గొప్ప వైవిధ్యాన్ని ప్రదర్శిస్తున్న ఆంధ్రప్రదేశ్ చేనేత, హస్తకళలు

- October 07, 2024 , by Maagulf
గొప్ప వైవిధ్యాన్ని ప్రదర్శిస్తున్న ఆంధ్రప్రదేశ్ చేనేత, హస్తకళలు

న్యూ ఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌ చేనేత వస్త్రాలు,హస్తకళలు గొప్ప వైవిధ్యాన్ని ప్రదర్శిస్తున్నాయని భారత ప్రభుత్వ చేనేత మంత్రిత్వ శాఖ అభివృద్ది కమిషనర్ డాక్టర్ ఎం.బీనా అన్నారు.ఆంధ్రప్రదేశ్ చేనేత వస్ర్తాలు సరసమైన ధరను కలిగి ఉన్నాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వ చేనేత, జౌళి శాఖ దసరా వేడుకల నేపధ్యంలో న్యూఢిల్లీ జనక్‌పురిలోని డిల్లీ హాట్‌లో ఏర్పాటు చేసిన చేనేత, హస్తకళ ప్రదర్శనను కమీషనర్ సోమవారం ప్రారంభించారు. అక్టోబరు 20 వరకు 2 వారాలు పాటు ఈ ప్రదర్శన, అమ్మకం జరగనున్నాయి.ఈ సందర్భంగా డాక్టర్ బీనా మాట్లాడుతూ ఆంధ్ర ప్రదేశ్ పత్తి ఎంతో నాణ్యత కలిగి ఉంటుందని, తద్వారా మంచి డిమాండ్ పొందగలుగుతుందని, అదే రీతిన చేనేత వస్త్రాలు కూడా ఉన్నాయన్నారు.రాష్ట్ర చేనేత, జౌళి శాఖ ముఖ్య కార్యదర్శి సునీత మాట్లాడుతూ నేత కార్మికులు, చేతివృత్తుల వారి ఉత్పత్తులకు తగిన మద్దతు ఇవ్వడం, నిరంతర ఉపాధిని సృష్టించటమే ధ్యేయంగా ఈ ప్రదర్శనలు నిర్వహిస్తున్నామన్నారు.నేత కార్మికులు ఈ రంగంలో తమ జీవనోపాధిని కొనసాగించగలిగేలా వారికి అమ్మకాల మద్దతు అత్యావశ్యకమన్నారు. 

రాష్ట్ర చేనేత, జౌళి శాఖ కమీషనర్ జి. రేఖా రాణి ఆంధ్రప్రదేశ్ చేనేత,హస్తకళల వారసత్వాన్ని ఆవిష్కరించారు.ఆంధ్రుల చేనేత, హస్తకళలను కొనుగోలు చేయడానికి ఢిల్లీ ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.ఎగ్జిబిషన్‌లో మొత్తం 26 స్టాళ్లను ఏర్పాటు చేయగా, 20 చేనేత, 6 హస్తకళల స్టాళ్లు ఉన్నాయి.గద్వాల్, ధర్మవరం పట్టు చీరలు, కలంకారి ఉత్పత్తులు, పోలవరం, ఉప్పాడ జమధాని, అంగర, కుప్పడం, వెంకటగిరి, బొబ్బిలి చీరలు, పొందూరు ధోతీలు ప్రదర్శనలో ఆహుతులను ఆకర్షిస్తున్నాయి. ఉన్నాయి. బెడ్ షీట్లు, తువ్వాళ్లు, దుప్పట్లు, వాల్ హ్యాంగింగ్‌లు, గృహోపకరణాలు ప్రదర్శించబడ్డాయి.హస్తకళల స్టాల్స్ లో చెక్క బొమ్మలు, తోలుబొమ్మలాట, కలంకారి బ్లాక్ ప్రింటింగ్ వంటి విలక్షణమైన ఉత్పత్తులను ప్రదర్శిస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com