దర్శక ధీరుడు... !

- October 10, 2024 , by Maagulf
దర్శక ధీరుడు... !

తెలుగు సినిమా గతిని మార్చి.. పాన్ ఇండియా లెవల్లో తెలుగు చిత్ర ఘనతను చాటి చెప్పాడు దర్శకధీరుడు రాజమౌళి. తెలుగు చలన చిత్ర పరిశ్రమ గర్వించదగ్గ ‘ఆర్‌ఆర్‌ఆర్‌’, ‘బాహుబలి’ వంటి గొప్ప చిత్రాలను తెరకెక్కించి ప్రపంచ వ్యాప్తంగా తెలుగోడి సత్తా ఎంతో చూపించారు రాజమౌళి. ఈ రోజు ప్రపంచం నలుమూలల ఉన్న ప్రతి ఒక్కరూ రాజమౌళి అంటే గుర్తుపట్టే విధంగా క్రేజ్ అందుకున్నారు.  రాజమౌళి సినిమా అంటే ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది అభిమానులు ఎదురుచూస్తే స్థాయికి ఎదిగారు. సహాయ దర్శకుడిగా సినీ జీవితాన్ని మొదలు పెట్టి కళామతల్లి గర్వించే స్థాయికి చేరుకున్నారు. నేడు దర్శక ధీరుడు రాజమౌళి  జన్మదినం.

జక్కనగా పిలుచుకునే ఎస్.ఎస్.రాజమౌళి పూర్తి పేరు కోడూరి శ్రీశైల శ్రీ రాజమౌళి. 1973 అక్టోబర్ 10న కర్ణాటకలోని రాయచూరు జిల్లా హిరేకోటికల్ గ్రామంలో విజయేంద్ర ప్రసాద్, రాజా నందిని దంపతులకు జన్మించారురాజమౌళి తండ్రి రాజమండ్రి దగ్గర్లోని కొవ్వూరు పట్టణం కాగా, తల్లి ది విశాఖపట్నం.వీరి  తల్లిదండ్రులు కులాంతర వివాహం చేసుకున్న తర్వాత తమ బంధువులు ఉన్న కర్ణాటకలోని రాయచూరు జిల్లాలోని హిరేకోటికల్ గ్రామంలో వ్యవసాయం చేసుకుంటూ స్థిరపడ్డారు.వ్యవసాయంలో నష్టం రావడంతో విజయేంద్రప్రసాద్ మద్రాస్ వెళ్లి సినిమాల్లో ఘోస్ట్ రైటర్‌గా స్థిరపడ్డారు.

తండ్రి తర్వాత పెదనాన్న కుమారుడైన కీరవాణి  సినిమాల్లో మ్యూజిక్ డైరెక్టర్ గా స్థిరపడటంతో రాజమౌళికి చదువుకన్నా సినిమాల మీద ధ్యాస ఎక్కువైంది. ఇంటర్ తర్వాత అప్పటికే సినిమా రంగంలో రచయితగా స్థిరపడ్డ తండ్రి విజయేంద్ర ప్రసాద్ వద్ద స్క్రిప్ట్ రైటింగ్ మెళుకువలు నేర్చుకున్నా, అందులో సక్సెస్ కాలేకపోయారు. చివరికి హైదరాబాద్ చేరుకొని తమ బంధువైన గుణ్ణం గంగరాజు వద్ద యాడ్ ఫిలిం మేకింగ్ లో శిక్షణ పొంది, దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు పర్యవేక్షణలో కొన్ని జన్మభూమి, దీపం వంటి ప్రభుత్వ యాడ్స్ కు దర్శకత్వం వహించారు. రాఘవేంద్రరావు నిర్మాతగా ముళ్ళపూడి రమణ కుమారుడు వరతో కలిసి ఈటీవీలో శాంతినివాసం సీరియల్ రూపొందించారు.

