నవ తెలుగు పాత్రికేయ వైతాళికుడు-నార్ల

- December 01, 2024 , by Maagulf
నవ తెలుగు పాత్రికేయ వైతాళికుడు-నార్ల

తెలుగు పత్రికా రచనను కొత్త పుంతలు తొక్కించిన బహుముఖ ప్రతిభాశీలి మరియు మేధావి ఆయన. మూడు దశాబ్దాల పాటు తెలుగు పాఠకులకు సుపరిచితుడైన ఆయన శతక పద్యాల ద్వారా బాలలకూ చేరువయ్యాడు. తప్పు ఎవరు చేసినా తప్పే! అది మహాత్ముడు అయినా, భారత తొలి మహిళా ప్రధాని అయినా నిలదీయాల్సిందే! రాజకీయాల్లో నీతిని, సమాజంలో విలువలను దెబ్బతీసేవారిపై దండెత్తవలసిందే! అందుకనే.. ‘ఇప్పుడు గనుక నార్లవారు ఉంటేనా..’ అంటూ తెలుగు జాతి నిత్యం ఆయనను స్మరిస్తోంది. పత్రికా ఎడిటర్‌గా, రచయితగా, నాటకకర్తగా, విమర్శకుడిగా, అనువాదకుడిగా బహుముఖ పాత్రలు పోషించిన ఆయన ఛాందస విశ్వాసాలపై రాజీలేని పోరు సాగించి హేతుబద్ధమైన ఆలోచనలను ప్రజలకు చేరువ చేయడానికి ప్రయత్నించారు. నేడు సుప్రసిద్ధ పాత్రికేయ దిగ్గజం నార్ల వెంకటేశ్వరరావు జయంతి.

1908 డిసెంబర్ 1వ తేదీన నాటి సెంట్రల్ బేరార్ రాష్ట్రం (నేడు మధ్యప్రదేశ్‌) లోని జబల్‌పూర్‌లో ఉన్న తెలుగు కుటుంబంలో జన్మించారు. విద్యాభ్యాసమంతా కృష్ణా జిల్లాలోనే జరిగింది. చిన్ననాడే ఆయనకు సామాజిక స్పృహ అలవడింది. చిన్నప్పటి నుండీ రచనా వ్యాసంగమంటే విపరీతమైన ఆసక్తిని కనబరిచిన ఆయన మూడు పదులు కూడా నిండని వయసులోనే సొంతంగా గ్రంథాలయం నడిపారు. ఆరోజుల్లోనే దాదాపు 20 వేల పుస్తకాలు స్వయంగా సేకరించారట. స్వరాజ్య, జనవాణి, ప్రజామిత్ర  లాంటి పత్రికలతో ప్రారంభమైన ఆయన జర్నలిజం కెరీర్ ఆ తర్వాత పెద్ద పత్రికల వైపు కూడా మళ్లింది.

నార్ల వెంకటేశ్వరరావు పేరు వినపడగానే సంపాదకీయం గుర్తుకు వస్తుంది. ఆంధ్రప్రభ, ఆంధ్ర జ్యోతి పత్రికల ఎడిటర్‌గా ఆయన రాసిన సంపాదకీయలు ఎన్నో సంచలనాలు సృష్టించాయి. మరెన్నో సమస్యల పరిష్కారానికి దారులు వేశాయి. తనకు నచ్చని సంఘటనలు జరిగితే, తెగదెంచుకొని సంస్థలను వదిలివేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. నవ్యతనూ, నాణ్యతనూ మేళవించి తెలుగు పత్రికా రంగానికి ఆయన శోభను తీసుకువచ్చారు. 'సంపాదకీయం అనేది పత్రికకు గుండె వంటిది.నిష్పక్షపాతంగా సంపాదకీయం రాసిన నాడు సమాజానికి మేలు చేసిన వారం అవుతాం' అని ఆయన తరచూ చెబుతూ ఉండటమే కాకుండా, నిరూపించారు కూడా. ఆయన సంపాదకీయం చదవటం కోసమే పత్రిక కొనుగోలు చేసే పరిస్థితిని తీసుకువచ్చారు.

