లేడీ కమల్ హాసన్ - జ్యోతిక
- October 18, 2024
జ్యోతిక... ఈ పేరుకే ఎంతోమంది అభిమానులు ఉన్నారు. తమిళ సినిమాల్లోనే ఎక్కువగా నటించినా, తెలుగు ప్రేక్షకులకూ ఈమె సుపరిచితురాలే. భిన్నమైన పాత్రలతో అలరించారు. తనదైన నటనతో ఎంతో మంది అభిమానుల మనసులో చోటు సంపాదించుకున్నారు. జ్యోతిక నటించిన ఎన్నో చిత్రాలు తెలుగులో డబ్ అయ్యాయి. ముద్దుగా బొద్దుగా ఉన్నా, నటనతోనూ, నర్తనంతోనూ మురిపించారు. పెళ్ళైన తర్వాత కొంత కాలం విరామం తీసుకున్నా, ప్రస్తుతం మళ్ళీ సినిమాల్లో నటిస్తూ తనదైన బాణీ పలికిస్తూ సాగుతున్నారు జ్యోతిక. నటిగానే కాకుండా.. నిర్మాతగా కూడా, పలు సినిమాలను నిర్మించి సక్సెస్ అయ్యారు. నేడు 'లేడీ కమల్ హాసన్' గా నీరాజనాలు అందుకుంటున్న సీనియర్ యాక్ట్రెస్ జ్యోతిక పుట్టినరోజు సందర్భంగా ప్రత్యేక కథనం మీ కోసం..
జ్యోతిక పూర్తి పేరు జ్యోతిక సదానా.1977, అక్టోబర్ 18న చందర్ సదానా,సీమ దంపతులకు ముంబైలో జన్మించారు. ముంబైలోని లెర్నర్స్ అకాడమీలో పాఠశాల విద్యాభ్యాసం, మితిబాయి కాలేజ్ నుంచి సైకాలజీలో డిగ్రీ పూర్తి చేశారు. సీనియర్ హీరోయిన్ నగ్మా ఈమెకు హాఫ్ సిస్టర్. జ్యోతికకు సినిమాలు అంటే చిన్నతనం ఆసక్తి ఉడటంతో పాటుగా తన అక్క నగ్మా అప్పటికే బాలీవుడ్ మరియు దక్షిణాది చిత్రాల్లో టాప్ హీరోయిన్ గా రాణిస్తుండడం ఆమెను ఇండస్ట్రీవైపు నడిపించాయి.
1998లో బాలీవుడ్లో వచ్చిన ‘డోలీ సజా కే రఖ్నా’ అనే చిత్రంతో సినీ కెరీర్‌ను ప్రారంభించారు. కానీ ఈ సినిమా జ్యోతికకు పెద్దగా పేరు తీసుకురాలేకపోయింది. ఆ తర్వాత నుంచి ఆమె తమిళ సినీ ప్రస్థానం ప్రారంభించింది. 1999లో వచ్చిన ‘వాలి’ చిత్రంలో నటించింది. ఈ సినిమాకు గానూ బెస్ట్ ఫీమేల్ డెబ్యూ కేటగిరీలో ఫిలింఫేర్ అవార్డును అందుకుంది. అక్కడి నుంచి జ్యోతికకు వెనక్కి తిరిగి చూసుకునే అవసరం రాలేదు. వరుసగా తమిళ చిత్ర సీమను ఏలేశారు. జ్యోతికను చూసి మన తెలుగు దర్శక, నిర్మాతలు కూడా ఫిదా అయ్యారు.
ప్రభుదేవా ఆయన సోదరులు రాజు సుందరం, నాగేంద్రప్రసాద్ కలసి నటించిన ‘1 2 3’ చిత్రంలో జ్యోతిక నటించింది. ఈ చిత్రం తమిళ, తెలుగు, హిందీ భాషల్లో రూపొందింది. 2003లో వచ్చిన ‘ఠాగూర్’ సినిమాలో తొలి అవకాశంలోనే మెగాస్టార్ చిరంజీవికి జోడీగా నటించే అవకాశం దక్కించుకుంది. ఆ తర్వాత ‘మాస్’, ‘షాక్’ చిత్రాల్లో నటించింది. జ్యోతిక నటించింది మూడు తెలుగు సినిమాల్లోనే అయినా ఆమె ప్రేక్షకులకు చాలా దగ్గరయ్యారు. స్టాలిన్, శ్రీ రామదాసు, లక్ష్మీ, ఆడవారి మాటలకు అర్ధాలే వేరులే సినిమాల్లో జ్యోతిక నటించాల్సింది. అప్పటికే తన పెళ్లి వల్ల ఈ అవకాశాలను తిరస్కరించింది. అందుకే ఆమె నటించే ప్రతీ తమిళ సినిమాను తెలుగులోనూ విడుదల చేస్తూ వచ్చారు.