సినిమాల మీద రాజమౌళి ఆసక్తిని గమనించిన రాఘవేంద్రరావు, తాను నిర్మించబోయే ‘స్టూడెంట్ నెం.1’ చిత్రానికి దర్శకుడిగా అవకాశం ఇచ్చారు.జూనియర్ ఎన్టీఆర్ నటించిన ఈ చిత్రం హిట్ టాక్ తెచ్చుకుంది. ఆ తర్వాత రాజమౌళి వెనుదిరిగి చూసుకోలేదు. తన రెండవ చిత్రం జూనియర్ ఎన్టీఆర్ తోనే 2003లో సింహాద్రి తీసి టాలీవుడ్ ఇండస్ట్రీ రికార్డులను తిరగరాశాడు.సింహాద్రి చిత్రం 175 కేంద్రాల‌లోశ‌త‌దినోత్స‌వం జ‌రుపుకుంది. 50కి పైగా కేంద్రాల‌లో 175 రోజులు ఆడింది.ఇప్ప‌టికీ సిల్వ‌ర్ జూబ్లీస్ లో ఇదే రికార్డ్! ఆ ఘ‌న‌విజ‌యం చూసిన త‌రువాత రాజ‌మౌళి సినిమాల‌కు ఓ స్పెష‌ల్ క్రేజ్ నెల‌కొంది.

 సింహాద్రి తర్వాత నితిన్‌తో ‘సై’ చిత్రం తీశారు.  ‘సై’ మూవీలో కాలేజీ దోస్తీని, లోకల్ రాజకీయాలను రగ్బీ ఆటతో ముడిపెట్టి యూత్‌లో క్రేజ్ తెచ్చుకున్న రాజమౌళి, తర్వాత సినిమా ‘ఛత్రపతి’లో ప్రభాస్ మాచో హీరోయిజంను, మదర్ సెంటిమెంటుతో మిక్స్ చేసి మరో సక్సెస్ అందుకున్నారు. రవితేజ హీరోగా 'విక్రమార్కుడు' లాంటి పక్కా మాస్ మసాలా సినిమాకు పవర్ పుల్ పోలీస్ స్టోరీని యాడ్ చేసి బ్లాక్ బస్టర్  ఇచ్చారు. ఈ  సినిమాతో మిగతా భాషల ఇండస్ట్రీల కళ్లల్లో పడ్డారు. తమిళం, హిందీ, కన్నడ, బెంగాళీలో ఈ చిత్రం రీమేక్ అయి అక్కడ కూడా హిట్ అయ్యింది.

తన లక్కీ హీరో ఎన్టీఆర్‌తో సోషియో ఫాంటసీ 'యమదొంగ' తీసి వరుసగా ఆరో హిట్ ఆరో హిట్ అందుకున్నారు రాజమౌళి. తండ్రి విజయేంద్ర ప్రసాద్ రాసుకున్న మగధీర కథను మెగాస్టార్ చిరంజీవి తనయుడు రామ్‌చరణ్‌ హీరోగా తెరకెక్కించి మరో ఇండస్ట్రీ హిట్ కొట్టారు. ఈ చిత్రంతోనే హీరోగా రామ్‌చరణ్‌, హీరోయిన్ కాజల్ తమ తోలి సక్సెస్ అందుకున్నారు. నిర్మాత అల్లు అరవింద్ మగధీర 50వ రోజు సందర్భంగా హీరో రామ్ చరణ్‌తోపాటూ రాజమౌళి కూడా గుర్రపు స్వారీ చేస్తున్న పోస్టర్ వేయించారు.

 హీరోలతోనే కాదు క‌మెడియ‌న్స్ తోనూ బంప‌ర్ హిట్ కొట్ట‌గ‌ల‌న‌ని మ‌ర్యాద‌రామ‌న్న‌తో నిరూపించుకున్నారు రాజ‌మౌళి. ఆపై గ్రాఫిక్ మాయాజాలంతో తెర‌కెక్కించిన ఈగ‌ కూడా విశేషాద‌ర‌ణ చూర‌గొంది. చిత్ర‌మేంటంటే, రాజ‌మౌళి సినిమాల‌తో బంప‌ర్ హిట్స్ చూసిన హీరోలెవ్వ‌రికీ త‌రువాత న‌టించిన చిత్రాలు క‌ల‌సి రాలేదు. అదో సెంటిమెంట్ గా మారిపోయింది. రాజ‌మౌళితో హిట్ కొట్టిన హీరో త‌రువాతి చిత్రం ఫ్లాప్ అని డిసైడ్ అయి పోవాల‌ని చాలామంది అంటూ ఉంటారు.