ఆంధ్రప్రభ, ఆంధ్రజ్యోతి దినపత్రికలలో ఆయన సంపాదకీయాలు రాజకీయ, సామాజిక వ్యవస్థలపై చాలా ప్రభావాన్ని చూపాయనడంలో ఏ మాత్రం అతిశయోక్తి లేదు. పాత్రికేయులు పాటించవలసిన విధి విధానాలను ఆయన ఎప్పటికప్పుడు గుర్తు చేస్తూ ఉండేవారు. ఏనాడూ రాజీ పడి తన వృత్తిని నిర్వహించలేదు. 'ప్రజాస్వామ్యం విజయవంతం కావాలన్నా, ప్రజా వ్యతిరేక ప్రభుత్వాల నుంచి ప్రజలు రక్షణ పొందాలన్నా పత్రికలు అత్యంత ఆవకశ్యకం' అనేవారు. పత్రికలే లేకపోతే ప్రజాస్వామ్యానికి మనుగడే లేదని హెచ్చరించేవారు. 'అధికార పక్షం నిరంకుశంగా వ్యవహరించినపుడు దానికి అడ్డుకట్ట వేయడానికి ప్రతిపక్షాల కన్నా పత్రికలే కీలకం' అంటూ ఉండేవారు.

'పాత్రికేయం అంటే ప్రజల పక్షాన నిలబడాలి కానీ, రాజకీయాల పక్షాలు వైపు కాదని' ప్రజా పాత్రికేయానికి ఆయన శ్రీకారం చుట్టారు. అంతేకాదు, పత్రికలలో ఉపయోగించే భాష సామాన్యులకు కూడా అర్థం కావాలనేవారు. పాత్రికేయాన్ని ప్రజల భాషకు చేరువ చేయడంలో ఆయన కృతకృత్యులయ్యారు. కాగడా, జనవాణితో తాపీ ధర్మారావు ప్రారంభించిన వ్యావహారిక భాషా ఉద్యమాన్ని నార్ల ఆంధ్రప్రభ, ఆంధ్రజ్యోతి ద్వారా సమర్థంగా కొనసాగించారు. 'తెలుగులో ఆలోచించి, తెలుగు నుడికారంలో తెలుగుదనం ఉట్టిపడేటట్టు రాయగలిగినప్పుడే తెలుగువారిలో మనం కదలిక పుట్టించగలం' అని ఆయన తోటి జర్నలిస్టులకు ఉద్బోధించారు.

పాత్రికేయం వేదికగా సమాజ రుగ్మతలను చీల్చిచెండాడారు. తెలుగు పత్రికారచనకు వ్యక్తీకరణను ఇచ్చిన ఘనత నార్లవారిదే! ‘ఆంధ్రజ్యోతి’ వ్యవస్థాపక సంపాదకునిగా పాత్రికేయ చరిత్రని మలుపు తిప్పారు. మూడు పదుల కాలం ఆయన కలం పరుగు తీసింది. ఆయన ప్రజల భాషకు పట్టం కట్టారు. పత్రికలలో బడులు వాడే వాడు బడుద్దాయి అని చమత్కరించిన ఆయన.. సంపాదకుడు కాదు ఎడిటర్‌ అనాలని సరిదిద్దారు. సంస్కృతభాషను విస్తృతంగా ప్రచారం చేయాలన్న వాదనను ఆయన తిరస్కరించారు.

నార్ల వారు ఏ విషయంలోనైనా సత్వరం స్పందించేవారు. నాన్చుడు తెలియదు. ముక్కుమీద గుద్దినట్టు రాయడం ఆయన ప్రత్యేకత. 'బుద్ధి చెప్పువాడు గుద్దితేనేమయా' అన్న వేమన అభిప్రాయాన్ని అక్షరాలా అమలు చేసి పత్రికా రచయిత నార్ల. టంగుటూరి ప్రకాశం పంతులు, నీలం సంజీవరెడ్డి, కళా వెంకటరావు, ఎన్‌జీ రంగా, కాసు బ్రహ్మానందరెడ్డి మొదలైన పెద్దలందరూ నార్ల కలంపోటుకు గురైనవారే. తేడా వస్తే, పతాక శీర్షికలలో వారి గురించి ధ్వజమెత్తేవారు. అంతటి ధైర్యశాలి నార్ల. జీవిత కాలం అంతా ఆయన ఏ ఒక్క 'ఇజమ్‌'కూ లొంగకుండా, దేనికీ తలవంచకుండా స్వేచ్ఛగా వృత్తిని కొనసాగించి ఆదర్శ ప్రాతికేయులయ్యారు. పాత్రికేయానికి మార్గదర్శకులయ్యారు.