2003లో విక్రమ్‌తో ధూల్, సూర్యతో కాక కాక, విజయ్‌తో తిరుమలై సినిమాలలో నటించింది. ఇవన్నీ బాక్సాఫీసు వద్ద విజయాలను అందుకున్నాయి. వాటిలో కాక కాక సినిమా అయితే ఆమె కెరీర్లో పెద్ద హిట్టుగా నిలిచింది. ధూల్, కాక కాక సినిమాలకు దక్షిణాది ఫిలింఫేర్ అవార్డులకు నామినేట్ అయింది. ఉత్తమ నటిగా అంతర్జాతీయ తమిళ చలనచిత్ర ప్రత్యేక జ్యూరీ అవార్డును అందుకుంది. ఈ మూడు, ఆ సంవత్సరం టాప్ సినిమాల జాబితాలో చోటు దక్కించుకున్నాయి. ప్రముఖ ఆంగ్ల దినపత్రిక ది హిందూ.. కోలీవుడ్ తిరుగులేని రాణి అని జ్యోతికను ప్రశంసించింది. నటనలో ఆమెకున్న అంకితభావాన్ని చూసి నటుడు విక్రమ్ ఆమెను ‘లేడీ కమల్ హాసన్’ అని ప్రశంసించారు. శింబు సరసన మన్మధన్ సినిమాలోనూ కనిపించింది.
జ్యోతిక చేసిన సినిమాలలో ఎక్కువ విజయవంతమైంది చంద్రముఖి. తమిళనాడు స్టేట్ ఫిల్మ్ పురస్కారంతో పాటు చంద్రముఖిగా ఆమె కనబరిచిన నటనకు ఎన్నో ప్రశంసలు దక్కాయి. అలా తమిళంలో అగ్రహీరోలందరితో కలిసి పనిచేసింది. ముఖ్యంగా జ్యోతిక, సూర్య జోడీ తమిళ జనాన్ని భలేగా అలరించింది. వారిద్దరూ కలసి ఏడు చిత్రాలలో నటించారు. “పూవెల్లాం కెట్టుప్పార్, ఉయిరిలే కలందతు, కాక్క కాక్క, పేరళగన్, మాయావి, జూన్ ఆర్, సిల్లునుమ్ ఒరు కాదల్” వంటి చిత్రాలలో జ్యోతిక, సూర్య కనువిందు చేశారు.
జ్యోతిక నిర్మాతగా కూడా పలు మంచి సినిమాలను నిర్మించారు. 36 వయసులో, మగువలు మాత్రమే, పొన్నగల్ వందాళ్, ఆకాశం నీ హద్దురా, జై భీమ్, ఓ మై డాగ్ వంటి సినిమాలను నిర్మించి ప్రొడ్యూసర్‌గా కూడా ఇండస్ట్రీలో ఓ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. జ్యోతిక నిర్మించిన "ఆకాశం నీ హద్దురా" చిత్రం ఏకంగా ఐదు జాతీయ అవార్డులు గెలుచుకోవడం విశేషం.
జ్యోతిక వ్యక్తిగత జీవితానికి వస్తే తన సహనటుడైన సూర్యను ప్రేమించి ఇరు పెద్దల అంగీకారంతో 2006 సెప్టెంబర్ 11న జ్యోతిక, సూర్య వివాహం జరిగింది. వారికి ఇద్దరు పిల్లలు – కూతురు పేరు దియ, కొడుకు పేరు దేవ్. పెళ్ళయ్యాక కొన్నాళ్ళు సినిమాలకు దూరంగా ఉన్న జ్యోతిక 2015లో ’36 వయదినిలే’ చిత్రంతో రీ ఎంట్రీ ఇచ్చారు. ఈ చిత్రాన్ని ఆమె భర్త సూర్య నిర్మించారు. తరువాత నుంచీ తనకు తగ్గ పాత్రల్లో నటిస్తూనే ఉన్నారు జ్యోతిక. నిజజీవితంలో జ్యోతికకు కార్తీ మరిది అవుతాడు. కానీ, ‘దొంగ’ చిత్రంలో వీరిద్దరూ అక్కాతమ్ముళ్ళుగా నటించడం విశేషం.
సినిమాల్లో బిజీగా ఉన్నప్పటికి సాంఘిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు జ్యోతిక. "అగరం ఫౌండేషన్"ను తన భర్త సూర్య, మరిది కార్తీతో కలిసి జ్యోతిక స్థాపించారు. తమిళనాడులోని నిరుపేద విద్యార్థులను ఈ ఫౌండేషన్ ద్వారా చదివిస్తున్నారు. అంతేకాకుండా, పేద పిల్లలకు పలు రకాల వైద్య సౌకర్యాలను అందిస్తున్నారు. శ్రీలంకలోని తమిళ శరణార్థులకు కూడా సూర్య, జ్యోతికలు సహాయం అందిస్తున్నారు. జ్యోతిక మరిన్ని పుట్టినరోజులు జరుపుకుంటూ ఆనందంగా సాగాలని ఆశిద్దాం.
- డి.వి.అరవింద్, మాగల్ఫ్ ప్రతినిధి
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్‌లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్‌ఫామ్..!!
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్‌తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!