దళిత బాంధవి-జెట్టి ఈశ్వరీబాయి

- December 01, 2024 , by Maagulf
దళిత బాంధవి-జెట్టి ఈశ్వరీబాయి

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సామాజిక సేవా రంగంలో గణనీయమైన కృషి సలిపిన వారిలో ఒకరు జెట్టి ఈశ్వరీబాయి. కుల వివక్ష, లింగ వివక్ష రాజ్యమేలిన రోజుల్లో ఎన్ని కష్టాలు ఎదురైనా, ధైర్యంగా నిలబడి తరతరాల నుంచి సమాజంలో పీడనకు గురి అవుతూ, బానిసత్వంలో మగ్గుతూ అణగారిన ప్రజలకు విముక్తి కలిగించడానికి ఆమె ఎంతగానో కృషిచేశారు. హైదరాబాద్ నగరంలోని మహిళలు  ఘోషా పద్ధతి పాటించే సాంప్రదాయంలో కొట్టుమిట్టాడుతున్న సమయంలోనే ఆమె సంఘ సేవలో నిమగ్నమయ్యారు. హైదరాబాద్ కేంద్రంగా కొనసాగిన దళిత ఉద్యమాల్లో చురుకైన పాత్ర పోషించారు. నేడు ప్రముఖ సంఘ సేవకురాలు, రాజకీయవేత్త ఈశ్వరీబాయి గారి 106 వ జయంతి.

ఈశ్వరీబాయి 1918 డిసెంబర్1 సికింద్రాబాద్ లోని చిలకలగూడ ప్రాంతంలో సామాన్య నిమ్న కులానికి చెందిన బల్లెపు బలరామస్వామి, రాములమ్మ దంపతులకు జన్మించారు. సికింద్రాబాద్ ఎస్పీజీ మిషన్ స్కూల్లో ఈశ్వరీబాయి ప్రాథమిక విద్య, కీస్ హైస్కూల్లో ఉన్నత విద్యను పూర్తి చేశారు. తెలుగు, ఉర్దూ, హిందీ, ఇంగ్లీష్, మరాఠీ భాషల్లో పట్టు సాధించారు. తన13వ ఏట డా.జె.లక్ష్మీనారాయణతో పెండ్లయ్యింది.

భర్త హఠాన్మరణంతో ఈశ్వరీబాయి తన కూతురుతో పాటు పుట్టింటికి చేరారు. అప్పటి నుంచి సొంత కాళ్లపై నిలబడటం అలవాటు చేసుకున్నారు. తొలుత సికింద్రాబాద్ లోని ఒక స్కూల్లో టీచర్‌‌‌‌‌‌‌‌గా జీవితం ప్రారంభించారు. తర్వాత పౌరసరఫరాల శాఖలో ఉద్యోగం వచ్చింది. కొద్దిరోజులకు చిలకలగూడలో ‘గీతా విద్యాలయం’ స్థాపించి, ఆ  ప్రాంతంలో వెనుకబడిన మహిళలను చేరదీసి వారికి చదువు చెప్పడంతోపాటు చేతి వృత్తుల్లో శిక్షణ ఇప్పించి సొంత కాళ్లపై నిలబడేలా చేశారు.


1942లో జరిగిన అఖిల భారత నిమ్న కులాల సభలో తొలిసారి ఆమె డాక్టర్ బీఆర్ అంబేద్కర్  ప్రసంగం విని ఆయన మాటల ద్వారా ప్రభావితం అయ్యారు. అప్పటి నుంచి ఆయన బాటలో నడవడం మొదలు పెట్టారు. మహిళలు అభివృద్ది చెందాలంటే అందుకు మహిళా  సాధికారికత అతి ప్రధానమైనదని ఆమె ప్రగాఢంగా  విశ్వసించారు. అదే సమయంలో తెలుగు నేలపై దళితోద్యమానికి పునాదులు వేసి, మహాత్మా జ్యోతిరావు ఫూలే స్ఫూర్తితో హైదరాబాద్‌‌‌‌లో బాలికల కోసం ప్రత్యేక పాఠశాలలను స్థాపించిన దళితోద్యమ నేత మాదరి భాగ్యరెడ్డి వర్మ, బి.ఎస్.వెంకట్రావు, అరిగే రామస్వామి, జే.హెచ్.సుబ్బయ్య, బత్తుల శ్యాం సుందర్ లాంటి వారు ‘ఆది హిందూ సోషల్ సర్వీస్ లీగ్’ ద్వారా చేస్తున్న దళితోద్ధారక కృషిలో ఆమె భాగస్వామి అయ్యారు.

