ఏపీలో కుండపోత వర్షాలు, అవసరమైతే ఆర్టీసీ అద్దె బస్సులు తీసుకోండి

- October 15, 2024 , by Maagulf
ఏపీలో కుండపోత వర్షాలు, అవసరమైతే ఆర్టీసీ అద్దె బస్సులు తీసుకోండి

అమరావతి: అల్పపీడన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లోని కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని అత్యవసర వరద సహాయ నిధులను విడుదల చేస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తెలిపారు. ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, కడప జిల్లాలకు కోటి రూపాయల చొప్పున అత్యవసర నిధులు మంజూరు చేస్తున్నట్లు  తెలిపారు. ఇంకా వర్ష ప్రభావిత ప్రాంతాల్లో అధికారులు అప్రమత్తంగా ఉండి, ప్రజలకు అవసరమైన సహాయాన్ని అందించాలని ఆదేశాలు జారీ చేశారు. ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండి, అధికారుల సూచనలను పాటించాలని విజ్ఞప్తి చేశారు.

భారీ వర్షాలు కురుస్తున్న ప్రాంతాల్లో అత్యవసర నిధులతో రిలీఫ్ క్యాంపులు ఏర్పాటు చేయడం, రక్షిత తాగునీరు, ఆహారం, హెల్త్ క్యాంపులు, శానిటేషన్ కోసం ఈ నిధులను వినియోగించాలని అధికారులకు సూచించారు. వరద ముంపు ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అవసరం అయితే ఆర్టీసీ బస్సులను అద్దెకు తీసుకోవాలని అధికారులకు ఆదేశం ఇచ్చారు. ప్రజలకు ఎక్కడ ఏ సమస్య వచ్చినా అధికారులు హుటాహుటిన స్పందించాలని అధికారులకు సీరియస్ ఆదేశాలు ఇచ్చారు.

ప్రస్తుతం బంగాళాఖాతంలో ప్రస్తుతం అల్పపీడనం కొనసాగుతోంది. ఇది 48 గంటల్లో వాయుగుండంగా మారే అవకాశం ఉంది. వాయుగుండం పశ్చిమ-వాయువ్య దిశగా కదిలి, ఉత్తరతమిళనాడు మరియు దక్షిణకోస్తా తీరం వైపు కదిలే అవకాశం ఉంది. దీని ప్రభావంతో ఈ రోజు మరియు రేపు కోస్తా మరియు రాయలసీమ ప్రాంతాల్లో విస్తృతంగా వర్షాలు పడే అవకాశం ఉంది. ఇంకా ఆంధ్రప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.

పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లో ఈ రోజు భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో కూడా భారీ వర్ష సూచన ఉంది. మిగతా జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది.

తీరం వెంబడి గంటకు 35-55 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయి. మత్స్యకారులు వేటకు వెళ్లరాదని హెచ్చరిక జారీ చేయబడింది.
ఈ సమాచారం ప్రకారం, వాతావరణ పరిస్థితులు తీవ్రంగా ఉండే అవకాశం ఉంది కాబట్టి, ప్రజలు జాగ్రత్తగా ఉండాలి.

--వేణు పెరుమాళ్ల (మాగల్ఫ్ ప్రతినిధి)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com