రాజ‌మౌళి సినిమాల్లో న‌టించేవారికి సెంటిమెంట్ ఎలా ఉన్నా, ఆయ‌న మాత్రం కొన్ని చెరిగిపోని సెంటిమెంట్స్ ను చెరిపేశారు. తెలుగులో జాన‌ప‌ద చిత్రాలకు అంత ఆద‌ర‌ణ ఉండ‌దు అని జ‌నం అనుకుంటున్న స‌మ‌యంలో బాహుబ‌లి వంటి భారీ జాన‌ప‌దాన్ని జ‌నం ముందు నిలిపి, వారి మ‌దిని గెలిచారు రాజ‌మౌళి. బాహుబ‌లి- ద బిగినింగ్ చిత్రం అనూహ్య విజ‌యం సాధించింది. వ‌సూళ్ల ప‌రంగా త‌రిగిపోని, చెరిగిపోని రికార్డులు నెల‌కొల్పింది.

బాహుబ‌లి- ద కంక్లూజ‌న్ స‌మ‌యంలో మ‌ళ్ళీ సెంటిమెంట్స్ మోత మోగింది. అదేమిటంటే తెలుగులో సీక్వెల్స్ హిట్ కావు. అందుకు కొన్ని ఉదాహ‌రణ‌లు చూపించారు. ఆ సెంటిమెంట్ ను కూడా చెరిపేస్తూ బాహుబ‌లి-ద కంక్లూజ‌న్ మొద‌టి భాగం కంటే మిన్న‌గా విజ‌యం సాధించింది. బాహుబ‌లి రెండో భాగం నెల‌కొల్పిన రికార్డులు ఈ నాటికీ సుస్థిరంగా ఉన్నాయి. అందువ‌ల్లే ఇప్పుడు ఎవ‌రైనా ఓ రికార్డును సాధిస్తే, నాన్ బాహుబ‌లి రికార్డ్ అంటూ పేర్కొంటున్నారు. అంతే త‌ప్ప బాహుబ‌లిని అధిగ‌మించ‌లేక‌పోతున్నారు.

తన తదుపరి చిత్రంగా 2017 మార్చి 18న ఆర్ఆర్ఆర్ సినిమా చేస్తున్నట్లు రాజమౌళి, తారక్, రామ్ చరణ్ కలిసి ఒక ఫొటో దిగి ప్రకటించారు. ఆ తర్వాత 2018 మార్చి 22న దీన్ని అధికారికంగా ప్రకటించారు. 2020లో కరోనా వల్ల ఆర్ఆర్ఆర్ విడుదల వాయిదా పడుతూవచ్చింది. కరోనా తర్వాత థియేట‌ర్ల‌కు మునుప‌టి క‌ళ తీసుకు వచ్చిన చిత్రం ఆర్.ఆర్.ఆర్ అని చెప్పాల్సిన పనిలేదు. ఈ చిత్రం వసూళ్లు పరంగానే కాకుండా, ఇండియన్ సినిమా స్థాయిని పెంచిన చిత్రంగా ప్రశంసలు అందుకుంది. ముఖ్యంగా ఈ చిత్రంలోని నాటు నాటు పాటకు ఆస్కార్ అవార్డు రావడం విశేషం. ఆర్ఆర్ఆర్ తర్వాత సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా సినిమాను తెరకెక్కించేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు.