సమాజంలో పేరుకుపోయిన అసమానతలు, అణచివేతలు, సాంఘిక దురాచారాలను రూపుమాపడానికి ఉద్యమాల్లో ఉవ్వెత్తున పాల్గొన్న ఆమె, క్షేత్ర స్థాయిలో పోరాడటం ఎంత ముఖ్యమో చట్టాలు చేసే చట్ట సభల్లో గొంతెత్తడం కూడా అంతే ముఖ్యమని తలచారు. ఇదే దశలో   అంబేద్కర్ చెప్పిన ‘Political Power is the Master Key by which you can open all the doors of progress of social, economic and cultural aspects’ నినాదాన్ని సరిగ్గా అర్థం చేసుకుని దళితులు స్వీయగౌరవంతో జీవించాలంటే, వేల ఏళ్లుగా నిరాకరించబడిన హక్కుల్ని సాధించాలంటే, సామాజిక–ఆర్థిక–సాంస్కృతిక రంగాల్లో అభివృద్ధి చెందాలంటే రాజ్యాధికారం ద్వారానే సాధ్యమని భావించిన ఈశ్వరీ బాయి రాజకీయ రంగ ప్రవేశం చేశారు.

అప్పటికే పేరు మోసిన కాంగ్రెస్, లేదా ఇతర అగ్రకులాల ఆధిపత్య భావజాలంలో నడుస్తున్న పార్టీల్లో ఆమె చేరలేదు. ఎవరికీ తలవంచకుండా, స్వాభిమానంతో, స్వతంత్రంగా రాజకీయాలు చేయాలని భావించి 1952లో సికింద్రాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి కార్పొరేటర్‌గా ఎన్నికయ్యారు. అగ్రవర్ణ దురహంకార సమాజం, ఒక దళిత మహిళ కార్పొరేటర్ అయితే తట్టుకోగలదా? ముమ్మాటికీ తట్టుకోదు. అందుకే కార్పొరేటర్ అయ్యాక ఈశ్వరీబాయిపై హత్యాప్రయత్నాలు అనేకం జరిగాయి.

సిద్ధాంతం కోసం అసువులు బాసినా పర్వాలేదు కానీ అడుగు వెనక్కి వేసేది లేదు అని ధైర్యంగా ముందుకు సాగిన వీరవనిత ఈశ్వరీ బాయి. ఆమె తన రక్షణ కోసం కారులో ఒక కర్ర, కారంపొడి, రాళ్ళు పెట్టుకుని రాత్రిళ్ళు కూడా బస్తీల్లో తిరుగుతూ రౌడీ ముఠాల అరాచకాలను అడ్డుకునేవారు. క్రమక్రమంగా ఆమె తన రాజకీయ పరిజ్ఞానాన్ని పెంచుకుంటూ 1962లో అంబేద్కర్ ఆశయాల ప్రతిరూపమైన ఆర్‌పిఐ (రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా)లో చేరారు.