నార్ల పాత్రికేయుడు మాత్రమే కాదు సాహితీవేత్త, కవి, రచయిత, ఉద్యమకారుడు, హేతువాది, మానవవాది. అనేక కవితా ఖండికలు, పద్య సంకలనాలు, సాంఘిక, పౌరాణిక నాటకాలు, వ్యాసాలు రాశారు. వివిధ దేశాల చరిత్రలు, ఎందరో మహానుభావుల జీవిత చరిత్రలు, విజ్ఞాన, నైతిక విలువలను సామాన్య ప్రజానీకానికి పరిచయం చేశారు. ఆయనకు తెలుగుపైనే కాదు ఆంగ్లంపైన కూడా మంచి పట్టు ఉండేది. ఆంగ్లంలో కూడా అనేక రచనలు చేసి పలువురు ప్రశంసలు పొందారు. మూఢ నమ్మకాలు, ఛాందసాలను విమర్శించారు. సామాజిక పరిణామాలను భౌతికవాద దృష్టితో పరిశీలించడం నార్ల ప్రత్యేకత.

సమాజంలో తరాలుగా పాతుకుపోయిన అంధ విశ్వాసాలను, సంప్రదాయాలను ప్రశ్నిస్తూ 'సీత జోస్యం' రాశారు. అగ్రకులాధిపత్యానికి, ఆధిపత్య భావజాలానికి సవాలు విసురుతూ 'శంభూక వధ' రాశారు. విశ్వనాథ సత్యనారాయణ, వడ్లమూడి గోపాలకృష్ణయ్య వంటి వారి ఆస్తిక, ఛాందస భావజాలాన్ని, మూఢ విశ్వాసాలను నార్ల తీవ్రంగా విమర్శించేవారు. బాలల కోసం 'వాస్తవమ్ము నార్లవారి మాట' మకుటంతో దాదాపు 700 సందేశాత్మక పద్యాలు ఆటవెలదిలో రాశారు. జాబాలి, నరకంలో హరిశ్చంద్రుడు, ద్రౌపది, హిరణ్యకశ్యపవధ అనేవి ఆయన ఇతర రచనలు.
 
రాజకీయరంగంలో నీతి నిజాయితీ చెదిరిపోవడం ఆయనను బాధించింది. ‘‘మనం, మన దాస్యబుద్ధి ’’ అనే శీర్షికతో ఆయన ఎమర్జెన్సీని విధించిన అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ, ఆమె తనయుడు సంజయ్‌గాంధీలపై చేసిన సూటి విమర్శ దేశాన్ని కదిలించింది. ‘వన్‌ అండ్‌ హాఫ్‌ పర్సన్‌’ అంటూ బాబూ జగ్జీవన్‌రామ్‌ చేసిన వ్యాఖ్యలకు సమర్థనగా రాసిన ఈ సంపాదకీయంపై పార్లమెంటులోనూ చర్చ జరిగిందట. ఆయన 1958-70 వరకు వరసగా రెండుసార్లు రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు.

తెలుగు ప్రాంతం అభివృద్ధి చెందాలని కాంక్షించిన నార్లవారు, దానికి అడ్డుగా ఉన్న ఏ సామాజిక, రాజకీయ అంశాన్నీ సహించలేదు. 1955లో కమ్యూనిస్టులతో ఆయన సల్పిన కలం పోరాటం చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖితమైంది.సూటిదనం శైలిగా, గడుసుదనమే బాణిగా, వ్యంగ్య చమత్కారాలే పాళిగా తెలుగు పత్రికా చరిత్రలో ఐదు దశాబ్దాలకు పైగా వర్ధిల్లిన నార్ల వారు 1985, ఫిబ్రవరి16న తుదిశ్వాస విడిచారు. నార్ల వారి ఆశయాలను ఆచరణలో చూపగలిగినప్పుడే ఆయనకు నిజమైన ఘన నివాళి. 

  --డి.వి.అరవింద్(మాగల్ఫ్ ప్రతినిధి)    

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com