ పంపిన ఒక సెల్ఫీ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది.

సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు తెలంగాణ జీఏడీ ఎన్నారై శాఖ అధికారులు కువైట్, సౌదీ అరేబియా రెండు దేశాల్లోని ఇండియన్ ఎంబసీలతో, అక్కడి సామాజిక సేవకులతో, ఢిల్లీలోని విదేశాంగ శాఖతో సమన్వయం చేసి నాందేవ్ ను రక్షించి స్వదేశానికి వచ్చేలా చేశారు.ఈ సందర్బంగా మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ అనిల్ ఈరవత్రి, కాంగ్రెస్ ఎన్నారై సెల్ నాయకులు మంద భీంరెడ్డి, చెన్నమనేని శ్రీనివాస రావు, స్వదేశ్ పరికిపండ్ల, నంగి దేవేందర్ లతో పాటు గల్ఫ్ బాధితుడు రాథోడ్ నాందేవ్ తన కుటుంబ సభ్యులతో శనివారం ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డిని హైదరాబాద్ లోని ఆయన నివాసంలో కలిసి కృతజ్ఞతలు తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com