స్టార్‌డమ్‌కు విలువిస్తానని చెబుతూనే, దానికంటే కథ ముఖ్యమని బలంగా నమ్ముతారు రాజమౌళి. అందుకే రజనీకాంత్, ఆమిర్ ఖాన్ లాంటి హీరోలు ఆఫర్ ఇచ్చినా, మనం తీయాలంటే వాళ్లకు తగిన కథలు ఉండాలి కదా, అందుకే ముందుకెళ్లలేదని చెప్పారు.హీరోల స్టార్‌డమ్‌ను వరుసగా ఉన్న జీరోల్లా వర్ణించే రాజమౌళి, దాని ముందు ఒకటి అనే మంచి కథను పెట్టినప్పుడే ఆ స్టార్‌డమ్‌కు లక్షలు, కోట్ల విలువ వస్తుందంటారు. కథ మీద దృష్టి పెట్టకుండా హీరోల స్టార్ డమ్‌ను నమ్ముకుని సినిమా చేయలేనని గట్టిగా చెబుతారు ఈ దర్శకుడు.రచయిత ఊహను మించి కథను అద్భుతంగా తెరకెక్కిస్తారని తన తండ్రి దగ్గరే ప్రశంసలు అందుకున్నారు.

దర్శకుడిగా తానూ ఈ స్థాయి విజయాలు అందుకోడం వెనుక తన బలం, బలగం తన కుటుంబమే అంటారు రాజమౌళి. ఆయన సినిమాలకు తండ్రి విజయేంద్ర ప్రసాద్ కథ అందిస్తుంటారు. రాజమౌళి తొలి సినిమా నుంచీ పెద్దన్న కీరవాణి ఆయనకు సంగీతం అందిస్తూ వస్తున్నారు. ఇక రాజమౌళి భార్య రమా రాజమౌళి ఆయన సినిమాలకు కాస్ట్యూమ్స్ డిజైనర్‌గా పనిచేస్తుంటే.. కీరవాణి భార్య శ్రీవల్లీ కీరవాణి, వారి కొడుకు కాలభైరవ కూడా ఆయన టీమ్ లో భాగమయ్యారు.

ప్రతి సినిమాకు ముందూ, ఆ తర్వాత కుటుంబ సభ్యులందరితో కలిసి చర్చిస్తానని ఆయన చెబుతారు. అందరికీ ఒక కథ నచ్చి సినిమా తీసేద్దాం అనుకుంటేనే అది సెట్స్ పైకి వెళ్తుందని, అది చిన్నదైనా, పెద్దదైనా కామెడీ అయినా, మాస్ అయినా తీసేయాలనుకుంటానని రాజమౌళి చెబుతారు. హీరో గురించి, మార్కెట్ గురించి ఆ తర్వాతే ఆలోచిస్తానని అంటారు. ఒక ప్రాజెక్ట్ పూర్తి చేయందే.. ఇంకో ప్రాజెక్ట్ గురించి ఆలోచించరు రాజమౌళి. ఒక సినిమా పూర్తయి విడుదలైన తరువాతే మరో సినిమా గురించి ఆలోచిస్తారు.

తనతో సినిమా చేయాలనుకునే నిర్మాతలు డబ్బు సంపాదనకంటే, తన కథకు కనీసం ఒక్క శాతం అయినా ఎక్కువ విలువ ఇవ్వాలనుకుంటారు. తనతో పనిచేసే నిర్మాతకు మంచి సినిమా తీయాలనే తపన ఉండాలనుకుంటారు.నిర్మాతలకు లాభాల భరోసాను ఇచ్చే ఈ దర్శకుడు, డబ్బు సంపాదించమే తన లక్ష్యం కాదంటారు. అలాగని, డబ్బు వద్దనుకునే యోగిని కూడా కానని రాజమౌళి నిర్మొహమాటంగా చెబుతారు.

భారత చలన చిత్ర పరిశ్రమలో ఇంత‌టి ఘ‌న‌వైభవం చూసిన ద‌ర్శ‌కుడు ఈ మ‌ధ్య‌కాలంలో, అందునా క‌రోనా కాలంలో మ‌రొక‌రు కాన‌రావ‌డం లేద‌ని సినీవిశ్లేష‌కులు అంటున్నారు. ఏది ఏమైనా రాజ‌మౌళి జైత్ర‌యాత్ర మ‌రికొంత‌కాలం కొన‌సాగుతూనే ఉంటుంద‌ని చెప్ప‌వ‌చ్చు. 

--డి.వి.అరవింద్(మాగల్ఫ్ ప్రతినిధి)

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com