ఎయిరిండియా దీపావళి ఆఫర్..

- October 15, 2024 , by Maagulf
ఎయిరిండియా దీపావళి ఆఫర్..

ముంబై: విమాన ప్రయాణికులకు గుడ్ న్యూస్..దీపావళి పండుగ సందర్భంగా విమానాయన సంస్థ ఎయిరిండియా టికెట్ల ధరలను భారీగా తగ్గించింది. పలు మార్గాల్లో వెళ్లే విమాన ప్రయాణికులకు ఈ డిస్కౌంట్ ఛార్జీలు వర్తిస్తాయి. సాధారణంగా విమాన ప్రయాణదారులకు ప్రతి సంవత్సరం పండుగల సీజన్‌లో విమానయాన సంస్థలు టికెట్ల ఛార్జీలను వేగంగా పెంచుతాయి. చాలా సార్లు, పండుగల సమయంలో రెట్టింపు ఛార్జీలతో ప్రయాణించాల్సి వచ్చింది. కానీ, ఈసారి విమాన చార్జీలను భారీగా తగ్గించాయి.

విమాన ప్రయాణికులందరికీ దీపావళి కానుకగా టికెట్లపై భారీ డిస్కౌంట్లను అందిస్తున్నాయి. చమురు ధరల తగ్గుదల కూడా ఇందుకు కారణంగా చెప్పవచ్చు. నివేదిక ప్రకారం.. ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, బెంగళూరు వంటి నగరాల మధ్య విమాన ఛార్జీలు గత సంవత్సరంతో పోలిస్తే వేగంగా తగ్గాయి. అయినప్పటికీ, కొన్ని మార్గాల్లో ఛార్జీలు వేగంగా పెరిగాయి. అంతేకాకుండా, అనేక విమానయాన సంస్థల ప్రయాణీకుల సామర్థ్యంతో పాటు అనేక ప్రయోజనాలను కూడా పొందుతున్నారు. వివిధ మార్గాల్లో విమాన ఛార్జీలు దాదాపు 25 శాతం తగ్గాయి.

25 శాతం తగ్గిన విమాన ఛార్జీలు:
ట్రావెల్ పోర్టల్ ఇక్సిగో నివేదిక ప్రకారం.. దేశీయ మార్గాల్లో విమాన ఛార్జీలు 20శాతం నుంచి 25 శాతం తగ్గాయి. వన్-వే జర్నీకి ఈ ఛార్జీ వర్తిస్తుంది. ఒక నెల క్రితమే బుకింగ్‌ల ఆధారంగా కంపెనీ ఈ నివేదికను సిద్ధం చేసింది. దీని ప్రకారం.. బెంగళూరు-కోల్‌కతా మార్గంలో గరిష్ట ఛార్జీలు తగ్గాయి. గతేడాది ఈ రెండు నగరాల మధ్య విమాన ప్రయాణ ధర రూ.10,195గా ఉంది. ఈ ఏడాది కేవలం రూ.6,319కే ప్రయాణించవచ్చు. ఫలితంగా ఈ రెండు నగరాల మధ్య విమాన ధరలు గతేడాదితో పోలిస్తే.. దాదాపు 38 శాతం తగ్గాయి.

30శాతానికి పైగా తగ్గిన ఛార్జీలు:
చెన్నై నుంచి కోల్‌కతా మార్గంలో విమాన ఛార్జీలు దాదాపు 36 శాతం మేర తగ్గాయి. గత ఏడాది రూ.8,725గా ఉన్న ఛార్జీలు ఈ ఏడాదిలో రూ.5,604 మాత్రమే ఖర్చవుతోంది. ముంబై-ఢిల్లీ మధ్య ఛార్జీలు కూడా దాదాపు 34 శాతం తగ్గాయి. గతేడాది ఈ రెండు నగరాల మధ్య విమాన చార్జీ రూ.8,788 ఉండగా, ఇప్పుడు రూ.5,762గా ఉంది. మరోవైపు ఢిల్లీ-ఉదయ్‌పూర్ మధ్య రూ.11,296 నుంచి రూ.7,469కి తగ్గింది. గతేడాదితో పోలిస్తే.. దాదాపు 34 శాతం క్షీణత నమోదైంది. ఢిల్లీ-కోల్‌కతా, హైదరాబాద్-ఢిల్లీ, ఢిల్లీ-శ్రీనగర్ రూట్లలో ఛార్జీలు దాదాపు 32 శాతం తగ్గాయి.

భారీగా పెరిగిన విమాన ఛార్జీలు:
ఇక్సిగో గ్రూప్ సీఈఓ అలోక్ బాజ్‌పాయ్ ప్రకారం.. గత ఏడాది ఇదే సమయంలో గో ఫస్ట్ ఎయిర్‌లైన్ నిలిచిపోయింది. చమురు ధరలు కూడా గతేడాది కన్నా దాదాపు 15 శాతం తక్కువగా ఉన్నాయి. అయినప్పటికీ కూడా విమాన ఛార్జీలు వేగంగా పెరిగాయి. ఇందులో అహ్మదాబాద్-ఢిల్లీ మార్గంలో 34 శాతం ఛార్జీలు పెరిగాయి. గతేడాది ఈ మార్గంలో టికెట్ ధర రూ.6,533 వెచ్చించాల్సి ఉంది.ఈసారి రూ.8,758కే టికెట్ చెల్లించాల్సి వచ్చింది.అంతేకాదు.. ముంబై-డెహ్రాడూన్ మార్గంలో రూ.11,710 నుంచి రూ.15,527కి పెరిగింది. ఇందులో దాదాపు 33 శాతం పెరిగింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com