హాస్యనట చక్రవర్తి ...!

- October 20, 2024 , by Maagulf
హాస్యనట చక్రవర్తి ...!

రాజబాబు–ఈ నాలుగక్షరాల పేరు ఒకప్పుడు తెలుగు సినిమాకు ఓ కమర్షియల్ ఎలిమెంట్! ప్రేక్షకులకు నవ్వులు పంచే యంత్రం. “నవ్వు నలభై విధాల గ్రేటు” అన్నది రాజబాబు చెప్పిన మంత్రం.తన నవ్వుల పువ్వులతో తెలుగువారికి హాస్యసుగంధాలు అందించారు రాజబాబు. తెరపై కనిపించగానే ప్రేక్షకుల పెదాలు నవ్వడానికి విచ్చుకొనేవి. ఇక ఆయన మెలికలు తిరిగే హాస్యాభినయం జనానికి కితకితలు పెట్టేది. నాటి టాప్ స్టార్స్ కు సమానంగా పారితోషికం పుచ్చుకున్న స్టార్ కమెడియన్ గానూ రాజబాబు రాణించారు. లెజెండరీ కమెడియన్.. ఎవర్ గ్రీన్ నటుడు..  హాస్యనట చక్రవర్తి రాజబాబు జయంతి.

రాజబాబు అసలు పేరు పుణ్యమూర్తుల అప్పలరాజు. 1937,అక్టోబర్ 20న ఉమ్మడి మద్రాస్ రాష్ట్రంలోని ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి పట్టణంలో పుణ్యమూర్తుల ఉమామహేశ్వర రావు , రవణమ్మ దంపతులకు జన్మించారు. ఆయనకు నలుగురు తమ్ముళ్ళు, ఐదుగురు అక్కాచెల్లెళ్ళు. రాజబాబు బాల్యం నుంచీ తన చేష్టలతో జనానికి వినోదం పంచేవారు. అప్పలరాజును అందరూ ముద్దుగా రాజాబాబు అంటూ పిలిచేవారు. తరువాతి రోజుల్లో నాటకాల్లో ఆ పేరుతోనే నటించారు రాజబాబు. ఇంటర్మీడియట్ కాగానే టీచర్ కోర్సు పూర్తిచేసి, కొంతకాలం ఉపాధ్యాయ వృత్తిలో రాణించారు. అప్పుడు కూడా నాటకాలు వేస్తూ ఆకట్టుకొనేవారు. రంగస్థలంపై ఆయన “నాలుగిళ్ళ చావిడి, కుక్కపిల్ల దొరికింది” వంటి నాటకాలతో పేరు సంపాదించారు.

రంగస్థలంలో రాణించిన రాజబాబు సినీ ప్రస్థానం అంత తేలికగా మొదలవలేదు. జమున, అల్లు రామలింగయ్యను తన ‘పుట్టిల్లు’ చిత్రం ద్వారా పరిశ్రమకు పరిచయం చేసిన గరికపాటి రాజారావు ఓ సారి రాజబాబు నటించిన నాటకం చూడటం జరిగింది. రాజబాబులోని టైమింగ్ రాజారావును ఆకట్టుకుంది. దాంతో ఆయన రాజబాబును మద్రాసు రమ్మని చెప్పారు. అలా రాజబాబు మద్రాసులో అడుగుపెట్టారు.పావలాతో మద్రాసుకు చేరుకున్న ఆయన అన్నం లేక, సరైన బట్టలేక కార్పొరేషన్ నీళ్లతో ఏ రోజయినా కడుపునిండా అన్నం పెడితే దాంతో రెండు మూడు రోజులు బతికేవారు. అలా అప్పుడప్పుడు అన్నం పెట్టిన మహానుభావుడు ఆనాటి హీరోయిన్ రాజసులోచన ఇంటితోటమాలి. ఆరంభంలో సినిమా అవకాశాలు దొరక్క ట్యూషన్స్ చెప్పుకుంటూ గడిపారు రాజబాబు.

 అడ్డాల నారాయణరావు అనే దర్శకుడు తాను తెరకెక్కించిన ‘సమాజం’ చిత్రంలో రాజబాబుకు అవకాశం కల్పించారు. ఆ తరువాత నటరత్న ఎన్టీఆర్ నటించిన ‘ఆత్మబంధువు’లో సూర్యకాంతం కొడుకుగా నటించి, ఆకట్టుకున్నారు రాజబాబు. అతి తక్కువ కాలంలోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న రాజబాబు తన నటజీవితాన్ని కామెడీతో ప్రారంభించినా విలనీతో పాటు విభిన్న పాత్రలను పోషించి మెప్పించారు.‘బందిపోటు, మంచి మనిషి’ వంటి చిత్రాల్లో బిట్ రోల్స్ లో కనిపించారు. అప్పట్లో పద్మనాభం, చలం వంటివారు కమెడియన్స్ గా రాజ్యమేలుతున్నారు. వారి మధ్య రాజబాబు రాణించడం కష్టం అని చాలామంది అనుకున్నారు. అయితే రాజబాబు వారికి భిన్నంగా తనకంటూ ఓ ప్రత్యేకమైన బాణీని ఏర్పరచుకొని నవ్వించడం మొదలెట్టారు.

