చెరకు గడా? వెదురు గడా?

- July 08, 2015 , by Maagulf
చెరకు గడా? వెదురు గడా?

అనగనగా ఒక ఊరు. ఆ ఊరిలో సుబ్బయ్య అనే రైతు ఉండేవాడు. అతను తన పొలంలో ఒక పక్కగా చెరకు తోట వేసి, జాగ్రత్తగా వాటికి పోషణ చేసేవాడు. దాంతో ఆ చెరకు తోట ఏపుగా పెరగసాగింది. ఆ తోటకు కొద్ది దూరంలో తుప్పల్లో వెదురు గడల తోట కూడా ఉండేది. దానికి ఎవ్వరూ ఏ పోషణా చెయ్యకపోయినా చెరుకు కన్నా ఏపుగా పెరిగి ఆకర్షిస్తూ ఉండేవి. అయితే ఈ చెరకు గెడలకు ఆ వెదురు పొదలను చూస్తే అసూయగా ఉండేది. దాంతో ఎప్పుడూ ఆ చెరకు గడలతో పోటీ పడుతూ వాటిని గేఇ చేస్తూ ఉండేవి. మా రైతుకు మేమంటే చాలా ఇష్టం. అందుకే మమ్మల్నింత ఇంత బాగా చూసుకుంటాడు. మీకు పోషణ చేసేదెవ్వరు? అని వాటిని తక్కువ చేసి మాట్లాడుతూ ఉండేవి. అందుకు వెదురు గడలు చాలా సున్నితంగా ఎవరి విలువ వారికి ఉంటుంది. మమ్మల్ని అలా తక్కువ చేయకండి అని చిరునవ్వుతో సమాధానం ఇస్తూ ఉండేవి. ఇలా ఉండగా ఒకరోజు ఆ ఊరి జమీందారుగారమ్మాయి పెళ్లికనీ, కొందరు పనివాళ్లు వచ్చి పందికి రాటల కోసం వెదురు గడలను నరుక్కుని తీసుకెళ్లిపోయారు. అందుకు చెరకు గడలు వాటిని చూసి ఇక మీ పనైపోయినట్టే. కానీ మమ్మల్ని చూడండి మీ కన్నా పొడుగ్గా, ఏపుగా ఉండి మా గడలు తనడానికి సిద్ధమవుతున్నాయి. అందుకే మమ్మల్ని జనం ఎంతో ఇష్టపడతారు అని మళ్లీ వాటి గొప్పలు మొదలుపెట్టాయి. అందుకు వెదురు గడలు మేము జనానికి ఎన్ని రకాలుగానో ఉపయోగపడతాం. ఇప్పుడు పెళ్లికి ముంగిట్లో పచ్చని పందిరి అయ్యి అందర్నీ ఆకర్షిస్తాం అని చెప్పాయి. మళ్లీ ఒకరోజు కొందరు మేదరి వాళ్లు వచ్చి మిగిలిన వెదురు ముక్కల్ని కూడా నరుక్కుని వెళ్లారు. అందుకు మళ్లీ చెరకుగడలు ఫక్కున నవ్వుతూ చూడండి మిమ్మల్ని సంరక్షించేవాళ్లే లేరు. ఎవరుపడితే వాళ్లు ఇష్టం వచ్చినట్లు నరుక్కుని పోతున్నారు అని అపహాస్యం చేశాయి. అందుకు వెదురుగడలు ఇప్పుడు మేం అందమైన బుట్టలు, చాపలు అల్లడానికి ఉపయోగపడతాం. అయినా మేం ఎంత నరికితే అంత ఏపుగా మళ్లీ పెరుగుతాం అని సమాధానం ఇచ్చాయి. కొన్నాళ్లకు చెరకు గడలకు చీడ పట్టి తోటంతా పాడయిపోయింది. అప్పుడు రైతు తోటకి వెదురు గడలగొట్టాలతోనే పిచికారీ చేశాడు. అప్పుడు కొన్నాళ్లకి మళ్లీ చెరకు తోట చిగురించి పచ్చగా మారింది. అప్పుడు చెరకుగడలు తాము వెదురుగడలను తక్కువ చేసి మాట్లాడినందుకు సిగ్గుతో తలదించుకుని, మీ విలువ గుర్తించనందుకు వెదురు గడలను క్షమించమని అడిగి అప్పటి నుండి ఆ విధంగా వెదురు గడలమీద నోరు పారేసుకోకుండా స్నేహంగా ఉంటూ వచ్చాయి.
నీతి - ఎవరి విలువ వారికుంటుంది. ఎవ్వరినీ ఎవ్వరూ తక్కువ చేసి చూడకూడదు అనేది ఈ కథలోని నీతి.


 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com