1967 అసెంబ్లీ ఎన్నికల్లో నిజామాబాద్ జిల్లాలోని ఎల్లారెడ్డి నియోజకవర్గం నుంచి ఎమ్మేల్యేగా పోటీ చేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి టి.ఎన్.సదాలక్ష్మిపై, రెండోసారి 1972లో నంది ఎల్లయ్యపై గెలుపొందారు. తను ఎమ్మెల్యేగా ఉన్నపుడు 1969లో నీళ్ళు–నిధులు–నియామకాలు అనే నినాదంతో ప్రత్యేక తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున సాగుతున్న సమయంలో ఆమె అలుపెరగకుండా ఉద్యమంలో క్రియాశీలకంగా పనిచేశారు. చెన్నారెడ్డి నాయకత్వంలో ఏర్పడిన తెలంగాణ ప్రజా సమితికి వైస్–ప్రెసిడెంట్‌గా వ్యవహరిస్తూ తెలంగాణ ప్రజానీకానికి వివిధ రంగాల్లో జరుగుతున్న అన్యాయాలను అధ్యయనం చేయడానికి తెలంగాణ జిల్లాల్లో విస్తృతంగా పర్యటించారు.

ఒకానొక దశలో ప్రధాన నాయకత్వం మొత్తం జైలు పాలైనపుడు ఉద్యమాన్ని సజీవంగా నిలబెట్టిన నిజమైన తెలంగాణ తల్లి ఈశ్వరీ బాయి.ప్రజాస్వామ్యయుతంగా జరుగుతున్న తెలంగాణ ఉద్యమాన్ని పోలీస్ లాఠీ దెబ్బలతో, తుపాకీ తూటాలతో అతి క్రూరంగా అణిచివేయడం అప్రజాస్వామికమని ఆంధ్ర పాలకులపై అసెంబ్లీ వేదికగా ఆమె నిప్పులు చెరిగారు.

ఎమ్మెల్యేగా ఈశ్వరీబాయి అనునిత్యం అణగారిన ప్రజల అభివృద్ధి కోసం ఆరాటపడ్డారు. ప్రాంతీయ బేధం లేకుండా తెలంగాణ, కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో ఏ మూలన అన్యాయం జరిగినా అక్కడ బాధితుల పక్షాన ఆమె నిలువెత్తు ధైర్యమై నిలబడ్డారు. మత్స్యకారుల హక్కులను కాలరాస్తూ కామారెడ్డి పెద్ద చెరువును వారికి దూరం చేస్తూ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవోను వెనక్కి తీసుకునే వరకు పోరాడి మత్స్యకారులకు చెరువు ఇప్పించారు.  

ఎస్సీ సంక్షేమ హాస్టళ్లలో నెలకొన్న సమస్యలపై, వ్యవసాయ రైతుల సమస్యలపై, బంజరు భూముల పంపిణీపై, చేనేత కార్మికుల సమస్యలపై, విద్య–వైద్యం–ఆరోగ్యం, నిరుద్యోగ సమస్య, ఉపాధి కల్పన, జైళ్లలో మగ్గిపోతున్న ఖైదీల సమస్యలపై, టీచర్స్, ఉద్యోగుల సమస్యలపై, వృద్ధాప్య పింఛన్ల పెంపు కోసం చర్చించడానికి అసెంబ్లీని ఆమె చక్కగా ఉపయోగించుకున్నారు.

సామాజిక, రాజకీయ రంగాల్లో ఈశ్వరీబాయి చెరగని ముద్ర వేశారు. సామాజిక రంగంలో ఆమె మొదలు పెట్టిన సేవలు, ఈశ్వరీబాయి ఛారిటబుల్ ట్రస్ట్ ద్వారా నేటికి కొనసాగుతున్నాయి. కౌన్సిలర్ గా, ఎమ్మెల్యేగా, ప్రజా నాయకురాలిగా, ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడుతూ సబ్బండ వర్గాల మన్ననలను ఆమె పొందగలిగారు. ప్రజా సమస్యలపై నిర్విరామంగా, అలుపెరగకుండా అనేక సమస్యలపై పోరాటం చేసిన ఈశ్వరీబాయి గారి ఆరోగ్యం క్షీణించి 1991 ఫిబ్రవరి 24న అంతిమశ్వాస విడిచారు. లింగ వివక్షను ఎదుర్కొంటూ సామాజిక, రాజకీయ రంగాల్లో రాణించాలనుకునే మహిళలకు ఆమె జీవితం ఆదర్శం.

  --డి.వి.అరవింద్(మాగల్ఫ్ ప్రతినిధి)    

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com