దిగ్గజ దర్శకుడు సి.పుల్లయ్య గారు రూపొందించిన ‘పరమానందయ్య శిష్యుల కథ’లో పద్మనాభం, అల్లు రామలింగయ్య వంటి మేటి నటులతో కలసి రాజబాబు తనదైన పంథాలో పకపకలు పంచారు. ఆ సినిమాతోనే రాజబాబుకు మంచి గుర్తింపు లభించింది.ఆ నాటి మేటి హీరోలందరి చిత్రాలలోనూ రాజబాబు హాస్యం తప్పనిసరిగా ఉండేది. తెరపై రాజబాబు, రమాప్రభ జోడీ అనేక చిత్రాలలో ఎంతగానో నవ్వులు పూయించింది.దాసరి నారాయణరావు దర్శకత్వంలో రూపొందిన తొలి చిత్రం ‘తాత-మనవడు’లో తాతగా ఎస్వీ రంగారావు, మనవడుగా రాజబాబు నటించారు. ఆ సినిమా మంచి విజయం సాధించింది. తరువాత దాసరి దర్శకత్వంలోనే రాజబాబు హీరోగా “తిరపతి, ఎవరికి వారే యమునా తీరే” వంటి చిత్రాలు రూపొందాయి. ‘పిచ్చోడి పెళ్ళి, మనిషి రోడ్డున పడ్డాడు’ వంటి చిత్రాల్లోనూ రాజబాబు హీరోగా నటించారు.దాసరి రూపొందించిన చిత్రాల్లో మంచి పాత్రలు చేశారు రాజబాబు. ‘బావా… బావ” అనుకుంటూ ఎంతో ఆప్యాయంగా మెలిగే వారిద్దరు.

కామెడీ ఆర్టిస్టుల్లో రాజబాబు స్థానం ప్రత్యేకమైంది పాతతరం హాస్యనటుల్లో కస్తూరి శివరావు, రేలంగి వెంకట్రామయ్య తరువాత అంత వైభవాన్ని కళ్ల చూసింది ఆయనే. రాజబాబు తీసుకున్నంత పారితోషికం మరే ఇతర హాస్యనటుడు తీసుకోలేదేమో! ఆ రోజుల్లో కొంతమంది హీరోల పారితోషికానికి సమానంగా ఆ మొత్తం ఉండేది. ఒకచోట కుదరుగా ఉండకుండా వంకర్లు తిరిగిపోతూ వెరయిటీ మాడ్యులేషన్తో రాజబాబు డైలాగులు చెబుతుంటే ప్రేక్షకులు నవ్వు ఆపుకోలేకపోయేవారు. అప్పట్లో హాస్యనటులకు నంది అవార్డులు లేవు. అయితే రాజబాబు హాస్యాభినయాన్ని గౌరవిస్తూ అనేక సాంస్కృతిక సంస్థలు అవార్డులు ప్రదానం చేశాయి. మద్రాస్ ఆంధ్రా క్లబ్ రోలింగ్ షీల్డ్ ను వరుసగా ఐదు సంవత్సరాలు అందుకున్న ఘనత రాజబాబుదే దక్కింది. హాస్య నట చక్రవర్తి బిరుదును సైతం అందుకున్నారు.  

‘బాబ్ అండ్ బాబ్ క్రియేషన్స్’ పతాకంపై రాజబాబు చిత్రాలు నిర్మించారు. ఈ పతాకంపై రూపొందిన చిత్రాలలో దాసరి దర్శకత్వంలో వచ్చిన ‘ఎవరికి వారే యమునా తీరే’ మంచి విజయం సాధించగా, ‘మనిషి రోడ్డున పడ్డాడు’ అంతగా ఆకట్టుకోలేకపోయింది. ‘రాధమ్మ పెళ్ళి’ చిత్రంలో రాజబాబు, రమాప్రభ స్వయంగా “కాకినాడ రేవు కాడా ఓడెక్కి…” సాంగ్ పాడటం విశేషం. అంతే కాకుండా, కొన్ని పాటల్లో రాజబాబు స్వయంగా గళం వినిపించినవీ ఉన్నాయి. ఆరంభంలో హిట్ చిత్రాలు తీసినా తర్వాత కాలంలో వరుస పరాజయాలు కావడంతో నిర్మాణ రంగానికి దూరమయ్యారు.

వెండితెర మీద ఎవర్ గ్రీన్ నటుడుగా గుర్తింపు తెచ్చుకున్న ఆయన అంతకంటే మంచి మనిషి.  మంచి పనులు చేయాలన్న తపనతో రాజబాబు పబ్లిక్ ట్రస్ట్ ఏర్పాటు చేసి తన శక్తి మేరకు ఇతరులకు ఆర్ధికంగా సహాయంచేసేవారు. ముఖ్యంగా తన పుట్టినరోజు ఏ ప్రయోజనం లేకుండా జరగడం అసంతృప్తికరంగా అనిపించి ఆ రోజుని సీనియర్స్ ని సన్మానించేవారు రాజబాబు. నాటక ప్రదర్శనలు ఏర్పాటు చేసి కొత్త నటీనటులు పరిశ్రమకి పరిచయం కావడానికి దోహదపడ్డారు. ప్రముఖ సీనియర్ హాస్యనటుడు బాలకృష్ణ (అంజిగాడు) అంటే ఎంతో అభిమానం ఉన్న రాజబాబు తను హాస్య నటుడిగా స్థిరపడిన తరువాత ఓ పుట్టిన రోజున బాలకృష్ణను సన్మానించి తన అభిమానాన్ని చాటుకున్నారు.

 రాజబాబు వ్యక్తిగత జీవితానికి వస్తే తాను ప్రేమించిన లక్ష్మీ అమ్ములును పెద్దల ఆశీర్వాదంతో 1965,డిసెంబర్ 5న వివాహమాడారు. వారికి ఇద్దరు కుమారులు నాగేంద్రబాబు, మహేశ్ బాబు. వారిద్దరూ ప్రస్తుతం అమెరికాలో స్థిరపడ్డారు. మహాకవి శ్రీశ్రీ, రాజబాబు గార్లు  తోడల్లుళ్ళు. శ్రీశ్రీ భార్య సరోజ గారికి రాజబాబు అర్ధాంగి లక్ష్మీ అమ్ములు గారు సోదరి. రాజబాబు తమ్ముళ్ళలో చిట్టిబాబు, అనంత్ ఇద్దరూ హాస్యనటులుగా రాణించారు.

ప్రేక్షకులకు నవ్వులు పంచే రాజబాబు జీవితం వెనుక బలమైన విషాదం ఏదైనా దాగి ఉందా అనిపించేది ఒక్కోసారి. ఆయన తాగిన మత్తులో ఉన్నా, లేకపోయినా వేదాంత వైరాగ్యాల గురించి సుదీర్ఘంగా మాట్లాడేవారు. అలాగే ఇంటర్వ్యూల సారాంశం వేదాంతపరంగానే ఉండేది. తెరపై అంతగా నవ్వించే రాజబాబు ఎంతో భావగర్భితంగా, వేదాంత ధోరణిలో మాట్లాడటం అందరినీ ఆశ్చర్యపరిచేది.

రాజబాబు కెరీర్ కుదేలవడానికి ప్రధాన కారణం మద్యపానమే కారణమని చెబుతారు. మొదట్లో ఉన్న షూటింగ్ స్పాట్ కు అందరికంటే ముందు వచ్చే ఆయన్ను మద్యపాన బలహీనత బాగా దెబ్బతీసింది.  రాజబాబుని పెట్టుకుంటే సినిమాకి హెల్ప్ అవుతుందనుకునే రోజులు పోయి ఆయనతో సినిమా చేయడం రిస్క్ అని భావించే పరిస్థితి ఏర్పడింది. నిర్మాతగా తీసిన సినిమాలు వరుసగా పరాజయం చవిచూడం కూడా ఆయన మానసికంగా కుంగిపోయారు. చివరి రోజుల్లో మానసిక, ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడ్డారని ఆయన్ను దగ్గర నుంచి గమనించినవారు చెబుతారు.1983, ఫిబ్రవరి 14న అనారోగ్యం కారణంగా 48వ యేట హైదరాబాద్ నగరంలో కన్నుమూశారు. ఆయన మరణించి నాలుగు దశాబ్దాలు అవుతున్నా ఆయన  స్థానం ఈ నాటికీ భర్తీ కాలేదు. తెరమీద రాజబాబు పండించిన హాస్యం మాత్రం తెలుగువారి మదిలో ఇప్పటికి నిలిచే ఉంది. జనానికి రాజబాబు హాస్యం గుర్తుకు వచ్చినపుడల్లా నవ్వులు వారి సొంతమవుతూనే ఉన్నాయి.


--డి.వి.అరవింద్(మాగల్ఫ్ ప్రతినిధి)

 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com